గవర్నర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

25 Dec, 2017 01:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : క్రిస్మస్‌ పర్వదినం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆనందంతో ఏసును గుర్తు చేసుకోవాల్సిన శుభసందర్భమిది. ప్రపంచానికి ఆయన ప్రబోధించిన ప్రేమ, జాలి, కరుణ, దయ గుణాలకు పునరంకితం కావాల్సిన సందర్భం కూడా. విశ్వాసం, సత్ప్రవర్తనతో మన జీవితాలను ముందుకు నడిపించడానికి క్రీస్తు జీవితం స్ఫూర్తిదాయకం. ఈ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరసోదరీమణులతో కలసి విశ్వశాంతి కోసం ప్రార్థిస్తున్నాను’’ అని గవర్నర్‌ తన సందేశంలో తెలిపారు.

క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శం: సీఎం కేసీఆర్‌
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన  క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

క్రీస్తు బోధనలు సదా అనుసరణీయం: చంద్రబాబు
సాక్షి, అమరావతి: క్రిస్మస్‌ పండుగ సందర్భంగా క్రైస్తవులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు విశ్వమానవాళి శ్రేయస్సును కాంక్షించారని, సమానత్వం, శాంతి, సహనం, ప్రేమ కలిగి ఉండాలని, నిస్సహాయులపై కరుణ చూపాలని ప్రబోధించారని పేర్కొన్నారు. క్రీస్తు బోధనలు సదా అనుసరణీయమన్నారు. క్రిస్మస్‌ పండుగను సంతోషంగా నిర్వహించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చంద్రన్న కానుకను క్రైస్తవులు స్వీకరించాలని కోరారు. గుంటూరులో క్రైస్తవ భవన్‌ నిర్మాణానికి రెండెకరాల భూమిని కేటాయించామని, వచ్చే క్రిస్మస్‌ను క్రిస్టియన్‌ భవన్‌లోనే నిర్వహిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు