నిబంధనలు తూచ్..

25 Sep, 2014 03:27 IST|Sakshi

శాతవాహన యూనివర్సిటీ :
 తమ రూటే సెప‘రేటు’ అని మరోసారి నిరూపించారు శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని పలు డిగ్రీ కళాశాలల యూజమాన్యాలు. వార్షిక పరీక్షలకు హాజరుకాకున్నా సప్లిమెంటరీలో పరీక్షలు రాయించడానికి పలు ప్రైవేట్ కళాశాలలు అడ్డదారులు తొక్కుతున్నాయి. వార్షిక పరీక్షలు రాయని విద్యార్థుల నుంచి పరీక్షల ఫీజు తీసుకుని పరీక్ష రాయిస్తామని నమ్మబలుకుతున్నాయి. విద్యార్థులను నుంచి అదనంగా వసూలుచేస్తూ ఆయా కళాశాలలు యూనివర్సిటీలోని పలువురు సిబ్బందితో కుమ్మక్కైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 అసలు విధానం..
 డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలంటే సదరు విద్యార్థి వార్షిక పరీక్ష ఫీజు కట్టి, పరీక్షల్లో ఏదేని పరీక్షకు విధిగా హాజరుకావాలన్నది యూనివర్సిటీ నిబంధన. అలాకాకుండా పరీక్ష ఫీజు మాత్రమే చెల్లించి ఏదేని కారణంతో పరీక్షకు హాజరుకాకపోతే సదరు విద్యార్థి మళ్లీ పునఃప్రవేశం పొంది తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రైవేట్ కళాశాలల యూజమాన్యాలు వార్షిక పరీక్ష ఫీజు చెల్లించకున్నా.. తరగతులకు హాజరుకాని విద్యార్థులకు అక్టోబర్ 8 నుంచి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేలా చూస్తామని పలువురి నుంచి అందినకాడికి దండుకుంటున్నట్లు సమాచారం.
 అడ్డదారి కళాశాలలపై చర్యలు?
 చొప్పదండి నియోజకవర్గంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల యూజమాన్యం పలువురు విద్యార్థులను అడ్డదారిలో పరీక్షలు రాయించడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి పరీక్ష రుసుం తీసుకుని పరీక్షలు ముగిసి ఒకవేళ ఆ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే వారి నుంచి వేలాది రూపాయలు దండుకుంటున్నారనే  విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారమంతా యూనివర్సిటీ అధికారుల ప్రమేయం లేకుండా జరుగుతుందా అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలోని కొంతమంది అధికారుల అండదండలతోనే ఈ తతంగం చక్కబెడుతున్నట్లు కొందరు బహిరంగంగానే విమర్శలు చేసున్నారు. మచ్చుకు చెప్పిన ఈ కళాశాలనే కాదు దాదాపు 20పైగా కళాశాలల్లో ఈ తతంగం నడుస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడ్డదారిలో నడిచే కళాశాలలపై యూనివర్సిటీ అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే..!


 

మరిన్ని వార్తలు