ఆధునిక పద్ధతిలో మూల్యాంకనం

22 Jun, 2014 00:48 IST|Sakshi
ఆధునిక పద్ధతిలో మూల్యాంకనం
  •      సమస్యలకు చెక్ పెట్టేందుకే..
  •      జేఎన్టీయూహెచ్‌లోనే వాల్యుయేషన్
  •      సకాలంలోనే బీటెక్, బీఫార్మసీ ఫలితాల  విడుదల
  • సాక్షి, సిటీబ్యూరో: పరీక్షా ఫలితాల విడుదల లో జాప్యంతోపాటు ఎదురయ్యే ఇతర సమస్యలకు చెక్ పెట్టేందుకు మూల్యాంకన విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్టు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎన్వీ రమణారావు తెలిపారు. శనివారం జేఎన్టీయూహెచ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ వ్యాప్తంగా 65 కేంద్రాల్లో మూల్యాంకనం జరిగేదన్నారు.

    ప్రస్తుతం జేఎన్టీయూహెచ్ వేదికగా ఒకేచోట అన్ని జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తున్నందున క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కు ఆధునిక ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. ఈ తరహా టెక్నాలజీ ఒక్క జేఎన్టీయూహెచ్‌లో మాత్రమే ఉందన్నారు. అంతేకాకుండా జవాబు పత్రాల బండిల్స్ మిస్ కాకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు.
     
    తేడాలొస్తే బ్లాక్‌లిస్ట్‌లో..
     
    మూల్యాంకనాన్ని మెరుగైన పద్ధతిలో చేపడుతున్నామని వర్సిటీ పరీక్షల విభాగం డెరైక్టర్ ఈశ్వర్‌ప్రసాద్ అన్నారు. జవాబు పత్రాన్ని మూడు నిమిషాలలోపు మూల్యాంకనం చేస్తే సర్వర్ అనుమతించదన్నారు. మూల్యాంకనంలో తేడాలను గమనించేందుకు ఒక చీఫ్ ఎగ్జామినర్‌తోపాటు నలుగురు అదనపు కంట్రోలర్లు ఉంటారన్నారు. ప్రతి బండిల్ నుంచి ర్యాండమ్‌గా రెండేసి పేపర్లు తనిఖీ చేస్తారని, తేడాలున్నట్టు తేలితే రీవాల్యుయేషన్ చేయిస్తామని తెలిపారు.

    నిర్లక్ష్యం వహించే ఆచార్యులను బ్లాక్ లిస్ట్‌లో పెడతామన్నారు. ఏటా ఫలితాలు వచ్చిన తరువాత కనీసం 15 వేలమంది రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌లకు దరఖాస్తు చేసుకునేవారని, మూల్యాంకనంలో నాణ్యతను పెంపొందించడంతో రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తుల సంఖ్య ఈ ఏడాది 1,500కు మించలేదన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతున్న తీరును సీసీటీవీల ద్వారా వీసీ, రిజిస్ట్రార్, రెక్టార్లు తమ చాంబర్‌నుంచే పర్యవేక్షిస్తారని చెప్పారు.

    మూల్యాంకనం తరువాత మార్కులను ఎప్పటికప్పుడు ట్యాబ్లెట్ పీసీల్లో నమోదు చేయడం ద్వారా నేరుగా సర్వర్‌కు అనుసంధానం చేశామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఫలితాలను సకాలంలో అందించాలనే ఉద్దేశంతో ఉదయం 9 నుంచి రాత్రి10 గంటల వరకు ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ రెక్టార్ టి.కిషన్ కుమార్‌రెడ్డి, వర్సిటీ ఇన్నోవేషన్ టెక్నాలజీ సెంటర్ డెరైక్టర్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు