కొత్త బ్యాంకు ఖాతాలు...

3 Sep, 2014 03:29 IST|Sakshi

పాలమూరు : కేంద్రం ఇటీవల ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ద్వారా జిల్లాలో 3లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. బ్యాంకు ఖాతాలేని కుటుంబాలకు కొత్తగా ఆ సౌకర్యాన్ని కల్పించనున్నారు. 3లక్షల ఖాతాల కింద *5వేల చొప్పున *50 కోట్ల వరకు లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఖాతాలు తెరవడం ప్రారంభమైంది. ప్రారంభమైన అయిదు రోజుల్లోనే జిల్లాలో దాదాపు 70 వేల ఖాతాలు ప్రారంభించారు.
 
 అందరికీ బ్యాంకు సేవలు అందుబాటులోకి తీసుకురావడం, ఆర్థిక అసమానతలు తొలగింపు, సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా అర్హులకు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. కేంద్రం ఆదేశాలతో బ్యాం కుల శాఖలు ఖాతాలు నమోదు చేస్తున్నాయి. గ్రామా లు, పట్టణాల్లోని వివిధ వార్డుల్లోని ప్రజల చెంతకు వెళ్లి ఖాతాలు తెరుస్తున్నారు. గతంలో ఖాతాలు కావాలంటే బ్యాంకు శాఖలు అనేక కొర్రీలు పెట్టాయి. ప్రస్తుతం వారే ప్రజల చెంతకు వెళ్లి ఖాతాలు ఇస్తున్నారు.
 
  2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 41 లక్షలు కాగా.. కుటుంబాల సంఖ్య 9.50 లక్షలు అగస్టు 19న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో మాత్రం 10.17 లక్షల కుటుంబాలు నమోదయ్యాయి. జనాభాలో 40 శాతానికి బ్యాంకు ఖాతాలు లేవని అధికారవర్గాల అంచనా.. కుటుంబాల ప్రకారం చూస్తే జిల్లాలో 3లక్షల కుటుంబాలకు పైగా ఖాతాలు లేవని అంచనా.. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో మొత్తం 514 బ్యాంకు శాఖలున్నాయి.
 
 ఒక్కో శాఖలో సరాసరి 3వేలమంది వరకు ఖాతాదారులున్నారు. జిల్లాలో 6.50 లక్షలకు పైగా ఖాతాలున్నట్లు అంచనా.. ఇందులో కొందరికి రెండు, మూడు ఖాతాలున్నాయి. తాజా పథకం నేపథ్యంలో భారీ మొత్తంలో ఖాతాలు పెరగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఏడాది అగస్టు 15 నాటికి పెద్ద సంఖ్యలో బ్యాంకు కరస్పాండెంట్లను నియమించాలని నిర్ణయించారు. కొత్తగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకు శాఖలను కూడా ప్రారంభించాలని చర్యలు చేపట్టారు. ప్రస్తుతమైతే గ్రామ కరస్పాండెంట్లను నియమిస్తున్నారు. ప్రతి 2వేల జనాభాకు ఒక గ్రామ కరస్పాండెంట్‌ను నియమిస్తున్నారు. ఇప్పటికే వివిధ బ్యాంకులు గ్రామాల్లో 300మంది కరస్పాండెంట్లను నియమించినట్లు తెలుస్తోంది.
 
 సేవలు మరింత మెరుగు
 - శ్రీనివాసరావు, జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్.
 జన్‌ధన్ యోజన ద్వారా బ్యాంకు సేవలు మరింత విసృ్తతమవుతాయి. ప్రతి కుటుంబానికి రెండు ఖాతాలు ఇస్తాం. ఇప్పటికే ఖాతాలున్న పేదలు కూడా మరో ఖాతా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఇది పనిచేస్తుంది. శాఖలు తక్కువగా ఉన్న బ్యాంకులు గ్రామాల్లో కరస్పాండెంట్లను నియమించుకుంటున్నాయి. ఖాతా తీయడం చాలా సులువు. జిల్లాలో ఈ పథకానికి మంచి స్పందన ఉంది.
 

మరిన్ని వార్తలు