వార్డెన్లు లేరు.. విద్యార్థుల్లేరు

2 Mar, 2016 03:26 IST|Sakshi
వార్డెన్లు లేరు.. విద్యార్థుల్లేరు

♦ సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు
♦ రికార్డులకు, ఉన్న విద్యార్థులకు పొంతన లేని వైనం
 
 సాక్షి నెట్‌వర్క్: తెలంగాణలో పలుచోట్ల సంక్షేమ వసతి గృహాలపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ తనిఖీలు జరిగాయి.  చాలా చోట్ల రికార్డులకు, ఉన్న విద్యార్థులకు పొంతనే లేదని తేలింది. నల్లగొండ జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి బీసీ వసతి గృహంలో 29 మంది విద్యార్థులుంటే.. వార్డెన్ మాత్రం 140 మంది పిల్లలు ఉన్నట్టు రికార్డుల్లో చూపిస్తున్నట్టు తేలింది. అయితే విద్యార్థులకు జనవరి వరకు వండి పెట్టాల్సిన బియ్యానికి సంబంధించి ఇంకా 21 బస్తాలు మిగిలి ఉండగా, కొత్తగా మరో 40 బస్తాలు తెచ్చుకున్నారు.

ఇదే జిల్లా మర్రిగూడ హాస్టల్ రికార్డుల్లో 250 మంది ఉంటే.. 70 మందే విద్యార్థులు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొండనాగుల బీసీ హాస్టల్ రికార్డుల్లో 138 మంది విద్యార్థులు ఉన్నట్లు చెబుతున్నా.. విచారణలో 98 మంది మాత్రమే ఉన్నట్లు తేలింది. దీంతో అధికారులు రికార్డులను స్వాధీ నం చేసుకున్నారు. ఇదే జిల్లా మన్ననూర్ గిరిజన బాలికల వసతి గృహం రికార్డులు వార్డెన్ ఇంటి వద్ద ఉండడంపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. బిల్లుల డ్రా  చేయడంలో మోసాలు వెలు గు చూశాయి. రంగారెడ్డి జిల్లా యాలాల బీసీ బాలుర హాస్టల్‌లో మొత్తం 96 మంది విద్యార్థులు ఉన్నట్టు రికార్డుల్లో ఉండగా, తనిఖీలో 56 మందే ఉన్నట్లు గుర్తించారు. ముజాహిద్‌పూర్ ఎస్టీ హాస్టల్‌లో 273 మంది విద్యార్థులున్నట్లు రిజిస్టర్‌లో ఉన్నా.. వాస్తవానికి 151 మందే ఉన్నట్టు తేలింది. ఖమ్మం జిల్లా కామేపల్లి బీసీ బాలికల హాస్టల్, బయ్యూరం మండలం ఇర్సులాపురం ఆశ్రమ పాఠశాలలో పలు అక్రమాలు బయటపడ్డాయి.

మరిన్ని వార్తలు