బ్యారేజీలే వారధులు

13 Apr, 2019 03:31 IST|Sakshi
గోదావరిపైన నిర్మించిన అన్నారం బ్యారేజీ కమ్‌ వంతెన

తుది దశకు చేరుకున్న మూడు బ్యారేజీలు.. మూడు వంతెనలు  

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తీరనున్న రవాణా కష్టాలు 

కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు, తాగునీరే కాకుండా బ్యారేజీలపై నుంచి వాహనాల రాకపోకలు సాగించడానికి వంతెనల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రూ.80 వేల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌ చేసి పనులను చేపట్టారు. ఇందులో భాగంగా ప్రాజెక్టులోని లింకు–1లోని సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంపుహౌస్, అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణాలతోపాటు మూడు బ్యారేజీలపై మూడు వంతెనల పనులు ఊపందుకుని తుదిదశకు చేరాయి.  

మేడిగడ్డ బ్యారేజీ పైన ఇలా.. 
కాళేశ్వరంలో మొదటిదశ గోదావరిపై మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయించింది. ఎల్‌ అండ్‌ టీ సంస్థ నిర్మాణ పనులు దక్కించుకుంది. జయశంకర్‌ భూపాపలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం మేడిగడ్డ నుంచి మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా పోచంపల్లి మధ్య గోదావరిపై అడ్డంగా బ్యారేజీ నిర్మిస్తున్నారు. 1628 మీటర్ల పొడవు, 100 మీటర్ల ఎత్తుతో చేపట్టిన ఈ బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 16.1 టీఎంసీలు. బ్యారేజీ నిర్మాణం పూర్తయితే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ప్రజలకు ప్రాజెక్టు కమ్‌ వారధిగా కూడా వాహనాల రాకపోకలకు ఉపయోగకరంగా ఉంటుంది. 

అన్నారం బ్యారేజీపై: ఈ బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,148 కోట్లు కేటాయించింది. వంతెనతోపాటు బ్యారేజీని అఫ్‌కాన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్ధ చేపట్టి గడువులోగా పూర్తిచేసింది. ఈ బ్యారేజీ నీటి నిల్వ సామ ర్థ్యం 11 టీఎంసీలు. మహదేవపూర్‌ మండలం అన్నారం–మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల గ్రామాల మధ్య గోదావరిపై అడ్డంగా 66 గేట్లతో 1270 మీటర్ల పొడవుతో అన్నారం బ్యారేజీని నిర్మించారు. వంతెన ద్వారా జయశంకర్, మంచిర్యాల జిల్లాల గోదావరి తీర ప్రాంతాల ప్రజలకు వారధిగా ఉపయోగపడుతుంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం–మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ నియోజకవర్గం జైపూర్‌ మండలం శివ్వారం గోదావరి నదులపై అడ్డంగా సిరిపురం బ్యారేజీ నిర్మాణం చేపట్టారు.  

కాళేశ్వరం బ్యారేజీలో భాగంగా నిర్మించే ఈ సుందిళ్ల బ్యారేజీని రూ.1,445 కోట్లతో 1.36 కిలోమీటర్ల పొడవుతో చేపట్టారు. చివరి దశ పనులు జరుగుతున్నాయి. రాకపోకలు ఈ నెల చివరి వరకు ప్రారంభం కానున్నాయి. మం«థని–చెన్నూర్‌ నియోజకవర్గాలకు బ్యారేజీతోపాటు వంతెన అందుబాటులోకి రానుంది.  కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణంతో 3 వారధులు అందుబాటులోకి వస్తున్నాయి.    గోదావరి, ప్రాణహితపై ప్రజలకు ఐదు వంతెనలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో మంచిర్యాల, జయశంకర్, పెద్దపల్లి, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.  

మరిన్ని వార్తలు