తుది జాబితా ప్రకటించిన టీజేఎస్‌ అధినేత

19 Nov, 2018 11:33 IST|Sakshi

జిల్లాలో మిగిలిన రెండు సీట్లు తెలంగాణ జన సమితికే

వరంగల్‌ తూర్పు అభ్యర్థిగా ఇన్నయ్య, వర్ధన్నపేట అభ్యర్థిగా దేవయ్య 

నేడు నామినేషన్లు వేయనున్న కూటమి అభ్యర్థులు

సాక్షి,  వరంగల్‌/హసన్‌పర్తి: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐతో ఏర్పడిన మహాకూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థుల తుదిజాబితా ఎట్టకేలకు ఆదివారం రాత్రి విడుదలైంది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాలకు తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) ఆదివారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్‌ తూర్పు స్థానానికి గాదె ఇన్నయ్య, వర్ధన్నపేటకు డాక్టర్‌ పగిడిపాటి దేవయ్యను ఖరారు చేసింది. దీంతో వారు సోమవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐతో ఏర్పడిన మహాకూటమి సీట్ల సర్దుబాటులో అనేక మలుపులు, కుదుపులు చోటుచేసుకున్నాయి. పొత్తులో భాగంగా తమ పార్టీలకు కేటాయించిన సీట్లకు ఆయా పార్టీలు అభ్యర్థులను విడతల వారీగా ప్రకటించాయి. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాలను కాంగ్రెస్‌కు కేటాయించగా, ఒక స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. భూపాలపల్లి, స్టేషన్‌ ఘన్‌పూర్, మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, పాలకుర్తి, జనగామ, నర్సంపేట, పరకాల నియోజకవర్గాలు కాంగ్రెస్‌ పార్టీకి, వరంగల్‌ పశ్చిమ టీడీపీకి, వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట స్థానాలు టీజేఎస్‌కు దక్కాయి. 

తొలుత వరంగల్‌ పశ్చిమ స్థానాన్ని తొలుత టీజేఎస్‌కు కేటాయిస్తారని అనుకున్నప్పటికీ  టీడీపీలో అగ్రనేతలు ఇతర చోట్ల నిలబడేందుకు వీలు కాకపోడంతో తప్పని పరిస్థితుల్లో టీడీపీకి కేటాయించి ప్రకాశ్‌రెడ్డిని ఇక్కడకు పంపించారు. జనగామ టీజేఎస్‌కు కేటాయించడంతో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో మంతనాలు జరపడంతో చిట్టచివరికి కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ను ప్రకటించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట స్థానాలను టీజేఎస్‌కే కేటాయించినట్లు తెలిసింది. కూటమి పొత్తులో టీజేఎస్‌ అభ్యర్థులుగా వరంగల్‌ తూర్పు నుంచి గాదె ఇన్నయ్య, వర్ధన్నపేట నుంచి పగిడిపాటి దేవయ్య సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 

రెబల్స్‌ తంటా...
కూటమి పొత్తుల్లో వరంగల్‌ పశ్చిమ, తూర్పు, వర్ధన్నపేట కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్లు టీడీపీ, టీజేఎస్‌కు దక్కడంతో ఆ పార్టీలోని నేతలు ఇప్పటికే నామినేషన్లు వేసి రెబల్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తామని ప్రకటించారు. వరంగల్‌ పశ్చిమ నుంచి రాజేందర్‌రెడ్డి, తూర్పు నుంచి రాజనాల శ్రీహరి, వర్ధన్నపేట నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌  పార్టీకి వ్యతిరేకంగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. 
వరంగల్‌ తూర్పు నుంచి కాంగ్రెస్‌ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఫ్రెండ్లీ కాంటెస్ట్‌ చేస్తారన్న ఊహాగానాలు వినపడుతున్నాయి. రవిచంద్ర గత రెండు రోజులుగా స్థానిక కాంగ్రెస్‌ నేతలతో సమావేశాలు నిర్వహించడంతో పోటీ చేస్తారని తెలుస్తోంది. బరిలో నిలిచేవారు ఎవరనే విషయం నేడు తేలనుంది. 
 
  

మరిన్ని వార్తలు