టీజేఎస్‌కు షాకిచ్చిన రచనా రెడ్డి

2 Dec, 2018 12:42 IST|Sakshi
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రచనా రెడ్డి

కూటమితో కోదండరాం కుమ్మక్కయ్యారు

టీజేఎస్‌లో సామాజిక న్యాయం జరగలేదు

కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు : రచనా రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)కు భారీ షాక్‌ తగిలింది. పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది రచనా రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీజేఎస్‌ ఛైర్మన్‌ కోదండరాంపై తీవ్ర విమర్శలతో మండిపడ్డారు. ఎన్నికలకు ముందే మహాకూటమి ఫిక్స్‌ అయ్యిందని, కోదండరాం కూటమితో అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని ఆమె ఆరోపించారు.

మహాకూటమిలో సామాజిక న్యాయం జరగలేదని, కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె అన్నారు. మైనార్టీలకు టీజేఎస్‌ ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదని.. ఇక మైనార్టీలకు ఏవిధంగా న్యాయం జరిగినట్లని ఆమె ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. కూటమిలో చాలామంది నేతలను బలిపశువులను చేశారని మండిపడ్డారు.

కోదండరాం కాంగ్రెస్‌తో కలిసి తనకు తానే ఓటమి చెందుతున్నారని, అసలు కూటమి గెలవడానికా లేక ఓడిపోవడానికా అని ఆమె ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కూటమి కూర్పు లేదని, దానిలో నేతలు రాజకీయ బ్రోకర్లుగా తయారయ్యారని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు ఇంగితజ్ఞానం ఉందని, చంద్రబాబు ప్రచారాన్ని తిరస్కరిస్తారని అన్నారు. 

మరిన్ని వార్తలు