ఆధునికీకరణ పనులు వేగిరం చేయాలి

5 Jun, 2015 23:45 IST|Sakshi
ఆధునికీకరణ పనులు వేగిరం చేయాలి

విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి
సాగర్ ఎడమ కాల్వ సీసీ లైనింగ్ పనుల పరిశీలన
 
 హాలియా : ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని, పనుల నాణ్యతలో రాజీపడోద్దని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో మండలంలోని హాలియా వద్ద  మొదటి ప్యాకేజీ కింద కొనసాగుతున్న సీసీ లైనింగ్ పనులను శుక్రవారం మంత్రి జగదీష్‌రెడ్డి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును ఎన్‌ఎస్‌పీ అధికారులతో కలసి చర్చించారు.

అదేవిధంగా మండలంలోని ఇబ్రహింపేట గ్రామం వద్ద సాగర్ ఎడమ కాల్వపై నూతనంగా నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ  తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ఎడమ కాల్వ ద్వారా చెరువులను నింపే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాల్వ ద్వారా నీటి విడుదల చేసి పెద్దదేవులపల్లి, అనాజిపురం, దోసపాడు  చెరువులను నింపి అటు నుంచి సూర్యాపేటకు తాగునీరందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

 హాలియా నుంచి వేములపల్లి వరకు ఎడమ కాల్వపై ప్రయాణం
 దోసపాడు చెరువు ద్వారా సూర్యాపేటకు తాగునీరు అందించే క్రమంలో సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల చేస్తే ఎదురయ్యే ప్రతిబంధకాలను అంచ నా వేయడం కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి మండలంలోని హాలియా నుంచి వేములపల్లి మండల కేంద్రం వరకు సాగర్ ఎడమ కాల్వపై ప్రయాణీంచారు. ఎడ మ కాల్వ పరిధిలో ఆయా ప్యాకెజీల్లో గతంలో, ప్రస్తుతం జరుగుతున్న పను లు, కాల్వ స్థితిగతులను పరిశీలించారు. కాల్వకు నీటి విడుదల చేసే విషయంలో మరోసారి ఎన్‌ఎస్‌పీ అధికారులతో మాట్లాడినాక  ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ బాలు నాయక్, సీఈ పురుషోత్తమ్మరాజు, ఎస్‌ఈ విజయభాస్కర్, ఈఈ విష్ణు ప్రసాద్, డీఈ సురేందర్‌రెడ్డి, జేఈ రమేశ్‌రెడ్డిలు ఉన్నారు.
 
 జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు కృషి
 
 హాలియా :  రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో తలెత్తిన తీవ్ర తాగునీటి ఎద్డడి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హాలియాలో సాగర్ ఎడమ కాల్వపై మొదటి ప్యాకేజీలో జరుగుతున్న ఆధుకికీకరణ పనులను పరిశీలించిన మంత్రి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్షాభావం వల్ల జిల్లాలోని జలాశయాల్లో నీరు అడుగంటిపోవడంతో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్నదన్నారు.

జలాశయాల్లో నీరు లేక మంచినీటి స్కీమ్‌లు పనిచేయని కారణంగా మిర్యాలగూడ, నల్లగొండ, సూర్యాపేట వంటి పట్టణాల్లో తీవ్ర నీటి ఎద్దడి దాపురించిందని పేర్కొన్నారు.   ప్రధాన పట్టణాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆయన వెంట నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ పురుషోత్తమరాజు, ఎస్‌ఈ విజయబాస్కర్, ఈఈ విష్ణు ప్రసాద్, డీఈ సురేందర్‌రెడ్డి, జేఈ రమేశ్‌రెడ్డిలతో పాటు టీఆర్‌ఎస్ నాయకులు కేవీ రామారావు, ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, పోచం శ్రీనివాస్‌గౌడ్, ఎన్నమళ్ల సత్యం, వర్రా వెంకట్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు