నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం

21 Dec, 2014 03:50 IST|Sakshi

ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన నిర్వహించనున్నారు. పాలకవర్గం ఏర్పడిన తర్వాత రెండోసారి  సర్వసభ్య సమావేశం జరగనుంది. గతంలో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సభ వాడివేడిగా జరిగింది. గతంతో పోల్చితే ప్ర స్తుత పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నా యి. ప్రధానంగా జిల్లాలో వైద్యా, ఆరోగ్య శాఖ పనితీరుతోపాటు తాగునీటి  తదితర సౌకర్యాల కల్పన,  పేదరిక నిర్మూలన, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఐకేపీ శాఖలను ఎజెండాలో అంశాలుగా పొందుపర్చారు. వీటిపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

అయితే రాష్ర్ట రోడ్లు భవనాలు, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం జిల్లాలో నెలకొన్న సమస్యలు, ఆయా శాఖల వారీగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో అధికారులు కూడా ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీయాలనుకున్నప్పటికీ ముందురోజే మంత్రి హోదాలో జిల్లాలోని పలు సమస్యలపై తుమ్మల వివరణ ఇచ్చారు.

వచ్చే పర్యటనలోగా అధికారులు తీరు మార్చుకోవాలని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఈ సర్వసభ్య సమావేశంలో పెద్దగా చర్చజరిపే అవకాశాలు కనిపించడం లేదు. గత సమావేశంలో జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, వ్యవసాయానికి 7 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, రైతులకు రుణ మాఫీ రూ. లక్ష వరకు వర్తింప జేయాలని, ప్రభుత్వ పాఠశాలలను రేషనలైజేషన్ చేయాలని తీర్మానించారు. అయితే ఇంకా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఉపాధిహామీ పై సమావేశంలో కొంతమేర చర్చజరిగే అవకాశం ఉంది.  
 
30న ప్రత్యేక సమావేశం
వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై ఈ నెల 30న జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన జరిగే ప్రత్యేక సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ,  స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖతో పాటు ఉద్యాన, పశుసంవర్ధక, విత్తనాభివృద్ధి, మత్స్య, పాడిపరిశ్రమ తదితర శాఖల పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న వివిధ శాఖల్లో అమలవుతున్న పథకాలకు ఈ ఆర్థిక  సంవత్సరంలో జరిపిన కేటాయింపులపై చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు