తహసీల్దారు.. పైరవీ జోరు !

18 Nov, 2019 08:12 IST|Sakshi
తహసీల్దారు.. పైరవీ జోరు! 

ఎట్టకేలకు ‘మండల బాస్‌’ల బదిలీలు

మళ్లీ ఎవరి జిల్లాలకు వారు..

సాక్షి, నిర్మల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం తహసీల్దార్ల బదిలీలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారిని సొంత జిల్లాలకు బదిలీ చేసింది. జిల్లాకు చెందిన తహసీల్దార్లు కూడా మళ్లీ సొంత జిల్లాకు రానున్నారు. జిల్లా కలెక్టర్లు సోమవారం తహసీల్దార్లకు మండలాల వారీగా పోస్టింగులు ఇవ్వాల్సిందిగా స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ, భూపరిపాలన శాఖ చీఫ్‌ కమిషన్‌ సోమేశ్‌కుమార్‌ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో జిల్లాలో ఎవరికి ఏ మండలం ఇస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లే కనుక ఏ మండలం ఎలా ఉంటుంది.. ఎక్కడ చేస్తే బాగుంటుందన్న విషయాలపై అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండే మండలాల్లో పోస్టింగ్‌ ఇప్పించుకునేందుకు పలువురు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

మళ్లీ పాత జిల్లాకు.. 
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు మూడునెలల ముందు తహసీల్దార్ల బదిలీలను చేపట్టారు. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారిని ఇతర జిల్లా లకు బదిలీ చేశారు. ఈక్రమంలో జిల్లాకు చెంది న తహసీల్దార్లలోనర్సయ్య, కలీం, నారాయణ, సుభాష్‌చందర్, తుకారాంను జగిత్యాల జిల్లాకు పంపించారు. జి.లక్ష్మి, నరేందర్, సంతోష్‌రెడ్డి, శంకర్, రాజ్‌మోహన్, కిరణ్మయి,పి.నర్సయ్యను మంచిర్యాల జిల్లాకు బదిలీ చేశారు. శ్యాంసుందర్‌ను కరీంనగర్, లోకేశ్వర్‌రావును ఆదిలాబాద్, జి.శ్రీకాంత్‌ను పెద్దపల్లి, పి.వెంకటరమణను వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు బదిలీ చేశారు. ప్రస్తుత ఆదేశాలతో వారు మళ్లీ నిర్మల్‌ జిల్లాకు రానున్నారు. ఇక ఎన్నికల సమయంలో ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో తహసీల్దార్లు మన జిల్లాకు వచ్చారు. ఇందులో అతిఖుద్దీన్, ప్రభాకర్, మహేంద్రనాథ్, మోతీరాం, పవన్‌చంద్ర, శివరాజ్, శ్రీదేవి, సంధ్యారాణి, మోహన్‌సింగ్, చంద్రశేఖర్‌ ఉన్నారు. అలాగే సత్యనారాయణ, రాజేశ్, రాజేందర్‌ జగిత్యాల జిల్లా నుంచి రాగా, సుధాకర్, అనుపమరావు, వెంకటలక్ష్మి, ఉమాశంకర్‌ పెద్దపల్లి జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. 

బదిలీ కోసం ఎదురుచూసి.. 
ఎన్నికలు పూర్తయి నెలలు గడుస్తున్నా.. తమను సొంత జిల్లాలకు బదిలీ చేయడం లేదన్న ఆందోళన చాలామంది తహసీల్దార్లలో కనిపించింది. మరోవైపు మున్సిపల్‌ ఎన్నికలు కూడా రానుండటంతో ఇక ఆ ఎన్నికలు కూడా పూర్తయ్యే వరకు ఉండాల్సి వస్తుందేమోనని భావించారు. కానీ.. ప్రస్తుత పరిస్థితులు ఎన్నికలకు అనుకూలంగా కనిపించకపోవడం, తాజాగా రెవెన్యూ అధికారులపై జరిగిన దాడులు, శాఖ చేసిన ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలను చేపట్టినట్లు చెబుతున్నారు. అబ్ధుల్‌పూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యోదంతం తర్వాత రెవెన్యూ అధికారులు చేసిన ఆందోళన రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. పనులన్నీ పక్కనపెట్టి వారు చేసిన నిరసన చివరకు బదిలీలకు మార్గం సుగమం చేసినట్లు భావిస్తున్నారు. 

అనుకూలమైన చోటు కోసం.. 
జిల్లాకు బదిలీ అయిన తర్వాత ఇక్కడ ఏ మండలానికి వెళ్తారో.. అనేదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. జిల్లాలోని పలు మండలాలపై రెవెన్యూ అధికారులు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతుంటారు. ప్రధానంగా నిర్మల్‌ అర్బన్, నిర్మల్‌రూరల్, ఖానాపూర్, భైంసా తదితర మండలాలను ఎక్కువమంది కోరుకుంటారన్నది రెవెన్యూ వర్గాలు చెబుతున్న మాట. ఆదాయ వనరులతో పాటు అనుకూలమైన వాతావరణం ఉన్న మండలాన్ని చాలామంది తహసీల్దార్లు ఆశిస్తున్నారు. ఈనేపథ్యం లో జిల్లాలోని పలు స్థానాలకు పోటీ నెలకొన్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు తహసీల్దార్లు అనుకూలమైన మండలం కోసం భారీ ఎత్తున పైరవీలు సైతం మొదలుపెట్టినట్లు సమాచారం. కొంతమంది ఇప్పటికే హైదరాబాద్‌ వెళ్లి ‘పెద్ద’లను కలిసినట్లు వినిపిస్తోంది. 

ప్రధాన పోస్టు కావడంతో.. 
జిల్లాకు కలెక్టర్‌ ఎలాగో.. మండలానికి తహసీల్దార్‌ అదే స్థాయి అధికారి. ఒక్క రెవెన్యూ మాత్రమే కాకుండా చాలా పనుల్లో, విషయాల్లో మండలానికి తహసీల్దారే బాధ్యుడు. మండలస్థాయిలో ప్రాధాన్యతతో పాటు దానికి తగ్గట్లు ప్రయోజనాలు ఉండటంతో ఆ పోస్టుకు డిమాండ్‌ పెరిగింది. అందులోనూ అనుకూలమైన చోటు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ పని చేసుకోవడంతో పాటు సంబంధిత ప్రయోజనాలనూ పొందే అవకాశాలు ఉంటాయి. ఈనేపథ్యంలోనే జిల్లాలో తమకు ప్రయోజనకరంగా ఉండే చోటు కోసం పెద్దఎత్తున్న ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు