తెలంగాణ ఆత్మగౌరవం మరోసారి నిలబెట్టాలి: బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌

14 Nov, 2023 14:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓటు వేయకపోతే ప్రజలు ఐదేళ్లపాటు శిక్ష అనుభవించాల్సి వస్తుందని బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం జనగాం జిల్లా పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు హాజరై కేసీఆర్‌ ప్రసంగించారు.    

పాలకుర్తి బహిరంగ సభలో కేసీఆర్‌ కాంగ్రెస్‌ నేతలపై సెటైర్లు సంధించారు. ‘‘మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్‌కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన పన్నులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నడని అంటున్నడు. రైతు బంధు దుబారానా?.. రైతు బంధు ఉండాలా? వద్దా? ఉండుడు కాదు.. దయాకర్‌ను గెలిపిస్తే రైతు బంధు రూ.16వేలకు పెంచుతాం. అదే కాంగ్రెస్‌ గెలిస్తే రైతు బంధు మాయమైపోతది.. 

..ఇంకోకాయన మాట్లాడుతున్నడు. ఆయన టీపీసీసీ చీఫ్‌. కేసీఆర్‌కు ఏం పని లేదు. 24 గంటలు ఇచ్చి వేస్ట్‌ చేస్తున్నడు అని. కరెంట్‌ ఎన్ని గంటలు అవసరం. 24 గంటలు అవసరం. కానీ, కాంగ్రెస్‌ గెలిస్తే అది జరగదు. చెప్పేటోళ్లు ఎల్లయ్య.. మల్లయ్య కాదు.. ఆ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అమెరికాలో చెప్పిండు, ఇక్కడా టీవీ ఇంటర్వ్యూల్లో బల్లగుద్ది చెబుతున్నారు. కేసీఆర్‌కు ఏం తెల్వది. 10 హెచ్‌పీ మోటర్‌తో నడిపిస్తే మూడు గంటల కరెంట్‌ చాలంటున్నడు. మనం ఇక్కడ వాడేది 3, 5 హెచ్‌పీ మోటర్లు. మరి 10హెచ్‌పీ మోటర్‌ మీ అయ్య కొనిస్తడా? అని రేవంత్‌ను ఉద్దేశించి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. 

ఎన్నికలొస్తే ఇలాంటోళ్ల మాటలు విని గోల్‌మాల్‌కావడం కాదు. ఒక్కసారి ఛాన్స్‌ ఇవ్వమని కాంగ్రెస్‌ అడుగుతుంది. ఒక్కసారి కాదు 11, 12సార్లు అధికారం ఇచ్చిండ్రు. ఏం చేసిండ్రు. కడుపులో సల్ల కదలకుండా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటేయండి. ప్రలోభాలకు లోనై ఓటేయొద్దు. ప్రజలు గెలిస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది. అని సభకు హాజరైన ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారాయన.  

మంది మాటలు విని ఆగం కావొద్దు
కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ ధైర్యంగా పని చేసి అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే పని చేయలేదని నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని హాలియాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘‘బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఏది ఏమైనా కరెంటు సమస్య పరిష్కరించాలని స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం. సమస్యను పరిష్కరించి చూపించాం. గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచుకున్నాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా దళితులను ఆదుకుందా? కాంగ్రెస్‌ పాలనలో తాగు, సాగు నీరు, కరెంటు సంగతి మీకు తెలుసు.

ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక హక్కు.. ఓటు. ఇది ఎలాపడితే అలా వేసేది కాదు. ఎన్నికలు అనగానే ఎందరో వస్తుంటారు.. ఏవేవో మాట్లాడుతుంటారు. నియోజకవర్గం బాగుపడాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మంది మాటలు విని ఆగం అయితే ఐదేళ్లపాటు కష్టాల పాలవుతాం. అందుకే ఓటు వేసే ముందు అన్ని ఆలోచించి వేయాలి. అభివృద్ధిలో రాష్ట్రం ముందుకు వెళ్లాలి... వెనక్కి పోవద్దు. తెలంగాణ ఆత్మగౌరవం మరోసారి నిలబెట్టాలని కోరుతున్నా. జానారెడ్డి సీఎం అవుతానని కలలు కంటున్నారు. గతంలో జనారెడ్డికి మీరు ఓటుతో బుద్ధి చెప్పారు. నాగార్జునసాగర్‌లో భగత్‌ను 70వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలి’’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ వాళ్లు 196 కేసులు వేశారు
పదేళ్లుగా తెలంగాణలో సంక్షేమ పాలన అందించామని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ అన్నారు. ‘‘ఈసారి ఎన్నికలను మనం సీరియస్‌గా తీసుకోవాలి. ప్రజలు ఓటు వేసే ముందు.. పార్టీల చరిత్ర కచ్చితంగా చూడాలి. అభ్యర్థి గురించి ఆలోచించాలి. ఎవరి చేతిలో పెడితే రాష్ట్రం బాగుపడుతుందో ఆలోచన చేయాలి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ, పదేళ్లుగా రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించాం. విధివంచితులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. సామాజిక బాధ్యతలో భాగంగానే పింఛన్లు పెంచాం. మళ్లీ అధికారంలోకి రాగానే రూ.5వేల వరకు పింఛన్‌ పెంచుతాం. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేశాం. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు రావాలి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకొస్తే ఆపేందుకు కాంగ్రెస్‌ వాళ్లు 196 కేసులు వేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం వల్ల లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది’’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

మరిన్ని వార్తలు