పనిచేసే వారికే పదవులు

24 Nov, 2014 02:40 IST|Sakshi
పనిచేసే వారికే పదవులు

నల్లగొండ రూరల్ :టీఆర్‌ఎస్ పార్టీలో పైరవీలకు తావులేదని, పనిచేసేవారికే గుర్తింపు..పదవులు లభిస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆది వారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్‌ఆర్‌ఎస్ గార్డెన్స్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. ప్రజాబలం ఉన్న నాయకులకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి వారి స్థాయిని బట్టి పదవులు దక్కుతాయన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు స్వీకరించేందుకు ఎమ్మెల్సీ లు సిద్ధంగా ఉన్నారని వివరించారు.
 
 నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకు జిల్లాలోని అర్హత గల పట్టభద్రులను ఓటర్లు గా నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విద్యుత్ వాటా కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటం చేస్తున్నారని చెప్పారు. నాలుగేళ్లలో ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామన్నారు. ఏడాది లో రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మంద శ్యామేల్, బక్క పిచ్చయ్య, దుబ్బాక నర్సింహారెడ్డి, చకిలం అనిల్‌కుమార్, శశిధర్‌రెడ్డి, కాసోజు శంకరమ్మ, శివరాం కృష్ణ, లాలునాయక్, అభిమన్యు శ్రీనివాస్, జమాల్, శ్రీను, సాయి, వెంకన్న, బాలు పాల్గొన్నారు.
 
 అర్హులందరికీ.. ఆహారభద్రత : పల్లా
 పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్షాల విమర్శలను కార్యకర్తలు దీటుగా ఎదుర్కొవాలని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
 
 గత పాలకుల నిర్లక్ష్యంతోనే.. : నోముల
 సాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నోముల నర్సింహ్మాయ్య మాట్లాడుతూ పంటలు చేతికి రాకముందే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారా..? రైతుల ఆత్మహత్యలపై ప్రతిపాక్షలు ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు.
 
 అండగా ఉంటాం : ఎంపీ
 ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలన్నారు. కార్యకర్త లు నిరాశ చెందవద్దని, వారికి పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుం దన్నారు. ఉద్యమ స్ఫూర్తిని అభివృద్ధిలో చూపించాలని కోరారు.
 
 ఓటరు నమోదుపై దృష్టిసారించాలి : బండా
 టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 40 వేల పట్టభద్రులు ఓటు హక్కు కలిగి ఉన్నారని, 2011 లోపు డిగ్రీ పూర్తి చేసిన వారిని ఓటర్లుగా నమోదు చేయించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలన్నారు.
 
 అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే
 ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత మాట్లాడుతూ కార్యకర్తలంతా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఓటర్ల నమోదులో కీలకపాత్ర పోషించాలని కోరారు.
 
 పేదల సంక్షేమమే ధ్యేయం : కర్నె
 ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణే ధ్యేయంగా అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమ కోసం పనిచేస్తుందన్నారు. వాటర్‌గ్రిడ్‌ను సీఎం మన జల్లా నుండే ప్రారంభించబోతున్నారని తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు