పంచాయతీపై గులాబీ నజర్‌

5 Jan, 2019 01:50 IST|Sakshi

గ్రామాలపై పూర్తి పట్టుకోసం టీఆర్‌ఎస్‌ యత్నం

తెలంగాణ నెట్‌వర్క్‌ : శాసనసభ ఎన్నికల్లో భారీ విజయం సాధించి జోరుమీదున్న టీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించే దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నెలలో మూడు దశల్లో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వీలైనన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేయించడంపై దృష్టి పెట్టింది. 2013 నాటి ఎన్నికలతో (662 పంచాయతీలు ఏకగ్రీవం) పోలిస్తే.. ఈసారి పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాల సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. రెండోసారి భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన టీఆర్‌ఎస్‌.. గ్రామీణ ప్రాంతాలపై పట్టుసాధించడం తద్వారా పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తోంది.

ఇందులో భాగంగా ఎన్నికల బాధ్యతను శాసనసభ్యులకు అప్పగించింది. ఏకగ్రీవాల కోసం తీవ్రంగా ప్రయత్నించాలని.. అది వీలుకాని పక్షంలో ఆర్థికంగా బలమైన అభ్యర్థులను బరిలో దించాలని భావిస్తోంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవే అయినప్పటికీ.. ఆయా రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను అభ్యర్థులుగా రంగంలో దించడం అనవాయితీగా మారింది. తెలంగాణలో 2013 ఎన్నికల సమయంలో 8,778 గ్రామ పంచాయతీలుండగా.. తండాలను కేసీఆర్‌ సర్కారు గ్రామ పంచాయతీలుగా మార్చడంతో.. ఈసారికి వీటి సంఖ్య 12,732కి చేరింది. ఇందులో కనీసం 10% పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా.. ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు వాటి జనాభా ఆధారంగా ఐదు లక్షల రూపాయలు, పది లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది.

ఏకగ్రీవానికి టీఆర్‌ఎస్‌ ప్రోత్సాహం
పంచాయతీ ఎన్నికలను టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల తరుణంలో వీలైనన్ని గ్రామపంచాయతీలను ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులతో గెలిచేలా వ్యూహాలను రచిస్తోంది. ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ప్రభుత్వం తరపున ఇచ్చే నిధులతోపాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తయ్యే గ్రామపంచాయతీకి ప్రభుత్వ ప్రోత్సాహకానికి అదనంగా.. రూ.5 లక్షలు వరకు ఇవ్వనుంది. గ్రామాల్లో పూర్తిస్థాయి పట్టు సాధించే వ్యూహంలో భాగంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.. కేటీఆర్‌ ఈ ప్రోత్సహకాలను తన నియోజకవర్గమైన సిరిసిల్ల నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కేటీఆర్‌ను అనుసరిస్తూ మరికొందరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రోత్సహకాలను ప్రకటిస్తున్నారు.

నియోజకవర్గ అభివృద్ధి నిధులనుంచి రూ.50 లక్షలను ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు ఇవ్వనున్నట్లు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తూ... ఏకగ్రీవాల కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో.. రిజర్వ్‌డ్‌ పంచాయతీల్లోనూ ఎక్కువభాగం ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికల మాదిరి కాకుండా.. పంచాయతీ ఎన్నికల్లో విభేదాలు ఎక్కువగా ఉంటాయి. రెండు వర్గాల మధ్య పోరుతో గ్రామంలో ఉండాల్సిన సామరస్య వాతావరణం దెబ్బతింటుందని, పోటీ కంటే కూడా ఏకగ్రీవ ఎన్నికల వల్ల గ్రామం అభివృద్ధి బాటలో పయనించడానికి వీలుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలతో ఢీలా పడిన కాంగ్రెస్‌ మాత్రం ఇంకా ఈ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడం గమనార్హం.

మరిన్ని వార్తలు