నాకు దక్కిన అదృష్టం ఇది : పోచారం

19 Jan, 2019 11:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి శనివారం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ ఒకరు(గాంధీ) దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులు, మరొకరు(అంబేద్కర్‌) రాజ్యాంగాన్ని రచించిన మహనీయులు. వాళ్లిద్దరినీ స్పీకర్‌ స్థానంలో ఉండి గౌరవించుకోవడం నాకు లభించిన అదృష్టంగా భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. సభను హుందాగా, పక్షపాతం లేకుండా సజావుగా నడిపించే బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. సభ నియమ, నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే స్వేచ్ఛను ఇస్తానని, వారి సూచనలు స్వీకరించి సభా సంప్రదాయాలను పాటిస్తానని వ్యాఖ్యానించారు. ఇక మరి కొద్దిసేపట్లో తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

కాగా తెలంగాణ రెండో శాసన సభ స్పీకర్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. స్పీకర్‌ పదవికి శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాలలో 1998లో గృహనిర్మాణ, 1999లో భూగర్భ గనులు, 2000 సంవత్సరంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పోచారం... 2014 నుంచి 2018 వరకు కేసీఆర్‌ కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు