వసూళ్ల వార్‌

19 Jan, 2019 11:19 IST|Sakshi
పేటలో రజనీకాంత్‌, విశ్వాసంలో అజిత్‌

 చెన్నై, పెరంబూరు: కోలీవుడ్‌లో ఇప్పుడు రెండు చిత్రాల వసూళ్లపై బహిరంగ యుద్ధం జరుగుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఈ సంక్రాంతి బరిలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన పేట, అజిత్‌ కథానాయకుడిగా నటించిన విశ్వాసం చిత్రాలు తెరపైకి వచ్చాయి. రజనీకాంత్‌ చిత్రంతో అజిత్‌ చిత్రం డీ కొనడం సాధారణ విషయం కాదు. విశేషం ఏమిటంటే ఈ నెల 10వ తేదీన విడుదలైన ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల మధ్య సక్సెస్‌ టాక్‌ను తెచ్చుకున్నాయి. అంతే కాదు పేట, విశ్వాసం చిత్రాలు వసూళ్లలోనూ పోటీ పడుతున్నాయి. ఈ రెండు చిత్రాల కలెక్షన్లను ప్రతిరోజూ సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తున్నారు. మీరెలా ప్రతి రోజూ తమిళనాడులోని 600 థియేటర్ల కలెక్షన్లను వెల్లడించగలుగుతున్నారు అని పేట చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ నిర్వాహకులు ఆశ్యర్యాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు పేట, విశ్వాసం చిత్రాల నిర్మాణ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

11 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్‌లో పేట
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ తిరుపూర్‌ సుబ్రమణియం పేట చిత్ర వసూళ్ల వివరాలను ఒక వీడియో ద్వారా ఇటీవల వెల్లడించారు. అందులో ఆయన ఈ ఆదివారానికి అంటే 11 రోజులకు పేట వసూళ్లు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరతాయని పేర్కొన్నారు. ఇలా డిస్ట్రిబ్యూటర్‌  ద్వారా వసూళ్ల వివరాలను అధికారికపూర్వకంగా వెల్లడించడం అన్నది మొదటి సారి అవుతుందని, పొంగల్‌ పండగకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియోను సన్‌ పిక్చర్స్‌ సంస్థ ప్రచారం చేస్తూ 11 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తమిళ చిత్రంగా పేట రికార్డు సాధించిందని పేర్కొన్నారు. అంతే కాదు ఒక ప్రోమోను తయారు చేసి అందులో పేట చిత్రంలోని కెక్కే పీక్కే అనే హాస్య సన్నివేశాలను పొందుపరచి చివరలో మీరంతా మారరురా. పొండిరా రే అని రజనీకాంత్‌ చెప్పే డైలాగ్‌తో ముగించారు. అందుకు బదులిచ్చే విధంగా విశ్వాసం చిత్ర వర్గాలు రెడీ చేసిన ప్రోమోలో మీపై చంపేంత కోపం రావాలి. అయినా మీరు నాకు నచ్చారు సార్‌. అందుకే లాంగ్‌ లీవ్‌. హ్యాపీ లైఫ్‌ అని అజిత్‌ చెప్పిన సంభాషణలను పేర్కొన్నారు.

ఇప్పటికే విశ్వాసం వసూళ్లు రూ.125 కోట్లు
కాగా సన్‌ పిక్చర్స్‌ పేర్కొన్న 5 నిమిషాల్లోనే విశ్వాసం చిత్ర తమిళనాడులో విడుదల చేసిన కేజీఆర్‌.స్టూడియోస్‌ అధినేత  గురువారానికే విశ్వాసం చిత్రం రూ. 125 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. విశ్వాసం వసూళ్లను ప్రకటించగానే అజిత్‌ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అయితే విశ్వాసం చిత్ర వసూళ్ల వివరాలను ప్రకటించడంతో పేట చిత్ర వర్గాలు  ట్విట్టర్‌లో ఎగతాళి చేయడం మొదలెట్టారు. ఇలా పేట, విశ్వాసం చిత్రాల వసూళ్లను వెల్లడి పోటీగా మారింది. ఇద్దరు నటుల అభిమానులు ఒకరిపై ఒకరు వెటకారం మాటలతో ట్వీట్‌ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇంతకు ముందు విజయ్, అజిత్‌ అభిమానుల మధ్య ఇలాంటి పోరు ఉండేది. ఇప్పుడు అది రజనీకాంత్, అజిత్‌ అభిమానుల మధ్య ఏర్పడడం విశేషం. మరి ఈ పోరు ఏటు వైపు దారి తీస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు