ఢిల్లీకి చేరినా రాజకీయం..

7 Nov, 2018 15:10 IST|Sakshi

హస్తినకు చేరిన కాంగ్రెస్‌ రాజకీయం

ఒకేసారి జాబితా విడుదలకు నిర్ణయంఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ..అందరూ ఢిల్లీ బాట

పొత్తులో ఎవరి సీటు గల్లంతవుతుందో..టీడీపీ, కాంగ్రెస్‌ నేతల్లో ఆందోళన 

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: 
కాంగ్రెస్‌ కథ క్లైమాక్స్‌కు చేరింది. సీను హస్తినకు మారింది. ఒకేసారి పూర్తి జాబితా విడుదలకు ఏఐసీసీ ముహూర్తం ఖరారు చేయడంతో ఆశావహులంతా ఢిల్లీ బాట పట్టారు. శుక్రవారం రోజున జాబితా వెల్లడిస్తామని ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి అభ్యర్థుల జాబితాను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని ఏఐసీసీ నిర్ణయించినా.. టీడీపీ, టీజేఎస్, సీపీఐతో జతకట్టిన కాంగ్రెస్‌కు సీట్ల తకరారు తలనొప్పి కలిగించింది. మిత్రపక్షాలతో ఎడతెగని చర్చలు జరిపినా పోటీచేసే స్థానాలపై కూడా సీపీఐ, టీడీపీతో అవగాహన కుదరకపోవడం చికాకు తెప్పిస్తోంది.

పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సీట్ల కేటాయింపుల్లో పట్టువిడుపులు ప్రదర్శించాలని ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ స్పష్టం చేయడంతో రాష్ట్ర నాయకత్వం మెత్తబడింది. ఈ క్రమంలోనే టీడీపీ, టీజేఎస్‌లతో సీట్ల సంఖ్యపై దాదాపుగా ఏకాభిప్రాయం కుదిరింది. సీపీఐతో రేపో మాపో సయోధ్య కుదురుతుందని అంచనా వేస్తున్న కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఈ నెల 9న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్లపై గంపెడాశలు పెట్టుకున్న ఆశావహులు మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు.. తమ అభ్యర్థిత్వం ఖరారు వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.

 
మాకంటే మాకు.. 
టీడీపీ–కాంగ్రెస్‌ల పొత్తు ఇరుపార్టీలపై ప్రభావం చూపుతోంది. ఓటు బ్యాంకు కలిసివస్తున్నా.. సీనియర్లు, ద్వితీయశ్రేణి నేతలను డైలమాలో పడేస్తోంది. టీడీపీ ప్రతిపాదిస్తున్న సీట్లతో కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ పట్టుబడుతున్న స్థానాలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. 2014 ఎన్నికల్లో గెలిచిన రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్‌ నియోజకవర్గాలను టీడీపీ అడుగుతోంది. ఇందులో శేరిలింగంపల్లి, ఉప్పల్, కూకట్‌పల్లి సెగ్మెంట్లను వదులుకోవడానికి కాంగ్రెస్‌ సిద్ధమైంది. అనివార్యమైతే రాజేంద్రనగర్‌ను కూడా త్యాగం చేయడానికి వెనుకాడడం లేదు. అయితే ఈ సెగ్మెంట్ల ఆశావహులకు తాజా సమీకరణలు మింగుడుపడడం లేదు. నాలుగేళ్లుగా పార్టీకోసం కష్టించిన తమకు గాకుండా పొత్తు పేరిట టీడీపీ ఎగురేసుకుపోయే ఎత్తుగడ వేయడం తట్టుకోలేకపోతున్నారు.

 ఎవరికి వి‘పొత్తు’ 
మహాకూటమితో ఎవరి సీట్లు గల్లంతవుతాయోనని అటు కాంగ్రెస్‌.. ఇటు టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. ఈ పొత్తు ప్రభావం ఎక్కువగా మన జిల్లాలో ఉండడంతో ఎవరి స్థానాలకు గండి కొడుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్‌ శివార్లలో ఇరుపార్టీలు సంస్థాగతంగా బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడినా బీజేపీతో పొత్తు టీడీపీకి లాభించింది. ఆ పార్టీ శివారు సెగ్మెంట్లను క్లీన్‌స్వీప్‌ చేసింది. మల్కాజిగిరి, మేడ్చల్‌ మినహా మిగతా స్థానాలన్నింటినీ గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆర్‌.కృష్ణయ్య తప్ప మిగతా ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. లీడర్లు పార్టీని వీడినా కేడర్‌ చెక్కుచెదరలేదు.  

సీమాంధ్ర ఓటర్లపై ఆశ 
శివారు ఓటర్లలో అత్యధికం సీమాంధ్రులున్నారు. గతంలో బీజేపీ–దేశం కూటమికి పట్టంకట్టిన ఓటర్లు ఈసారి కాంగ్రెస్‌–టీడీపీకి అండగా నిలుస్తారని మహాకూటమి అంచనా వేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషించనుందని, ఇది బీజేపీపై వ్యతిరేకత పెంచనుందని భావిస్తోంది. ఈ అంశం టీడీపీ–కాంగ్రెస్‌కు ఉభయతారకంగా పనిచేస్తుందని భావించిన టీడీపీ–కాంగ్రెస్‌లు పాత వైరాన్ని మరిచి మిత్రపక్షంగా మారిపోయాయి.  

టీడీపీలోనూ ముసలం.. 
టీడీపీలో కూడా పొత్తు సంకటస్థితిని సృష్టిస్తోంది. టికెట్‌ తమకే ఖాయమని భావించి కొన్నాళ్లుగా గ్రౌండ్‌వర్క్‌చేస్తున్న కొందరి సీట్లకు కాంగ్రెస్‌ పొత్తుతో ముప్పు ఏర్పడింది. ఎల్‌బీనగర్, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌ ఔత్సాహికులకు నిరాశ కలిగిస్తోంది. ఒంటరిగా బరిలో దిగుతామని భావించి ఆర్థికంగా నష్టపోయిన తర్వాత సీట్లను త్యజించాల్సిరావడం వారిని అసంతృప్తికి గురిచేస్తోంది. అలాగే మల్కాజిగిరిని ఈసారి టీజేఎస్‌కు అప్పగిస్తారనే ప్రచారం అటు టీడీపీ.. ఇటు కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తోంది. ఏమాత్రం బలంలేని టీజేఎస్‌కు ఈ సీటు ఇవ్వాలనుకోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ.. ఈసారి టీజేఎస్‌కు అప్పగిస్తుండడంతో అసంతృప్తికి లోనైన టీడీపీ శ్రేణులు పక్కపార్టీలవైపు చూస్తున్నాయి.

మరిన్ని వార్తలు