టెన్త్‌ మెమోలపై క్యూఆర్‌ కోడ్‌!

28 Dec, 2019 02:16 IST|Sakshi

నకిలీ మెమోల గుర్తింపునకు ప్రత్యేక విధానం

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి నకిలీ మెమోలను అరికట్టేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పది మెమోలపై ఇకపై క్యూఆర్‌ కోడ్‌ పొందుపరిచేందుకు చర్యలు చేపడుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధమవుతోంది. 2004 నుంచి పదో తరగతి మెమోలను ఆన్‌లైన్‌లో పొందుపరిచిన ప్రభుత్వ పరీక్షల విభాగం అంతకుముందుకు మెమోలనూ ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు కసరత్తు చేస్తోంది.

అయితే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన వారు అందజేసిన మెమోలు నకిలీవా? అసలైనవా? అని గుర్తించేందుకు ఈ విధానాన్ని తీసుకువస్తోంది. ఇకపై విద్యార్థులకు ఇచ్చే మెమోలపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించే ఆలోచనకు వచ్చింది. తద్వారా నకిలీ మెమోలను అరికట్టవచ్చని భావిస్తోంది. అసలైన మెమోపై ముద్రించిన క్యూఆర్‌ కోడ్‌ను రీడ్‌ చేస్తే సదరు అభ్యర్థి సమగ్ర వివరాలు తెలుస్తాయని, అదే నకిలీ మెమోపై క్యూఆర్‌ కోడ్‌ ఉండదని, ఒకవేళ ఏదైనా ముద్రించినా ఆ వివరాలు రావని, తద్వారా మెమోలు నకిలీవి తయారు చేయకుండా నిరోధించవచ్చని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు