చలో ట్యాంక్‌బండ్‌ మరో మిలియన్‌ మార్చ్‌

8 Nov, 2019 01:54 IST|Sakshi
కార్మికులకు మద్దతు తెలుపుతున్న నేతలు చెరుకు సుధాకర్, రమణ, జాజుల, అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ జేఏసీ కసరత్తు..

అఖిలపక్ష నేతల మద్దతు

చర్చలకు పిలవాలి: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి

తెలంగాణ వచ్చాక కూడా బలిదానాలు..: కోదండరాం

కార్మికుల కడుపుకోతకు కేసీఆర్‌దే బాధ్యత: చాడ  

సాక్షి, హైదరాబాద్‌/సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఈనెల 9న నిర్వహించ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమాన్ని మరో మిలియన్‌ మార్చ్‌ తరహాలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల సరూర్‌నగర్‌లో నిర్వహించాలని నిర్ణయించిన బహిరంగసభకు పోలీసులు అనుమతివ్వకున్నా, కోర్టు ద్వారా అనుమతి పొంది సభకు భారీగా జన సమీకరణ జరిపిన నేపథ్యంలో దీనికి కూడా పెద్దసంఖ్యలో జనం హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అఖిలపక్ష నేతలు కూడా దీనికి మద్దతు తెలిపిన నేపథ్యంలో, కారి్మకుల కుటుంబ సభ్యులతోపాటు ఆయా పారీ్టల నుంచి భారీగా కార్యకర్తలు తరలేలా ఇటు జేఏసీ, అటు పారీ్టలు సం యుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించి గురువారం జేఏసీ నేతలు వివిధ పార్టీల నేతలతో సమాలోచనలు జరిపారు. ఉస్మానియా విద్యార్థులు కూడా ఈ సభకు తరలేలా వారితోనూ చర్చిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఉస్మానియా విద్యార్థులతో జేఏసీ నేతలు సమావేశం కానున్నా రు.  గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు ఉధృతంగా సాగాయి. 

ఇటు ప్రజలకు అటు కోర్టుకు అబద్ధాలు: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ 
ఆర్టీసీ విషయంలో ఇటు ప్రజలతో పాటు అటు కోర్టుకు కూడా అబద్ధాలు చెప్పి చీవాట్లు పెట్టించుకున్నారని, ఒకదశలో కోర్టుకు క్షమాపణలు చెప్పడానికి కూడా ఐఏఎస్‌ అధికారులు సిద్ధమయ్యారని ఆర్టీసీ జేఏసీ కనీ్వనర్‌ అశ్వత్థామరెడ్డి విమర్శించారు. అధికారులకు ఏమాత్రం చీమూనెత్తురున్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. గురువారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘ఆర్టీసీ కార్మికుల తల్లుల కడుపుకోత’పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. అద్దె బస్సుల వల్లనే నష్టం వస్తోందన్న విషయాన్ని చెప్పకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు కూడా తప్పుడు లెక్కలు చెప్పి చీవాట్లు పెట్టించుకున్నారన్నారు. చర్చలే ప్రజాస్వామ్యానికి పునాది అని.. కారి్మకులను వెంటనే చర్చలకు పిలిచి పరిష్కరించాలన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంత గొప్ప సమ్మె జరగలేదన్నారు. ‘మేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. 9 గంటలు మంత్రులతో చర్చించారు. 9 నిమిషాలు మాతో చర్చిస్తే సమస్య పరిష్కారమయ్యేది కదా.. ఎప్పుడో ఒకప్పుడు ప్రభుత్వంలో విలీనం అవుతుంది. ఈ నెల 9న నిర్వహించే చలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేయాలి.’అని అన్నారు.
 
కార్మికుల చావులు ప్రభుత్వ హత్యలే
ఆర్టీసీ కారి్మకుల చావులు ప్రభుత్వ హత్యలేనని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. 11వ తేదీలోపు మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇంకా ఎంతమంది కడుపుకోతలను చూస్తారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడినవారి సమస్యలను పరిష్కరించకుండా ప్రగతిభవన్‌ మాటున ఉండాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. 

ఆ గిరే మీకు ఉరితాడు..: ఎల్‌.రమణ 
ఆర్టీసీ ప్రజలతో ముడిపడి ఉన్న రవాణా వ్యవస్థ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి, సురేశ్‌గౌడ్‌ కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.1 లక్ష చొప్పున మిగతా 20 మంది కార్మిక కుటుంబాలకు రూ.25 వేల చొప్పున అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని చెప్పారు. కార్మికులు బరితెగించి కొట్లాడుతుంటే కేసీఆర్‌ గిరి గీసుకొని ఉన్నారని, ఆ గిరే మీకు ఉరితాడు అవుతుందని హెచ్చరించారు.  

48 వేల కుటుంబాలతో ఆటలు: చాడ 
కార్మికుల కడుపుకోతకు కేసీఆర్‌దే బాధ్యత అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. 48 వేల కుటుంబాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలన్నారు.  కేసీఆర్‌ నయా నయీంగా మారాడని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ఎద్దేవా చేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జేఏసీ నేతలు కె.రాజిరెడ్డి, థామస్‌రెడ్డి, న్యూడెమోక్రసీ నేత కె.గోవర్ధన్, బీజేపీ నేతలు చింతా సాంబమూర్తి, సుధా తదితరులు పాల్గొన్నారు.

6,459 బస్సులు నడిపాం: ఆర్టీసీ 
రాష్ట్రవ్యాప్తంగా గురువారం 6,459 బస్సులు నడిపినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 4,531 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,459 మంది తాత్కాలిక కండక్టర్లు విధుల్లో ఉన్నట్టు తెలిపింది. 5,453 బస్సుల్లో టిమ్‌ యంత్రాలు వినియోగించామని, 386 బస్సుల్లో సంప్రదాయ పద్ధతిలో టికెట్లు జారీ చేశామని అధికారులు చెప్పారు.   

సీఎం ఉద్యోగం ఊడుతది: కోమటిరెడ్డి 
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కారి్మకుల ఉద్యోగాలు తీస్తే.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి ఉద్యోగం కూడా ఊడుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద మహిళా కారి్మకులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీ భావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంగళ వారం అర్ధరాత్రి వరకు విధుల్లో చేరకుంటే సుమారు 50 వేల మంది కారి్మకుల ఉద్యోగాలు ఊడినట్లేనని కేసీఆర్‌ హెచ్చరించినా బెదిరింపులకు భయపడకుండా కారి్మకులు ఏకతాటిపై నిలబడి ఐక్యతను చాటుకోవడం అభినందనీయమన్నారు.

చలో ట్యాంక్‌బండ్‌ సక్సెస్‌ చేయండి: ఉత్తమ్‌
సాక్షి, హైదరాబాద్‌: గత 35 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈ నెల 9న ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ‘చలో ట్యాంక్‌బండ్‌’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం ఓ ప్రకటనలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 


ఆర్టీసీ సమ్మెపై కేంద్రం దృష్టి: లక్ష్మణ్‌ 
జగిత్యాల: ఆర్టీసీ కారి్మకులు అధైర్య పడొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. జగిత్యాల డిపో ఎదుట గురువారం సమ్మెలో పాల్గొన్న కారి్మకులను కలసి సంఘీభావం తెలిపారు. లక్ష్మణ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టీసీ కారి్మకులను రోడ్డు పాలు చేసిందన్నారు. ఉద్యమ సమయంలో ఇచి్చన మాట నిలుపుకోవాలని కోరారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్ర ప్రభుత్వం సైతం దృష్టి పెట్టిందని, ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. 

పోలీసుల తీరుపై స్పీకర్‌కు ఫిర్యాదు 
సాక్షి, న్యూఢిల్లీ: కరీంనగర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ బాబు అంతిమయాత్రలో పోలీసులు తనతో అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో స్పీకర్‌ను కల సిన సంజయ్‌ పోలీసుల తీరుకు సంబంధించిన క్లిప్పింగులు, వీడియోలను సమరి్పంచారు. స్పందించిన స్పీకర్‌ ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ సుశీల్‌కుమా ర్‌ సింగ్‌ను ఆదేశించినట్టు సంజయ్‌ మీడియాకు తెలిపారు.   

ఆర్టీసీ కుటుంబాలకు ఎస్వీకేలో ఉచిత వైద్యం 
సాక్షి, హైదరాబాద్‌: సమ్మెలో ఉన్న ఆర్టీసీ కారి్మకులు, వారి కుటుంబాలకు ఉచిత వైద్య సౌకర్యం కలి్పంచాలని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) మేనేజింగ్‌ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్వీకే భవనంలో సాధారణ ప్రజల కోసం నిర్వహిస్తున్న క్లినిక్‌లోనే పని రోజుల్లో ఉదయం 10–12 గంటల మధ్య, సాయంత్రం 6–8 గంటల మధ్య డాక్టర్‌ అందుబాటులో ఉంటారని ఈ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ ప్రజల నుంచి రూ.30 ఫీజు తీసుకుని వైద్యం చేస్తుండగా, ఆర్టీసీ కారి్మకుల కుటుంబాలకు కన్సల్టేషన్‌ ఫీజు లేకుండా ఒక కోర్సు మందులను కూడా ఉచితంగా ఇవ్వాలని కమిటీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు