15 గంటల పాటు పేషెంట్ల మధ్యే మృతదేహం​..

14 Apr, 2020 01:44 IST|Sakshi
ముషీరాబాద్‌లోని శ్మశాన వాటికకు వృద్ధుడి మృతదేçహాన్ని తరలిస్తున్న దృశ్యం

మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాని పరిస్థితి

కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో మృతి చెందిన వృద్ధుడు

ఆదివారం మధ్యాహ్నం అడ్మిట్‌.. అర్ధరాత్రి మృత్యువాత

మరుసటి రోజు మధ్యాహ్నాం 2.30 గంటలకు మృతదేహం తరలింపునకు వచ్చిన అంబులెన్స్‌

హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యతో 69 ఏళ్ల వృద్ధుడు కింగ్‌కోఠి జిల్లా పరిషత్‌ ఆసుపత్రిలో చేరాడు. ‘కరోనా’లక్షణాలు ఉండటంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి ఇతర అనుమానితులు ఉన్న ఐసోలేషన్‌ వార్డులోనే ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం అడ్మిట్‌ అయిన ఆ వృద్ధుడు ఇదేరోజు అర్ధరాత్రి మృతిచెందడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సుమారు 15 గంటల పాటు మృతదేహాన్ని ఇతర పేషెంట్ల మధ్య ఉంచడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అతనికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలితే వీరి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఇటీవలే అహ్మదాబాద్‌ దర్గాకు...
డబీల్‌పురాకు చెందిన ఈ వృద్ధుడు మార్చి 17న భార్య, కుమారుడు, కోడలు, మనుమడు, మనమరాలితో కలసి అహ్మదాబాద్‌లోని దర్గాకు ప్రార్థనలు నిమిత్తం వెళ్లాడు. తిరిగి మార్చి 24న హైదరాబాద్‌కు చేరుకున్నాడు. వచ్చినప్పటి నుంచి జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నాడు. జ్వరం అధికం కావడంతో ఈ నెల 9న సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరాడు. కోలుకోకపోవడంతోపాటు ‘కరోనా’లక్షణాలు కనిపించడంతో 12వ తేదీ(ఆదివారం) మధ్యాహ్నం కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ వృద్ధుడికి వైద్యులు ‘కరోనా’పరీక్షలు నిర్వహించి ఇతర అనుమానిత పేషెంట్లతోపాటు ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. ఈ క్రమంలో అదే రోజు అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు.

ఇతర పేషెంట్ల మధ్యే 15 గంటలు..
అర్ధరాత్రి 2.30 గంటలకు మృతిచెందిన వృద్ధుడిని అక్కడి సిబ్బంది అలాగే ఉంచారు. ఈ వార్డులో ఉన్న మరో 10 మంది రాత్రంతా మృతదేహం మధ్యే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉదయం నారాయణగూడ పోలీసులు, అబిడ్స్‌ ఏసీపీ బిక్షంరెడ్డి.. జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చినా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాలేదు. మృతదేహాన్ని కవర్‌లో కూడా ఉంచకుండా అలాగే బెడ్‌పై ఉంచడంతో వార్డులోని వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ వచ్చింది. అయితే దాన్ని తరలించే వారు రాకపోవడంతో అక్కడే ఉంచారు. వేరే ప్రాంతంలో మరో మృతదేహాన్ని తరలించేవారు సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చి తగు జాగ్రత్తలతో ఈ మృతదేహాన్ని ముషీరాబాద్‌ ఏక్‌మినార్‌లోని శ్మశానవాటికకు తరలించారు. 

మరి కుటుంబం పరిస్థితి ఏంటీ?
అహ్మదాబాద్‌లో, ఇక్కడికి వచ్చిన తరువాత ఈ వృద్ధుడు కుటుంబంతోనే ఉన్నాడు. ఒక వేళ మరణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వస్తే కుటుంబీకుల పరిస్థితి ఏంటన్నది స్థానికుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. అలాగే రాత్రంతా మృతదేహం ఇతర పేషెంట్ల మధ్యే ఉండటంతో వారికి కూడా కరోనా వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. 

మరిన్ని వార్తలు