అబ్బురపడేలా తీర్చిదిద్దటమే మోదీ లక్ష్యం

5 Jan, 2015 02:07 IST|Sakshi

# దేశాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా కృషి  
# కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్
# నదుల్లో రవాణా పథకానికి గోదావరి ఎంపిక దిశగా కేంద్రం యోచన
# టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శ
# మోదీ ప్రభుత్వ పనితీరుపై ప్రజెంటేషన్

సాక్షి, హైదరాబాద్: దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ అన్నారు. ప్రపంచం అబ్బురపడేలా దేశాన్ని తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నారని చెప్పారు. ఏడు నెలల కేంద్ర ప్రభుత్వ పనితీరుపై బీజేపీ తెలంగాణ శాఖ హైదరాబాద్‌లో ఆదివారం ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ఇందులో ప్రధాన వక్తగా పాల్గొన్న వెదిరె శ్రీరామ్.. శాఖల వారీగా మోదీ ప్రభుత్వం చేపడుతున్న వినూత్న పథకాలు, వాటి ప్రయోజనాలను వివరించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సాగిన అవినీతికి అడ్డుకట్ట వేస్తూనే... కాలం చెల్లిన నిబంధనలకు స్వస్తి పలికి, పారదర్శక విధానాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. తొలి ఆరు మాసాల కాలంలో కొత్త విధానాలకు రూ పకల్పన చేసిన మోదీ ప్రభుత్వం... ఇప్పుడు వాటిని అమలుచేస్తూ శరవేగంగా ఫలితాలు సాధిస్తోందని శ్రీరాం చెప్పారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి ‘ప్రధాని కృషి సించయ్ యోజన ’ చేపట్టారన్నారు.

దీని కింద మట్టి నమూనాలు పరిశీలించి పంటలు వేసే విధానం, జిల్లాల వారీగా పంట లపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందిం చటం వంటివి మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నా రు.‘స్వచ్ఛ భారత్’తో ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెరిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం పట్ల భారీ కసరత్తు జరుగుతోందని, ఇది తెలంగాణకు ఉపయోగపడేలా పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన ప్రణాళిక రూపొందించనున్నామని శ్రీరాం తెలిపారు. నదులను కూడా రవాణాకు వినియోగించే ఆలోచనను కార్యరూపంలోకి తేనున్నట్టు వెల్లడించారు. ఈ పథకానికి తొలుత గోదావరి నదినే ఎంపిక చేసుకోవాలని కేంద్రం భావిస్తున్నా... దీనిపై తెలంగాణ ప్రభుత్వం అంతగా స్పందించడం లేదని పేర్కొన్నారు.

కేంద్ర జల వనరుల శాఖ సలహాదారుగా నియమితులైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో... శ్రీరాం వెదిరెను పార్టీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. గంగా ప్రక్షాళన, నదుల అనుసంధానంలో శ్రీరామ్‌దే కీలక పాత్ర అని కేంద్రమంత్రి దత్తాత్రేయ కొనియాడారు. అంకితభావంతో పనిచేయటమే శ్రీరామ్ విజయ రహస్యమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అభినందించారు. కేంద్రంతో సామరస్యంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేఎల్పీ నేత లక్ష్మణ్ సూచించారు. కథలు చెప్పి కాలయాపన చేయటం రాష్ట్రప్రభుత్వానికి అలవాటుగా మారిందని నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. 

>
మరిన్ని వార్తలు