సీఎం కుర్చీలో రేవంత్‌

8 Dec, 2023 04:29 IST|Sakshi

సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్‌లో బాధ్యతల స్వీకారం

సతీమణి గీతతో కలసి ప్రత్యేక పూజలు

సచివాలయంలోకి జర్నలిస్టుల ప్రవేశంపై ఆంక్షలు ఎత్తివేత

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో లాంఛనంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. సాయంత్రం 4.20 గంటలకు సతీమణితో కలసి సచివాలయానికి చేరుకున్న రేవంత్‌కు.. ప్రధానద్వారం వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, పలువురు ఉన్నతాధికారులు పోలీసు అధికార బ్యాండ్‌ మోగుతుండగా ఘనంగా స్వాగతం పలికారు.

రేవంత్‌ అక్కడి నుంచి నడుచుకుంటూనే సచివాలయం లోపలికి వెళ్లారు. సీఎం చాంబర్‌ వద్ద ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత సతీమణి గీతతో కలసి రేవంత్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సాయంత్రం 4.46 నిమిషాలకు ముఖ్యమంత్రి అధికారిక కుర్చీలో ఆసీనులయ్యారు. సీఎం దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతిధులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత సచివాలయంలోనే రేవంత్‌ అధ్యక్షతన నూతన మంత్రివర్గ తొలి సమావేశం జరిగింది.

తెరుచుకున్న సచివాలయం ద్వారాలు
రాష్ట్ర నూతన సచివాలయం ద్వారాలు గురువారం ప్రజలందరి కోసం తెరుచుకున్నాయి. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక సచివాలయానికి వస్తారని తెలియడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సచివాలయానికి చేరుకున్నారు. అధికారులు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలకు పాస్‌లు ఇచ్చి లోపలికి అనుమతించారు. దీంతో సచివాలయం లోపల సందడి కనిపించింది.

తొలిసారిగా జర్నలిస్టులను పాస్‌ల అవసరం లేకుండా మీడియా గుర్తింపు కార్డులు చూసి కొత్త సచివాలయంలోకి అనుమతించారు. గతంలో సచివాలయంలోకి జర్నలిస్టుల ప్రవేశంపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేయడం, ప్రధాన భవనం లోపలే మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించడంపై మీడియా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.     

>
మరిన్ని వార్తలు