పెరిగిన ఓటర్లు

4 Sep, 2018 10:11 IST|Sakshi

కొన్ని నియోజకవర్గాల్లో గణనీయంగా పెరిగిన ఓటర్లు  

మహేశ్వరంలో 24శాతం,ఎల్‌బీనగర్‌లో 15శాతం, నాంపల్లిలో 6.5 శాతం   

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. తాజా ఓటర్ల జాబితానే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు నగర జనాభా, ఓటర్ల సంఖ్యలో పురోగతి కనిపిస్తోంది. దాదాపు 7నెలల వ్యవధిలోనే మహేశ్వరం నియోజకవర్గ జనాభా 25శాతం పెరిగింది. అలాగే ఎల్‌బీనగర్‌లో 15శాతం, నాంపల్లిలో 6.5శాతం మేర ఓటర్లు పెరిగినట్లు తాజా ముసాయిదా జాబితాలో వెల్లడైంది. హైదరాబాద్‌ జిల్లాలో కొత్తగా ఎక్కువ మంది ఓటర్లుగా నమోదు చేసుకున్న నియోజకవర్గాల్లో నాంపల్లి, కార్వాన్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. జనవరి 20న ఓటర్ల తుది జాబితా అనంతరం... తాజా ముసాయిదా విడుదల వరకు నాంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 17,860 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తుది జాబితా మేరకు నియోజకవర్గంలో 2,73,079 మంది ఓటర్లు ఉండగా... 6.5శాతం పెరిగారు. కార్వాన్‌ నియోజకవర్గంలో తుది జాబితా నాటికి 2,86,436 మంది ఓటర్లుండగా.. కొత్తగా 10,879(4శాతం) మంది నమోదు చేసుకున్నారు. ఇక శివార్లలోని మహేశ్వరం నియోజకవర్గంలో తుది జాబితా నాటికి 3,23,660 మంది ఓటర్లు ఉండగా... ప్రస్తుతం 4,02,442 మంది ఉన్నారు. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో తుది జాబితాలో 4,01,137 మంది ఓటర్లుండగా... తాజా ముసాయిదాలో 4,65,154 మంది ఉన్నారు. నగర శివార్లలో వేగంగా విస్తరిస్తుండడంతో అక్కడ ఎక్కువ మంది నివాసం ఉంటున్నారు.  

మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే చాంద్రాయణగుట్టలో పురుషులతో దాదాపు సమానంగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పురుషులు 1,49,348 మంది ఉండగా, మహిళలు 1,42,415 మంది ఉన్నారు. అలాగే కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో పురుషులు 1,16,886 మంది కాగా... మహిళా ఓటర్లు 1,12,793 మంది.   

గ్రేటర్‌ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్, మల్కాజిగిరిలలో మాత్ర మే థర్డ్‌జెండర్స్‌ లేరు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో కలిపి 840 మంది ఓటర్లున్నారు.  

తగ్గిన తొలగింపులు...  
గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. వివిధ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు, కోర్టులకు వెళ్తుండడం తదితర కారణాలతో ఓటర్లను తొలగించేందుకు అధికారులు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు  చాలామంది అధికారులు ఇంటింటి సర్వే చేయకుండానే ముసాయిదా రూపొందించారనే ఆరోపణలున్నాయి. ఇళ్లకు వెళ్లకుండానే తొలగిస్తే తీవ్ర సమస్యలు ఎదురవనుండడంతో చిరునామాలు మారినవారు, మరణించిన వారి పేర్లను అలాగే ఉంచారనే అభిప్రాయాలున్నాయి.

మరిన్ని వార్తలు