పీపుల్స్‌మేనిఫెస్టో

19 Oct, 2023 03:33 IST|Sakshi

గ్రేటర్‌ హైదరాబాద్‌

రాష్ట్రంలోని మొత్తం ఓటర్లు 3,17,32,727 మంది. వీరిలో గ్రేటర్‌ను ఆనుకొని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల ఓటర్లు 1,04,90,621 మంది. అంటే దాదాపు మూడోవంతు మంది ఇక్కడే ఉన్నారు. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారూ ఎందరో ఉన్నారు. నగర ప్రజల మేనిఫెస్టోను అమలు చేయడమంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అమలు చేసినట్లే.    – సాక్షి, హైదరాబాద్‌

రవాణా.. అతిపెద్ద సమస్య
నగరంలోని ప్రజలే కాక ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్నవారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య రవాణా. జిల్లాల నుంచి నగర శివార్లలోకి రెండు గంటలలోపే చేరుకుంటున్నప్పటికీ, అక్కడి నుంచి నగరంలోని గమ్యస్థానాలకు చేరుకునేందుకు రెండున్నర గంట­లు పడుతోంది. ఇందుకు పరిష్కారంగా ఇస్నాపూర్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు, యాదాద్రి నుంచి చౌటుప్పల్‌ వరకు.. నగరం నలువైపులా ఎటునుంచి ఎటు వెళ్లేందుకైనా మెట్రో రైలు కావాలంటున్నారు. అంద­రికీ అందుబాటు ధరల్లో ప్రజారవాణా పెరగాలి. ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లు నిర్మించినా ట్రాఫిక్‌ ఇక్కట్లు తీరలేదు. ట్రాఫిక్‌ జామ్‌లు తప్పేలా లింక్‌రోడ్లు పెరగాలి.  అన్ని రద్దీప్రాంతాల్లో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలుండాలి.  

వరద ముంపు తప్పాలి 
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో వానొస్తే నాలాల్లో  మరణాలు తప్పడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి నాలాలన్నింటినీ ఆధునీకరించాలి. నాలాల మరణాలు తప్పేలా పటిష్ట చర్యలు  చేపట్టాలి. ప్రయాణ దూరాభారం  తగ్గించేందుకు మూసీపై 14 వంతెనలు  అందుబాటులోకి రావాలి. 
 
అపరిమిత ఇంటర్నెట్‌.. 
మొబైల్‌ లేనిదే చేయి విరిగినట్లుగా భావిస్తున్న రోజుల్లో ప్రతి ప్రాంతంలో అన్ని వేళలా ఉచిత ఇంటర్నెట్‌ ఉంటే ఎంతో మేలంటున్నారు. ప్రజలకు ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసే సదుపాయం ఉన్నా, ఇంటర్నెట్‌కు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండరాదని, అందులోనూ అంతరాయాలు ఉండొద్దని బలంగా కోరుకుంటున్నారు.  గమ్యస్థానాలకు చేరుకునేందుకు, ఆయా ప్రాంతాల్లో రద్దీ తెలుసుకునేందుకు 
సింగిల్‌యాప్‌ లాంటిది కావాలని  కోరుకుంటున్నవారెందరో ఉన్నారు. 

ఉద్యోగాలు.. సొంతిళ్లు.. ఆరోగ్య బీమా 
పేదలందరికీ డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లతోపాటు సొంతిళ్లు లేనివారికి నెలనెలా ఈఎంఐలతో గృహ సదుపాయం కల్పించాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ లేదా కనీసం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని అలవెన్సులు, సకాలంలో ఉద్యోగాల భర్తీ, పేదలకు ఉచిత వైద్యంతోపాటు అవసరమైన పక్షంలో శస్త్రచికిత్సలకు ఉపకరించేలా ప్రభుత్వమే ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలంటున్నారు.    

24 గంటలు స్వచ్ఛమైన నీరు 
కరెంటు కష్టాలు తీరినప్పటికీ నగరంలో నీటి ఇబ్బందులున్నాయి. నిర్ణీత వేళల్లో కాకుండా 24 గంటలు ఎప్పుడు నల్లా తిప్పినా తాగునీరొచ్చే సదుపాయం  ఉండాలంటున్నారు ప్రజలు. 

మరిన్ని వార్తలు