వేతన నష్టాలను సరి చేయాలి

4 Feb, 2015 03:21 IST|Sakshi
వేతన నష్టాలను సరి చేయాలి

 సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ఉద్యోగులకు ఉమ్మడి రాష్ట్రంలో వేతనపరంగా జరిగిన నష్టాలను సరిచేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వనున్న మొదటి పీఆర్‌సీలో ఆ నష్టాన్ని పూడ్చం డి’’ అని పీఆర్‌సీ హైపవర్ కమిటీకి సచివాలయ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. పీఆర్‌సీపై ఉద్యోగ సంఘాలతో చర్చల్లో భాగం గా సచివాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో హైపవర్ కమిటీ చైర్మన్ ప్రదీప్ చంద్ర, ఇతర అధికారులు, తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మాచారి, సచివాలయ టీఎన్‌జీవో, టీజీవో, క్లాస్-4, టప్పాల్ అసిస్టెంట్ సంఘాల అధ్యక్షులు శ్రావణ్‌కుమార్‌రెడ్డి, రాజ్‌కుమార్ గుప్తా, వెంకటేశ్వర్‌రావు, కిషన్‌లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను హైపవర్ కమిటీకి తెలియజేశారు. అనంతరం  పీఆర్‌టీయూ తెలంగాణ  అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్ల పేరును హయ్యర్ గ్రేడ్ టీచర్‌గా మార్చా లని కోరారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌కు ఫ్యాక్స్ ద్వారా విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రంలో పీఆర్‌సీని వెంటనే అమల్లోకి తేవాలని తెలంగాణ బీసీ టీచర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, టీచర్లకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో హెల్త్‌కార్డులు అమల య్యేలా చూడాలని టీఎస్‌టీయూ ప్రధాన కార్యదర్శి ఆడమ్స్ కోరారు.
 హైపవర్ కమిటీ ముందుంచిన డిమాండ్లు...

  •  కుటుంబం అంటే ముగ్గురు కాకుండా నలుగురిగా పరిగణనలోకి తీసుకోవాలి. నలుగురికి సరిపడేలా కనీస మూల వేతనాన్ని    ఒక్కొక్కరికి రూ. 4 వేల చొప్పున రూ. 16 వేలకు పెంచాలి.
  •  ఫిట్‌మెంట్ 75 శాతం ఇవ్వాలి.
  •  ట్రాన్స్‌పోర్టు అలవెన్సును కేంద్ర ప్రభు త్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలి.
  •  ఒక్క చైల్డ్‌కు స్కూల్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రూ. 15 వేలకు పెంచాలి.
  •  గత పీఆర్‌సీల్లో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు 2013 జూలై 1 నుంచే పీఆర్‌సీని నగదు రూపంలో     వర్తింపజేయాలి.
  •  హైపవర్ కమిటీ నివేదిక ఇవ్వడంలో ఆలస్యం చేయొద్దు.
     

మరిన్ని వార్తలు