రాష్ట్రంలో వాల్‌మార్ట్ మాల్స్

23 Apr, 2015 02:10 IST|Sakshi
రాష్ట్రంలో వాల్‌మార్ట్ మాల్స్

హైదరాబాద్‌తో పాటు  జిల్లాల్లో ఏర్పాటుకు ప్రణాళికలు
సీఎం కేసీఆర్‌ను కలిసి  ప్రతిపాదించిన సంస్థ ప్రతినిధులు

 
హైదరాబాద్: ప్రపంచ ప్రసిద్ధ రిటైల్ వ్యాపార సంస్థ ‘వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్’ రాష్ట్రంలో అడుగు మోపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. హైదరాబాద్‌లో నాలుగైదు రిటైల్ కేంద్రాలు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో శాఖలు నెలకొల్పేందుకు ఆ సంస్థ ఆసక్తిని ప్రదర్శిస్తోంది. వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ సీఈఓ డేవిడ్ చీష్ రైట్, భారత విభాగం సీఈఓ క్రిష్ అయ్యర్, ఉపాధ్యక్షుడు రజనీష్ కుమార్ తదితరులు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలుసుకుని తమ ఆలోచనలను ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వాల్‌మార్ట్ రాష్ట్రంలో తమ శాఖలు స్థాపించడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. వాల్‌మార్ట్ లాంటి సంస్థలు తెలంగాణ ఉత్పత్తులకు మార్కెట్ పెంచేం దుకు, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శ్రద్ధ చూపాలని సూచించారు.

హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న రైతులు మేలైన కూరగాయలు, పండ్లు, పసుపు, అల్లం, కరివేపాకు తదితర అంతర్జాతీయ డిమాండు ఉన్న పంటలు పండిస్తున్నారని వాల్‌మార్ట్ ప్రతినిధులకు వివరించారు. వీటిని ఎక్కువగా మార్కెటింగ్ చేస్తే మాల్స్ నిర్వాహకులకు లాభాలతో పాటు స్థానిక రైతులకు సైతం మేలు జరుగుతుందన్నారు. ఐకియా, లూలు లాంటి సంస్థలు సైతం తమ వ్యాపారాన్ని రాష్ట్రంలో విస్తరించడానికి ముందుకు వచ్చాయన్నారు. 478 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన తమ కంపెనీ 95 శాతం వరకు స్థానిక ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నిస్తుందని వాల్‌మార్ట్ ప్రతినిధులు సీఎంకు తెలియజేశారు. ఈ కామర్స్ విధానాన్ని కూడా ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. తమ సంస్థకు కావాల్సిన అనుమతులు, లెసైన్స్‌లు ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు.
 
ఇక 365 రోజులూ  దుకాణాలు తెరవచ్చు
 
రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, మాల్స్ 365 రోజులు పనిచేసే విధంగా విధానపర మార్పులు తెస్తున్నామని ముఖ్యమంత్రి  కేసీఆర్ వెల్లడించారు. అందులో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఒక రోజు కచ్చితంగా సెలవు ఇవ్వాలనే నిబంధన కూడా విధిస్తామన్నారు. ఆదివారం కూడా షాపులు తెరవడం వల్ల 20 శాతం ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. వాల్‌మార్ట్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ జయేశ్ రంజన్, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు