అమెరికాలో వరంగల్‌ విద్యార్థిపై కాల్పులు

8 Jul, 2018 02:07 IST|Sakshi

ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందిన శరత్‌ 

మిస్సోరి రాష్ట్రంలోని కాన్సస్‌లో దారుణం

సాక్షి, వరంగల్‌/హైదరాబాద్‌: అమెరికా లోని మిస్సోరి రాష్ట్రంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో వరంగల్‌కు చెందిన కొప్పు శరత్‌(26) అనే విద్యార్థి మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం(అమెరికా కాలమానం ప్రకారం) మిస్సోరిలోని కాన్సస్‌ నగరంలో ఓ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని శరత్‌ను ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వరంగల్‌లోని కరీమాబాద్‌ ప్రాంతానికి చెందిన కొప్పు రామ్మోహన్, మాలతి దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు శరత్‌. కూతురు అక్షర. రామ్మోహన్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం చేస్తుండగా, మాలతి పంచాయతీరాజ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 

మూడేళ్ల క్రితం వరంగల్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేసిన రామ్మోహన్‌.. ప్రస్తుతం హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తూ అమీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. ఆయన తనయుడు శరత్‌ హైదరాబాద్‌లోని వాసవి ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తిచేసి.. మిస్సోరి యూనివర్సిటీలో ఎమ్మెస్‌ చదివేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు. కాన్సస్‌లోని చార్లెట్‌ స్ట్రీట్‌ అపార్ట్‌మెంట్‌ 5303 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం అల్పాహారం కోసం శరత్‌ దగ్గర్లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఇంతలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. 

‘‘ఇద్దరు స్నేహితులతో కలిసి శరత్‌ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఇంతలో కొందరు దుండగులు వచ్చి కాల్పులు జరిపినట్టు సమాచారం వచ్చింది. శరత్‌తో ఉన్న ఇద్దరు తప్పించుకున్నారు. శరత్‌ కూడా పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ వెనుక నుంచి కాల్పులు జరిపారు’’ అని రామ్మోహన్‌ తెలిపారు. అమెరికా నుంచి ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పినట్లు వివరించారు. పూర్తి సమాచారం అందించాలంటూ రామ్మోహన్‌ శనివారం డీజీపీని కలిశారు.  

- కొప్పు శరత్‌(ఫైల్‌) 

మరిన్ని వార్తలు