వాటర్‌గ్రిడ్ @ఃరూ.2070 కోట్లు

26 Sep, 2014 02:49 IST|Sakshi
వాటర్‌ గ్రిడ్ @ఃరూ.2070 కోట్లు

నీలగిరి :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించాలనుకుంటున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అంచనాలు ఓ కొలిక్కివచ్చాయి. జిల్లావ్యాప్తంగా 24 గంటలూ అన్ని గ్రామాలు,  మున్సిపాలిటీలకు తాగునీటిని సరఫరా చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రిడ్ ప్రతిపాదనలు తయారుచేయడంలో జిల్లా గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అహర్నిశలు శ్రమించింది. గ్రిడ్ అమలుకు అవసరమయ్యే నీటి వనరులు, పనుల అంచనాలు, పైప్‌లైన్ల డిజైన్‌లకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేసి చీఫ్ ఇంజినీరింగ్ కార్యాలయానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే  జిల్లావ్యాప్తంగా నెలకొన్న తాగునీటి సమస్య తీరుతుంది. ప్రధానంగా ఫ్లోరైడ్ ప్రాంతాల్లో కలుషిత  నీటిని తాగుతూ జీవచ్ఛవాల్లా మారుతున్న మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు కృష్ణా జలాలతో కళకళలాడుతాయి. తీవ్ర వర్షాభావంతో కొట్టుమిట్టాడుతూ ఎత్తయిన ప్రాంతాల్లో ఉన్న భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలు తాగునీటి గండం నుంచి గట్టెక్కుతాయి. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కొరత లేకుండా కేటాయిస్తే నాలుగేళ్లలో వాటర్‌గ్రిడ్ ఫలాలు ప్రజలకు అందుతాయి.
 
 కృష్ణాజలాలు...మంచినీటి చెరువులు
 అధికారులు రూపొందించిన ప్రణాళికల ప్రకారం నాలుగుచోట్ల గ్రిడ్‌లు ఏర్పాటు కానున్నాయి. వీటి ఏర్పాటుకు రూ.2070 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొదటి గ్రిడ్ అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నిర్మిస్తారు. దీని పరిధిలో దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు ఉంటాయి.  2, 3 గ్రిడ్‌లు పానగల్లులోని ఉదయసముద్రం రిజ్వరాయర్ వద్ద నిర్మిస్తారు. ఈ రెండు గ్రిడ్‌ల పరిధిలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట, నకిరేకల్ నియోజకవర్గాలు ఉం టాయి. నకిరేకల్ నియోజకవర్గంలోని నాలు గు మండలాలు గ్రిడ్-2 పరిధిలోకి, రెండు మండలాలు గ్రిడ్-3లో కలిపారు. 4వ గ్రిడ్ నాగార్జునసాగర్ ఎడమ కా ల్వ ప్రవహించే ప్రాంతాల్లో నిర్మిస్తారు. దీని పరిధిలో మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ  ప్రాజెక్టులకు కృష్ణాజలాలతోపాటు, ముప్పారం, వాయిలసింగారం, మంచినీటి చెరువులను వినియోగిస్తారు.
 
 సమృద్ధిగా నీటి వనరులు...
 వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులకు అవసమయ్యే నీటి వనరులు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణాజలాలు, మంచినీటి చెరువులను వినియోగించనున్నారు. జిల్లాలో హ్యాబిటేషన్లు 3591లు దాకాఉన్నాయి. దీంట్లో ప్రస్తుతం  1541 హ్యాబిటేషన్లకు 2.5 టీఎంసీల తాగునీరు సరఫరా అవుతోంది. మిగిలిన 2050 హ్యాబిటేషన్లు, మున్సిపాలిటీలకు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కావాలంటే 7.08 టీఎంసీల నీరు అవసరమవుతుంది. మొత్తంగా అన్ని గ్రామాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా నీటిని అందించాలంటే 9.58 టీఎంసీల నీరు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 30 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు నుంచి తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం ఉదయసముద్రానికి 1.5 టీఎంసీలు విడుదల అవుతుంది. కాబట్టి గ్రిడ్‌లకు నీటి సమస్య అనేది ఉండదు. అయితే అన్ని సందర్భాల్లో ఐకేబీఆర్ నుంచి ఉదయ సముద్రానికి నీటి విడుదల సాధ్యం కానందున అక్కడినుంచి ఉదయ సముద్రానికి నేరుగా కొత్త పైప్‌లైన్ నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఐకేబీఆర్ ద్వారా మూడు గ్రిడ్‌లకు, సాగర్ ఎడమ కాల్వల ద్వారా నాలుగో గ్రిడ్‌కు నీటిని అందిస్తారు.
 
 నాలుగు దశల్లో...
 ప్రభుత్వం నిధుల మంజూరులో వెనకడుగు వేయకుం డా శరవేగంగా పనులు చేపడితే నాలుగు దశల్లో  పూర్తయ్యే అవకాశముంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న మంచినీటి పథకాలను కూడా ఈ గ్రిడ్‌లను అనుసంధానం చేస్తారు. పురోగతిలో ఉన్న ప్రాజెక్టులను కూడా గ్రిడ్‌లకు కలుపుతారు. అదేవిధంగా ప్రస్తుతం గ్రామా ల్లో 8 గంటలపాటు నీటిని సరఫరా చేసే పైపులైన్లు ఉన్నాయి. గ్రిడ్ ఏర్పాటైతే 24గంటల పాటు నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. కాబట్టి లూప్ డిజైన్ ద్వారా ప్రస్తుతం ఉన్న పైప్‌లకు లింక్ చేస్తారు. దీంతో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయమూ ఏర్పడదు.
 
 జిల్లాకు ఎంతో ప్రయోజనం : రాజేశ్వరారవు, ఆర్‌డబ్ల్యూఎస్, ఎస్‌ఈ
 వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు లైన్ ఎస్టిమేట్లు రూపొందించి ఈఎన్‌సీకి సమర్పించాం. జిల్లాలో నాలుగు గ్రిడ్‌లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. గ్రిడ్‌ల నిర్మాణం జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనకరం. ఫ్లోరైడ్ ప్రాంతాలకు తాగునీరు, వర్షాభావ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీరుతుంది.
 
 గ్రిడ్-2లో నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల, కట్టంగూరు, నార్కట్‌పల్లి, రామన్నపేట మండలాలు కలిపారు.
 3లో నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని  కేతేపల్లి, నకిరేకల్ మండలాలు కలిపారు.
     4లో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాలు కలిపారు.
     ఆలేరు నుంచి వరంగల్ జిల్లాలో జనగామ నియోజకవర్గానికి తాగునీరు అందిస్తారు.
     తిరుమలగిరి నుంచి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి తాగునీరు అందిస్తారు.
 
 గ్రిడ్    అంచనా వ్యయం    కావాల్సిన నీరు
 సంఖ్య    (కోట్లలో)    (టీఎంసీలలో)
 గ్రిడ్-1    రూ.470    2.00
 గ్రిడ్-2    రూ.800    2.33
 గ్రిడ్-3    రూ.400    1.77
 గ్రిడ్-4    రూ.400    3.48
 

మరిన్ని వార్తలు