సప్తవర్ణ శోభితం.. ముగింపు ఉత్సవం

8 Jun, 2015 04:53 IST|Sakshi
సప్తవర్ణ శోభితం.. ముగింపు ఉత్సవం

అంబరాన్నంటిన సంబురాలు
కనువిందు చేసిన కళారూపాలు
ఇంద్రధనుస్సును తలపించిన ట్యాంక్‌బండ్
కదలివచ్చిన సకల కళలు.. సబ్బండ వర్ణాలు
హాజరైన గవర్నర్, ముఖ్యమంత్రి దంపతులు
సాక్షి, హైదరాబాద్: 
తెలంగాణ తొలి అవతరణ వేడుక ముగింపు సంబురాలు అంబరాన్నంటాయి.

ఏడు రోజుల పాటు సాగిన ఉత్సవాలు ఆదివారం రాత్రి హైదరాబాద్ హుస్సేన్ సాగర తీరంలో సప్తవర్ణ శోభితంగా ముగిశాయి. తెలంగాణ సంస్కృతి, కళా వైభవం ఉత్సవాల్లో సమున్నతంగా ప్రతిబింబించింది. నింగిలో విరిసిన వెలుగు పూలు.. సాగర తీరంలో లేజర్ షో తళుకులు... అందుకు అనుగుణంగా తెలంగాణ కళారూపాలతో ప్రతిధ్వనించిన సంగీతం.. ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. రంగు రంగుల విద్యుద్దీపాల కాంతులలో బుద్ధ విగ్రహం దేదీప్యమానంగా వెలుగొందింది.

సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన ముగింపు వేడుక చారిత్రక ఘట్టంగా నిలిచిపోయింది. దాదాపు లక్ష మందికి పైగా రావడంతో ట్యాంక్‌బండ్ జనసంద్రమైంది. తెలంగాణ ఆటాపాటా, బతుకమ్మలు, బోనాలు, పీర్లు, ఒగ్గుడోళ్లు, చిందు యక్షగానాలు, బైండ్ల కథలు, శారద కథలు, గుస్సాడీ నృత్యాలు సహా తెలంగాణ కళలు, సంస్కృతిని ప్రతిబింబించే వందలాది కళారూపాలు ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చాయి. పారిశుధ్య కార్మికుల స్వచ్ఛ హైదరాబాద్ ప్రదర్శన, పోతురాజుల నృత్యాలు, కోలాటాలు, లంబాడా నృత్యాలు కన్నుల పండువగా సాగాయి.

ముగింపు ఉత్సవాల్లో భాగంగా కాకతీయుల కళా తోరణాన్ని తలపించే విధంగా ట్యాంక్ బండ్‌పై భారీ వేదికను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా వచ్చిన గవర్నర్ నరసింహన్ దంపతులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ స్వయంగా గవర్నర్‌కు లడ్డూ తినిపించారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఆకాశంలో ప్రతి బింబించే ‘రోబో పతంగులను’ గవర్నర్, సీఎంలు వేదికపై నుంచి ఎగురవేశారు.

పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ వరకు ఊరేగింపుగా వచ్చిన వేలాది మంది కళాకారుల విన్యాసాలను వేదికపై నుంచి తిలకించారు. ఈ వేడుకలకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, భాషా సంస్కృతి శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ సారథ్యంలో ఆరువేల మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
 
ఉత్సవాలకు దూరంగా ఓయూ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తొలి ఉత్సవాలకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దూరంగా ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కేంద్రంగా.. ఉద్యమ రణరంగంగా ఉన్న ఓయూ క్యాంపస్‌లో ఉత్సవాల ఊసే లేకపోవడం చర్చనీయాంశమైంది. గత వారం రోజు లుగా రాష్ట్రమంతటా అవతరణ ఉత్సవాలు జరుపుకొని ఆదివారం ముగిసినా ఓయూ క్యాంపస్‌లో ఒక్క విద్యార్థి సంఘం కూడా ఉత్సవాలు జరిపేందుకు ముందుకు రాలేదు.

అధికార పార్టీ విద్యార్థి సంఘం టీఆర్‌ఎస్వీ ఉత్సవ తొలిరోజున కేక్ కోసి జెండా ఎగురవేయగా ఇతర విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకొని గొడవకు దిగారు. ఉద్యోగాల భర్తీలో జాప్యం, కాంట్రాక్టు ఉద్యోగుల పర్మనెంట్ తదితర అంశాలతో పాటు సీఎం కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తున్న ఓయూ విద్యార్థులు కావాలనే ఉత్సవాలకు దూరంగా ఉన్నట్లు విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు.
 
కదం తొక్కిన తెలంగాణ జానపదం
ఉత్సవాల్లో భాగంగా వేలాది మంది కళాకారులు నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. డీజే సంగీత హోరులో.. తెలంగాణ జానపదాలకు అనుగుణంగా కుర్రకారు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, లుంబినీ పార్క్ పరిసరాలు జనజాతరను తలపించాయి. తెలంగాణ పది జిల్లాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది కళాకారులు, తెలంగాణ వాదులతో ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయింది.
 
కనువిందు చేసిన లేజర్...‘షో’
పర్యాటక శాఖ హుస్సేన్‌సాగర్ మధ్య నుంచి ప్రదర్శించిన త్రీ డీ లేజర్ షో మిరుమిట్లు గొలుపుతూ అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. లేజర్ వెలుగులో బుద్ధ విగ్రహం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాకతీయ శిల్పకళా తోరణం రంగుల హరివిల్లుతో కనువిందు చేశాయి. సుమారు గంటపాటు నిర్వహించిన లేజర్ షో ఆకాశంలో ఇంద్ర ధనుస్సును సృష్టిస్తూ పేల్చిన బాణాసంచా ప్రదర్శనకే హైలైట్ అయింది. ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 
ఆకట్టుకున్న ప్రదర్శనలు..
ట్యాంక్‌బండ్‌పై వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల సిబ్బంది నిర్వహించిన ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పోలీసు బెటాలియన్స్, బ్రాస్‌బ్యాండ్, ఫైర్ బ్యాండ్, అశ్విక దళం కవాతు, షీ టీమ్స్, పోలీసు సిబ్బంది బైక్ ర్యాలీ అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రధాన వేదిక ముందు నుంచి జీహెచ్‌ఎంసీ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి చిహ్నంగా రూపొందించిన జాడూ వాహనం, సిబ్బంది కవాతు అలరించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వేదికపై నుంచి అభివాదం చేస్తూ కళాకారులను ఉత్సాహపరిచారు.
 
లక్ష లడ్డూల పంపిణీ..

ముగింపు ఉత్సవాలకు హాజరైనవారికి ప్రభుత్వం లడ్డూలు పంపిణీ చేసింది. దాదాపు లక్ష లడ్డూలు పంపిణీ చేసినట్లు సమాచారం. ప్రధాన వేదికకు చేరుకునే అవకాశం లేనివారు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ తెరలపై వేడుకలను తిలకించారు. ఉత్సవాలకు హాజరైన వారి దాహార్తిని తీర్చేందుకు జలమండలి, జీహెచ్‌ఎంసీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నీటి క్యాంపులు ఏర్పాటు చేసి వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు