వాటర్‌గ్రిడ్‌ను ముందే ‘నీరు’గార్చారు

27 Jan, 2015 03:22 IST|Sakshi

- ఇక ‘లైడార్’ టెక్నాలజీ లేకుండానే సర్వే  
- ఖర్చు పెరగడం, అనుమతుల్లో జాప్యంతోనే వెనక్కి
- సంప్రదాయ పద్ధతిలో సర్వేకే సర్కారు మొగ్గు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాటర్ గ్రిడ్ లైన్ సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు ‘లైటింగ్ డిటెక్షన్ రేంజింగ్’ (లైడార్) టెక్నాలజీని వినియోగించాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విరమించుకుంది. లైడార్ టెక్నాలజీకి బదులుగా లైన్ సర్వే నిమిత్తం సంప్రదాయ (టోటల్ స్టేషన్ అండ్ డీజీపీఎస్) పద్ధతులనే అవలంబించాలని నిర్ణయించినట్లు తెలిసింది. లేజర్ కిరణాలతో రిమోట్ సెన్సింగ్ (లైడార్) ద్వారా భూ ఉపరితలాన్ని సర్వే చేసే ప్రక్రియకు, సంప్రదాయ విధానం కంటే అధికంగా ఖర్చవుతుండడం ఒక కారణమైతే.

లైడార్ టెక్నాలజీతో లైన్ సర్వేకు డి ఫెన్స్ విభాగం నుంచి అనుమతులు రావడం క్లిష్టంగా మారడం మరో కారణమని సంబంధిత  అధికారులు తెలిపారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలన్నది లక్ష్యం. ఈ సమయంలో నిర్ణీత వ్యవధిలో పూర్తికావాలంటే అధునాతన పద్ధతులనే అవలంభించాలని, సంప్రదాయ పద్ధతుల ద్వారా నిర్దేశిత సమయంలో లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం కాదని వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అధికారులు వాపోతున్నారు.
 
అనుమతుల జారీలో జాప్యం..
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన అటవీ శాఖ నుంచి అనుమతులు రావడంలో జాప్యం జరుగుతోందని గ్రిడ్ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు చెబుతున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టుకు వివిధ శాఖలు వెంటనే అన్ని అనుమతులు ఇవ్వాలని సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అనుమతులు ఇచ్చే విషయంలో కొన్ని శాఖలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని అధికారులు వాపోతున్నారు. అనుమతుల కోసం దాదాపు అన్ని శాఖలకు నెల రోజుల కిందటే ప్రతిపాదనలు పంపినట్లు వారు చెబుతున్నారు.

ఈ విషయమై ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు అధికారులు పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు దృష్టికి తేగా, అటవీ శాఖ నుంచి అనుమతులు త్వరితగతిన వచ్చేలా చర్యలు చేపడతానని వారికి చెప్పారు. వాటర్ గ్రిడ్ నిర్మాణంలో భాగంగా అటవీ ప్రాంతంలో పైపులైన్ల ఏర్పాటుకు 4,265.48 ఎకరాలు, ఇతర నిర్మాణాల కోసం మరో 118 ఎకరాలను కేటాయించేందుకు అటవీశాఖ అనుమతించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు