పది టీఎంసీలకు పడిపోయిన ‘ఎల్లంపల్లి’

4 Sep, 2019 10:45 IST|Sakshi
ఎల్లంపల్లి శ్రీపాదసాగర్‌ ప్రాజెక్టు

సాక్షి, మంచిర్యాల(హాజీపూర్‌): తగ్గుముఖం పట్టిన వర్షాలు... ఎగువ ప్రాంతాల నుంచి నిలిచిన నీటి ప్రవాహం... హైదరాబాద్‌కు నీటి తరలింపు.. తదితర కారణాల వల్ల ఎల్లంపల్లి శ్రీపాదసాగర్‌ ప్రాజెక్టులోని నీటి మట్టం రోజురోజుకు తగ్గుతూ వస్తుంది. 10 రోజుల క్రితం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 10.679 టీఎంసీలుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 19.700 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. వర్షాలు పడి భారీ నీటి నిల్వలతో ఉన్న ప్రాజెక్టు ఇలా ఖాళీ అవ్వడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు ప్రాజెక్టులో నీటిమట్టం వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి.

ప్రాజెక్టు 148 మీటర్ల క్రస్ట్‌ లెవెల్‌కు గాను 144 మీటర్లు ఉండగా 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 10.679 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉంది. ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్‌ ఫ్లో, అవుట్‌ ఫ్లో లేదు. ఇక హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ వర్క్స్‌(సుజల స్రవంతి పథకం) ద్వారా గ్రేటర్‌ హైదరాబాద్‌కు 300ల క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీటిని, మిషన్‌ భగీరథ కింద పెద్దపల్లి–రామగుండం నీటి పథకానికి 63 క్యూసెక్కులు, మంచిర్యాల నియోజకవర్గానికి 15 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు