వైఎస్‌ జగన్‌ సీఎం కావడంతో.. ఇడుపులపాయకు పాదయాత్ర

2 Jun, 2019 12:40 IST|Sakshi

 వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడంతో 

 మొక్కు తీర్చుకునేందుకు తరలిన అభిమాని

కొత్తకోట రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడంతోపాటు ముఖ్యమంత్రి కావడంతో తన మొక్కు తీర్చుకునేందుకు ఓ యువకుడు ఇడుపులపాయకు పాదయాత్రగా బయల్దేరాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి అభిమాని అయిన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదళ మండలం నల్లవెళ్లి గ్రామానికి చెందిన శివలింగం గత నెల 29న ఇడుపులపాయకు పాదయాత్ర చేపట్టాడు. ఈపాదయాత్ర శనివారం రాత్రి వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరుకుంది. పాదయాత్ర చేస్తున్న శివలింగాన్ని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2004లో వైఎస్‌ఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినయ్యానని, అప్పటి నుంచి ఆయనకు వీరాభిమానిగా మారనన్నారు.

జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేస్తానని తమ ఇంటి దైవమైన మేడాలమ్మ దేవాలయంలో మొక్కుకున్నానని, అనుకున్నట్లే వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేస్తున్నట్టు శివలింగం తెలిపాడు. చెప్పులు లేకుండా రోజుకు దాదాపు 40కిలోమీటర్లు నడుస్తున్నట్టు ఈనెల 9న ఇడుపులపాయకు చేరుకోనున్నట్టు ఆయన తెలిపారు. శివలింగం పాదయాత్ర చేస్తుండగా ఆయనకు సహాయంగా గ్రామానికి చెందిన ఇద్దరు వైఎస్‌ఆర్‌ అభిమానులు మాజీ ఎంపీటీసీ సభ్యులు కిష్టగౌడ్, బి.వెంకటేష్‌ బైక్‌పై వస్తూ అవసరాలను తీర్చుతున్నారు. 

మరిన్ని వార్తలు