హాస్య, కుటుంబ కథా చిత్రాలంటే ఎంతో ఇష్టం

8 Jan, 2018 12:33 IST|Sakshi

 ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు

నెల్లూరు(బృందావనం): ప్రముఖ దర్శకులు దాసరినారాయణరావు శిష్యుడిగా తాను హాస్యానికి ప్రాధాన్యమిస్తూ కుటుంబ పరమైన చిత్రాలను నిర్మించినందుకు ఎంతో సంతృప్తిని పొందుతున్నానని ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. శతవసంతాల చిత్ర దర్శకుడు కేఎస్‌ఆర్‌ దాస్‌ జయంతిని పురస్కరించుకుని  మనం చారిటబుల్‌ట్రస్ట్, కొండాసోదరుల సంయుక్త ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకునేందుకు ఆదివారం ఆయన నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. తన సొంత ఊరు పాలకొల్లు అని ఫొటోగ్రఫీపై ఉన్న ఆసక్తితో సినిమారంగంలో ప్రవేశించానన్నారు. తొలినాళ్లలో దాసరినారాయణరావు దగ్గర ఫొటోగ్రఫీలో మెళకువలు తెలుసుకున్నానన్నారు.

పలువురు దర్శకుల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్, కో డైరెక్టర్‌గా పనిచేసినట్లు తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగంలో 1981 ప్రవేశించిన తాను ఇప్పటి వరకు 75సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించానన్నారు. ఇందులో 24చిత్రాలు చంద్రమోహన్‌తో 32 చిత్రాల రాజేంద్రప్రసాద్‌తో ఉన్నాయన్నారు. తమిళంలో ఒకటి, కన్నడంలో ఏడు చిత్రాలు నిర్మించినట్లు చెప్పారు. ప్రస్తుతం రెండు చిత్రాలను నిర్మించనున్నానని వివరించారు. తనకు హాస్య, కుటుంబ కథా చిత్రాల నిర్మాణ సమయంలో చంద్రమోహన్, కాశీవిశ్వనాథ్, పూసల సహకరించారన్నారు. తనకు హాస్యమన్నా, కుటుంబ అంశమన్నా ఎంతో ఇష్టం కావడంతో తన చిత్రాలన్నీ హాస్యభరిత కుటుంబ చిత్రాలేనన్నారు. నేడు వస్తున్న చిత్రాలు యువతకోసంగా ఉన్నాయని, కుటుంబపరంగా లేవన్నారు. 

మరిన్ని వార్తలు