ఆ ఇల్లే ఓ ఉద్యానవనం

25 Mar, 2015 23:19 IST|Sakshi
ఆ ఇల్లే ఓ ఉద్యానవనం

ఇంటిపంట

‘సాక్షి’ ఇంటిపంట ఇచ్చిన స్ఫూర్తితో... స్వయంగా పండించిన సేంద్రియ పండ్లు, కూరగాయలనే తన కుటుంబ అవసరాలకు వినియోగించాలనే లక్ష్యంతో మేడపైన ఇంటి పంటలు పెంచుతున్నారు వనమామళె నళిని. గృహిణిగా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రస్తుతం 300 కుండీల్లో వివిధ రకాల పూలు, పండ్లు, కాయగూర మొక్కలను టైపై పెంచుతున్నారు. తమ కుటుంబానికి సరిపడా పండ్లు, వారంలో మూడు రోజులకు సరిపోయే కూరగాయలను, ఇంటిపట్టునే పండించుకోవటం విశేషం.
 
హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన వనమామళ నళిని ‘సాక్షి’ దినపత్రికలో ‘ఇంటిపంట’ శీర్షిక స్ఫూర్తితో తమ ఇంటిపైన పండ్లమొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. అరటి, మునగ, పాల సపోటా, ఉసిరి, బొప్పాయి, బత్తాయి, దానిమ్మ, రెడ్ మలేషియన్ గోవా, చెర్రీ, థాయ్‌మాంగో లాంటి పండ్ల మొక్కలు.. బూడిద గుమ్మడి, పుచ్చ, దోస, కాకర, బీర, పొట్ల, సొర, చిక్కుడు తదితర తీగజాతి కూరగాయలు.. క్యాబేజీ, కాలీఫ్లవర్ , ఉల్లి, టమాటా, ఫ్రాన్స్ చిల్లీ, వంగ, బెండ తదితర కాయగూరలు... కరివేపాకు, గోంగూర, మెంతికూర, చుక్కకూర, బిర్యానీ ఆకు, పాలకూర లాంటి ఆకుకూరలను ఆవిడ మేడపైన కుండీల్లో పెంచుతున్నారు. ఇందుకోసం పాత ప్లాస్టిక్ డబ్బాలు, మినరల్ వాటర్ డబ్బాలు, చెక్క పెట్టెలు, పాలిథిన్ కవర్లు, మట్టి కుండీలను వినియోగిస్తున్నారు.
 ‘మట్టి, వరిపొట్టు, వర్మీ కంపోస్టు, కోకోపిట్‌లను సమాన నిష్పత్తిలో కలిపిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నాను.

ఏడాదికోసారి కుండీల్లోని 60 శాతం మట్టి మిశ్ర మాన్ని తొలగించి.. కొత్త మట్టి మిశ్రమాన్ని నింపుతాను. వంటింటి వ్యర్థాలతో తయారుచేసిన కంపోస్టుతోపాటు జీవామృతాన్ని వారానికి ఒకసారి మొక్కలకు అందిస్తాను. ప్రతి రోజూ సాయంత్రం మొక్కలకు నీరు పోస్తున్నా. హానిచేసే కీటకాల నుంచి మొక్కలను రక్షించేందుకు కుంకుడు కాయల రసం, త్రీజీ (అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు సమాన నిష్పత్తిలో కలిపిన) కషాయాన్ని ఉపయోగిస్తున్నాను. ఈ మిశ్రమానికి 1:10 నిష్పత్తిలో నీరు కలిపి పది రోజులకు ఒకసారి పిచికారి చేస్తాను. దీంతోపాటు పల్చటి మజ్జిగను కొంచెం సర్ఫ్‌తో కలిపి పిచికారీ చేయటం వల్ల కీటకాలు, తెగుళ్ల బెడదను పూర్తిగా నివారించవచ్చు. వంటకు ఉపయోగించే ముందు చేప ముక్కలు కడిగిన నీళ్లను 3 రోజులు మురగబెట్టి కుండీల్లో నెలకోసారి పోస్తుంటాను. దీనివల్ల మొక్కల పెరుగుదల బాగుంది. పూత రాలటం ఆగిపోయింది.’ అన్నారామె.

వేసవి ఎండల నుంచి మొక్కలకు రక్షణ కల్పించేందుకు గ్రీన్ షేడ్‌నెట్‌ను నళిని ఏర్పాటు చేసుకున్నారు. కుండీల్లో తేమ ఆరిపోకుండా కొబ్బరిపొట్టు, ఎండుటాకులను ఆచ్ఛాదనగా వేస్తున్నారు. రోజూ ఒక గంట సమయం కేటాయిస్తే చాలన్నారు. ఇదివరకు ప్రతి చిన్న విషయానికీ విసుగు, కోపం వచ్చేవని.. ఇంటిపంటల సాగు ప్రారంభించాక ఉత్సాహంగా ఉందన్నారు. ఖాళీ సమయాన్ని వెచ్చించి కుటుంబ సభ్యులకు ఆరోగ్యకరమైన ఆహారాన్నందిస్తున్నానన్న భావన ఎంతో తృప్తిని కలిగిస్తోంది. థాంక్స్ టూ ‘ఇంటిపంట’ అంటున్నారు నళిని. ్చజీజీ.ఠిఝఠీఃజఝ్చజీ.ఛిౌఝ ద్వారా ఆమెను సంప్రదించవచ్చు.
 
 - దండేల కృష్ణ, ఇంటిపంట డెస్క్
 

మరిన్ని వార్తలు