భరోసానివ్వని హెల్ప్‌లైన్‌లు

29 Aug, 2017 01:55 IST|Sakshi
భరోసానివ్వని హెల్ప్‌లైన్‌లు

సందర్భం
రైతులు తమ తక్షణ సమస్యలు తెలుపుకోవడానికి.. తమకు ఒక తోడు, నీడ, అండ ఉందని ధైర్యంగా ఉండటానికి ఒక హెల్ప్‌లైన్‌ తక్షణ అవసరం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ హెల్ప్‌లైన్‌ల కోసం ఒక్క ప్రత్యేక ఉద్యోగిని కూడా నియమించలేదు.

‘అన్నా మా సమస్యలు వినేవారు ఉంటే కదా చెప్పుకోవటానికి’.. ఆత్మహత్య చేసుకున్న యువరైతు శ్రీధర్‌ భార్య మంజుల అన్నమాటలివి. మా భర్త వ్యవసాయంలో నష్టాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన బాధలు వినేవారు పరిష్కరించే వారు ఉంటే మా పరి స్థితి ఈ విధంగా ఉండేది కాదని మంజుల పదేపదే చెబుతోంది. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వారు రైతు ఆత్మహత్యల అధ్యయనంలో భాగంగా కరీంనగర్‌ జిల్లాలోఅప్పుల బాధతో ఆత్మహత్యకు ప్రయత్నించి హాస్పిట ల్‌లో చివరి క్షణాలలో బతికి బయటపడ్డ రైతు యాదగిరితో మాట్లాడినప్పుడు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు, మా సమస్యలు వినేవారు లేరు, విన్నా తీర్చేవారు లేరు. అలా మా సమస్యలు పరిష్కరించే వారే ఉంటే కళ్ల ఎదురుగా ఉన్న భార్యా పిల్లలను కాదనుకుని ఇంత అఘాయిత్యానికి ఎందుకు పాల్పడతామనేది యాదగిరి అభిప్రాయం. నిజమే సమస్యలలో ఉన్నవారికి ఆ సమస్యలు  చెప్పుకునే అవకాశం అందుకు పరిష్కారం లభిస్తే అంతకంటే ఏమికావాలి!

రైతుల ఆత్మహత్యల నివారణ కోసం తెలంగాణా ప్రభుత్వం 2015 లో హెల్ప్‌లైన్లు ప్రారంభించింది. కానీ ఆ హెల్ప్‌లైన్లు మూగబోయి చాలా కాలమైంది. హెల్ప్‌లైన్‌ అంటేనే ఏదో చిన్నపాటి సహాయం అందుతుందేమో అన్న ఆశ కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారం కోసం హెల్ప్‌లైన్లు ప్రారంభించిన విషయం రైతులకు అటుంచి అధికారులకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. 2015 అక్టోబర్‌లో తెలంగాణా అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రైతుల ఆత్మహత్యలపై ప్రత్యేక చర్చ సందర్భంగా రైతు సమస్యలను వెంటనే పరిష్కరించి వారు ఆత్మహత్యల వైపు వెళ్లకూడదనే సదుద్దేశంతో హైదరాబాద్‌ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాలలో హెల్ప్‌లైన్లు ప్రారంభం అయ్యాయి.

సమస్యలలో ఉన్న రైతులు ఫోన్‌ చేస్తే మండల కమిటీ, జిల్లా కమిటీలు ఆ రైతుల సమస్యలకు పరిష్కారం చూపించి ఆ రైతులను ఆత్మహత్యల నుంచి కాపాడటం హెల్ప్‌లైన్‌ ప్రధాన ఉద్దేశం. కానీ ప్రభుత్వం ఈ హెల్ప్‌లైన్ల కోసం ఒక్క ప్రత్యేక ఉద్యోగిని కూడా నియమించలేదు. కొన్నిచోట్ల జాయింట్‌ కలెక్టర్‌ కార్యదర్శి కూడా హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫోన్లు లిఫ్ట్‌ చేసి ఆ సమయానికి ఏదో ఒక సమాధానం చెప్పి ముగించేవారు. ఇక కరీంనగర్‌ జిల్లా లాంటి చోట్ల కేవలం రెండు నెలల కాలంలో 600 మంది రైతులు తమ సమస్యల పరిష్కారంకోసం హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేశారంటే రైతు సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రైతులు సమస్యలు చెప్పుకుంటూ పోవటమే  కానీ స్థానిక అధికారులు ఆ సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారు. ఇక ఈ తంతు కూడా ముచ్చటగా 3 నెలలే కొనసాగింది.

ప్రతిపక్ష శాసన సభ్యులు, రైతు సంఘాల నాయకులు స్వయంగా హెల్ప్‌లైన్ల పక్కన నిల్చుండి ఫోన్‌ ఎత్తే నాధుడే లేడని ఎన్నో ఫిర్యాదులు, కానీ ప్రభుత్వానికి ఇవేమీ పట్టలేదు. ఫలితం మూడు సంవత్సరాలలో మూడు వేలకు పైగా రైతుల ఆత్మ హత్యలు. పరిశ్రమల కోసం సింగల్‌ విండో పద్ధతిన అన్ని వసతులు కల్పించగలిగే ప్రభుత్వానికి రైతుల నుంచి వచ్చే చిన్న సమస్యలకు పరిష్కారం చూపే సామర్థ్యం లేదా? ఏది ఏమైనా వాస్తవం మాట్లాడుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం చేసిన జిల్లాల విభజన మాత్రం అధికారులను ప్రజలకు దగ్గర చేసింది. మరి ఇంత చిన్న జిల్లాలలోనైనా ఈ హెల్ప్‌లైన్లు పునరుద్ధరించగలిగితే రైతుల సమస్యలకు కొన్ని పరిష్కారాలు లభిస్తాయి కదా? ఎలాగూ ప్రతి సోమవారం ప్రజావాణి (గ్రీవెన్స్‌) జరుగుతూనే ఉంది.

హెల్ప్‌లైన్‌కు వచ్చిన సమస్యలపై ఒక గంట పాటు సమీక్ష జరిపితే రైతులు ఏ రుతువులో ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటున్నారో అర్థమవుతుంది. చిన్న జిల్లాలు కాబట్టి రైతు అవసరాలను బట్టి స్వయంగా అధికారులే  రైతుల దగ్గరికి వెళ్లి సమస్యకు పరిష్కారం చూపవచ్చు, లేదా ఆ దిశగా భరోసా ఇవ్వవచ్చు. రైతు ఆత్మహత్యలు లేని సమాజం సాకారం కావాలంటే ప్రతి రైతు సమస్యకు పరిష్కారం దొరకాలి. తన సమస్యకు  పరి ష్కారం దొరుకుతుందని రైతు ఆశించినప్పుడే జీవితంపై ఆశలు చిగురించి ఆత్మహత్యవైపు ఆలోచించరు.

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వారు, రైతు ఆత్మహత్య కుటుంబాల గురించి చర్చిస్తున్నప్పుడు ఆ జిల్లాలో ఈ మూడేళ్లలో 120 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసిన జిల్లా అధికారులు, కేవలం 18 మండలాలలో ఇన్ని రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని, ఇంత మంది అధికారులం ఉండి కూడా రైతుల ఆత్మహత్యలకు పరిష్కారం చూపలేమా, చూపే ప్రయత్నమైనా చేద్దామనే కార్యదీక్షతో రైతు స్వరాజ్య వేదిక వారి సాంకేతిక సహకారంతో అంబేడ్కర్‌ జయంతి(14–4–2017)నాడు 1800 120 3244 నంబర్‌ను జిల్లాలో సమస్యల్లో ఉన్న రైతులు ఫోన్‌ చేయటానికి టోల్‌ ఫ్రీ నంబర్‌గా ప్రారంభించారు. ఈ హెల్ప్‌ లైన్‌కు వచ్చిన సమస్యలన్నిటిని ప్రతి సోమవారం నాడు ఒక గంటపాటు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరిస్తున్నారు. అక్కడ పరిష్కారం కాని సమస్యలు జిల్లా స్థాయిలో పరిష్కరిస్తున్నారు. చాలా సమస్యలు పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయి. సమస్య పరిష్కారమైన రైతులు సంతోషంగా హెల్ప్‌లైన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
 
2015లో సమస్యల్లో ఉన్న రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన టోల్‌ ఫ్రీ నంబర్లు: ఆదిలాబాద్‌ 1800 429 1939;  వరంగల్‌ 1800 425 2747;  కరీంనగర్‌ 1800 425 4371; నిజామాబాద్‌ 1800 425 6644;  ఖమ్మం 08742 238222; మెదక్‌ 08455 272525; మహబూబ్‌నగర్‌ 9866 098 111; రంగారెడ్డి 88866 13887; నల్గొండ 1800 425 1442. ఇవి పనిచేస్తున్నాయా? అన్నదే ప్రశ్న.


బి. కొండల్‌ రెడ్డి
వ్యాసకర్త రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి
మొబైల్‌ : 99488 97734

 

మరిన్ని వార్తలు