మూడు స్మారక తపాళా బిళ్లలు

25 Apr, 2017 02:44 IST|Sakshi
మూడు స్మారక తపాళా బిళ్లలు

సందర్భం
‘రచనాకాలం నాటి సామాజిక స్థితిగతులను చక్కబెట్టడానికి కవి ఏ సందేశాన్ని ఇవ్వదలిచాడో, దానిని 90 పాళ్లుగా పాత్రల చిత్రీకరణలో చూపించాలి. తన సృజనాత్మతను ధర్మోద్దీపనకు ఉపయోగించాలి’ అన్నారు విశ్వనాథ.

తెలుగువారైన ముగ్గురు మహనీయుల జ్ఞాపకార్థం భారత తపాలాశాఖ రేపు (ఏప్రిల్‌ 26) మూడు తపాలా బిళ్లలను విడుదల చేస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజ్ఞాభారతి అధ్యక్ష హోదాలో 18 నెలల నుంచి చేసిన కృషితో ఇది సాధ్యపడింది. స్వాతంత్య్ర సమరవీరులు, మహర్షులు, కవులు, శాస్త్రవేత్తలు, కళా కారులు వారి విశిష్టతను అశేష ప్రజానీకానికి తెలియ జేసే కార్యక్రమాల్లో భాగంగా తపాలాశాఖ ఫిలాటలీ విభాగాన్ని ఏర్పరచి వారి గుర్తుగా తపాలా బిళ్లలను (స్టాంప్స్‌) ప్రచురిస్తోంది. నా ప్రయత్నంతో బళ్లారి రాఘవ, త్రిపురనేని రామస్వామి చౌదరి, త్రిపురనేని గోపీచంద్‌ల స్మారక తపాలా బిళ్లలు గతంలో విడు దలయ్యాయి. ఇప్పుడు నాటి కవయిత్రులు ఆతుకూరి మొల్ల, తరిగొండ వెంగమాంబ; ఇటీవలి కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణలను స్మరిస్తూ 3 తపాలా బిళ్లలను విశాల సాహితీ ప్రేమికుల, సహృదయుల సభలో ఒక సాహితీ గోష్టితో పాటు విడుదల చేయి స్తున్నాం (వేదిక: అన్నమయ్య కళావేదిక, వెంకటేశ్వర దేవాలయ ప్రాంగణం, బృందావనం, గుంటూరు). ఈ ముగ్గురు మహనీయులూ దైవభక్తులు.  

24వేల శ్లోకాలతో ఉన్న ఆరుకాండాల వాల్మీకి సంస్కృత రామా యణాన్ని 871 పద్య గద్యాలలో మూడు ఆశ్వాసాలుగా (కుమ్మరి) ఆతుకూరి మొల్లమాంబ (15వ శతాబ్దం ఆఖరి పాదం, 16వ శతాబ్దపు ప్రథమార్థ కాలం) లిఖిం చింది. మొల్ల శివకేశవుల భక్తురాలు, బాల వితంతువు, గోప వర గ్రామం (నెల్లూరు, కడప, రెండు జిల్లాల లోను గోపవర నామ గ్రామాలున్నయ్‌). సామాన్య ప్రజలకర్థమయ్యే భాష, సమకాలీన సమాజానికి రామాయణంలోని ఏ సందేశం, ఏ గాథ ద్వారా తెల పాలో, దానికి ప్రాధాన్యతనిచ్చిన కవయిత్రి. ఉదాహర ణకు పడవ నడిపి జీవించే గుహుని మనోభావం ఏమిటో సీతారామలక్ష్మణులకు వెల్లడించే ఘట్టాన్ని అద్భుతంగా ఆవిష్కరించిందామె.

ప్రజానీకంలో మొల్ల రామాయణానికున్న ఆమో ద్యం మరో రామాయణానికి లేదనడం అతిశయోక్తి కాదు. ప్రశ్నలకు ప్రత్యుత్తరాలిచ్చి తెనాలి రామలింగని మొల్ల కించపరచింది. ఉత్ప్రేక్షాలంకారయుత ఆశుకవి త్వాన్ని చెప్పి కృష్ణదేవరాయలను నిండు సభలో ముగ్ధుణ్ణి చేసింది. ఏ కులంలో, ఏ కుగ్రామంలో పుడి తేనేమి? రామభక్తి, దీ„ý  ఉంటే ఎవరయినా రాణిం చవచ్చు. మొల్ల జీవితం నేర్పే పాఠం ఇదే.

తరిగొండ వెంగమాంబ ఒక సాధ్వీ. తరిగొండ గ్రామ దేవాలయంలోని నృహింహస్వామికి చిరు ప్రాయం నుంచి భక్తురాలు. తల్లిదండ్రులు బాల్య వివాహం చేశారు. మీరాబాయిలా భర్తను దూరంగా ఉంచింది. కాపురాన్ని నిషేధించింది. అనతికాలంలోనే వెంగమాంబ భర్త చనిపోయాడు. తిరుమలలోని వేంక టాచలపతే తన భర్త అని చాటింది. ఛాందస బ్రాహ్మణ బంధువర్గం ఆమెను బలవంతాన వితంతువులాగా శిరోముండనం చేయించబోయారు. దాంతో క్షురకునికి ఆమె భయంకర శక్తి స్వరూపిణిగా గోచరించింది. తన పని చేయకనే పారిపోయాడు. గ్రామస్థుల ప్రార్థనతో పుష్పగిరి స్వాములు వెంగమాంబకు బుద్ధి చెప్ప వచ్చారు. ఆయనతో నిర్భయంగా వాదించి, తాను నిత్య సుమంగళినని చెప్పింది. గురువుగారికెందుకు నమస్కరించవంటే, మీరు పెట్టించిన తెరను తీసివేయ మన్నది.

తెర తొలగించగానే వెంగమాంబ ఇష్టదైవమైన నృసింహస్వామిని ధ్యానించి పుష్పగిరి స్వామికి వందనం గావించింది. తక్షణమే సింహగర్జన లాంటి ధ్వని వినిపించింది. పీఠంనుండి మంటలు లేచి పూర్తిగా తగు లబడిపోయిందని కథ. వెంగమాంబ సుమంగళే కాదు, దివ్యమూర్తి అని సమాజం విశ్వసించడం ఆరంభిం చింది. కొంతకాలానికి, వెంగమాంబ తిరుమల చేరింది. మరెన్నో మహిమలు ప్రజలు, భక్తులు కన్నారనీ, విన్నా రనీ ప్రతీతి. సరస్వతీ దేవి కటాక్షంతో వెంగమాంబ భక్తి ప్రధానమైన కవయిత్రిగా పరిణమించింది. వెంకటా చల మహత్మ్యమనే కావ్యాన్ని రచించింది.

కవిసమ్రాట్‌ విశ్వనాథ గురించి ఎంత రాసినా సంపూర్ణ న్యాయం చేయలేం. 10,685 పుటలలో నిక్షిప్తమైన 57 నవలలూ, 27 పద్య కావ్యాలు, 16 నాట కాలూ నాటికలూ, 11 విమర్శనా గ్రంథాలు, 7 ఇత రములు మొత్తం 118. వారి ‘వేయిపడగలు’ 999 పుటల నవల. 29 దినాల్లో గ్రంథస్థమైంది. వారి జీవిత పరమార్థ రచన శ్రీమద్రామాయణ కల్పవృక్షం. 13 వేల పద్య గద్యాలు, 30 సంవత్సరాల కృషి, 170 ఛంద స్సుల్లో పద్యాలు, వారి మధ్యాక్కరలూ నిరుపమా నమైనవి. పద్మభూషణ్, జ్ఞానపీఠ్ పురస్కారాలనం దుకొన్న ప్రథమాంధ్ర కవి. వందలమంది, దేశవి దేశాల్లో రామాయణాలు రాశారు, రాస్తున్నారు. ‘రచ నాకాలం నాటి సామాజిక స్థితిగతులను చక్కబెట్టడానికి కవి ఏ సందేశాన్ని ఇవ్వదలిచాడో, అది తన రచనలో 90 పాళ్లుగా తన కృతిలోని పాత్రల చిత్రీకరణలో చూపిం చాలి. తన పాండిత్యాన్ని, సృజనాత్మతను ధర్మోద్దీపనకు ఉపయోగించాలి’ అన్నారు విశ్వనాథ.

ఈ మువ్వురి స్మృత్యర్థం తపాలా బిళ్లలను ముద్రింపచేసేందుకు నా కృషి ఫలించడం నా భాగ్య మనుకుంటున్నాను. తపాలా శాఖ భరతమాత సేవలో తరిస్తూ, మరింతమంది మహనీయులను స్మరిస్తూ దేశ వాసుల హృదయాలలో దేశభక్తినీ, ఆధ్యాత్మికతనూ, ధర్మనిరతినీ పెంపొందింపజేస్తూ ఉండాలని ఆశిస్తున్నా.
 

డాక్టర్‌ త్రిపురనేని హనుమాన్‌ చౌదరి
వ్యాసకర్త ప్రజ్ఞా భారతి అధ్యక్షులు
ఫోన్‌ : 040–27843121

మరిన్ని వార్తలు