సీమ నీటి సమస్యకు పరిష్కారం!

8 Jun, 2016 01:21 IST|Sakshi

సందర్భం
 

కృష్ణానదీ జలాల పంపకం గురించి కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1985లో తన విధానాన్ని తెలుపుతూ ఇలా అన్నది : ‘‘నదీ ప్రవాహపు నీటిలో ఎంత మోతాదు నీటిని తొలుత ఎవరు వినియో గంలోకి తెచ్చుకోగలిగారో ఆ మొత్తం నీటిపై వారికి హక్కు ఉంటుంది; నదీ పరివాహపు ప్రాంతమేదైనా తమకు తగినంత నీరు లేదని భావిస్తే నీటి పంపకాలు పూర్త య్యాక మిగిలిన ప్రవాహ జలాల్లో వాటా కోరవచ్చు’’. ఇలా అమెరికాలో జరిగిందని కూడా తెలిపింది. ఇంగ్లండ్ వంటి దేశాల నుండి అమెరికా వెళ్లిన తొలి జనరేషన్ వారు ఒక్కొక్కరు ఎంత భూమిని అక్కడ తమ అధీనం లోకి తెచ్చుకోగలిగారో ఆ భూమి మొత్తం వారి సొంతంగా భావింపబడేది. అంటే, దానిపై వారికి చట్ట బద్ధ హక్కు ఏర్పడింది. తరువాత కాలాల్లో అమెరికా వెళ్లిన వారికి అలాంటి అవకాశం లభించలేదు. అంటే, తొలి తరం వారు దయతలిస్తేనో, దానంగా ఇస్తేనో, లేదా కొనుక్కుంటేనో వారికి భూమి లభించింది. ఇలాంటి వలసవాద విధానాన్ని కృష్ణా జలాల పంపకం విషయంలో కృష్ణా ట్రిబ్యునల్ అనుసరించడం విచార కరం. అందుకే, ఆరు దక్షిణాంధ్ర జిల్లాలు నీటి సమ స్యతో అల్లాడిపోతున్నాయి; శిద్ధేశ్వరం అలుగు ఉద్యమం వంటి నీటి ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి.


 కృష్ణా ట్రిబ్యునల్ నీటి పంపకం వివరాల్లోకి వెళితే ఆశ్చర్యకర అంశాలు తెలుస్తాయి. హంపీ-తుంగభద్ర నుంచి పల్నాడు వరకు ఉండిన ఒకప్పటి ‘‘సీడెడ్’’ జిల్లాలు 26,592 చదరపు మైళ్ల వైశాల్యాన్ని కలిగి ఉండగా, ఒంగోలు దగ్గరి చిన గంజాం సమీప మోటుపల్లి నుంచి ఒరిస్సాలోని గంజాం జిల్లాలోని మల్నాడ్ వరకు ఉండిన ‘‘సర్కారు’’ జిల్లాలు 14,700 చదరపు మైళ్ల వైశాల్యాన్ని మాత్రమే కలిగి ఉండేవి. అంటే, సీడెడ్‌ల కన్నా సర్కార్ల వైశాల్యం చిన్నది. ఇప్పుడు కూడా రాయలసీమ జిల్లాలు నాలుగూ కలిపి 67,29,800 హెక్టార్ల వైశాల్యాన్ని కలిగి ఉండగా, సర్కారు జిల్లాలు ఏడూ కలిపి 62,20,400 హెక్టార్ల వైశాల్యాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి. అంటే, రాయల సీమకన్నా సర్కార్ల వైశాల్యం చిన్నది.


మరోవైపు,  కృష్ణా డెల్టాతో కూడిన కృష్ణా, గుంటూరు జిల్లాలు రెండూ కలిపి 20,11,800 హెక్టార్ల వైశాల్యాన్ని కలిగి ఉండగా, గోదావరి డెల్టాతో కూడిన పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు రెండూ కలిపి 18,54,900 హెక్టార్ల వైశాల్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే, 20,11,800 హెక్టార్ల వైశాల్యం గల కృష్ణా, గుంటూరు డెల్టాకు 462.6 టీఎంసీల నీటిని ఇస్తుండగా, 67,29,800 హెక్టార్ల వైశాల్యంగల రాయలసీమకు మాత్రం కేవలం 133.70 టీఎంసీలు మాత్రమే ఇస్తు న్నారు; అవి కూడా పలు కారణాల వలన 90 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి.


 ఇక, కృష్ణా ట్రిబ్యునల్ కృష్ణా డెల్టాకు నీరు కేటా యించిన రీతిని పరిశీలిస్తే, కృష్ణా డెల్టాలో 1954కు ముందు సాగులోకి తెచ్చిన 10.5 లక్షల ఎకరాలకు మొదటి పంటకు 161.9 టీఎంసీల నీటిని రక్షణ క్రింద ఇవ్వాలని చెప్పింది, 1954 తరువాత సాగులోకి తెచ్చిన 37,498 ఎకరాలకు రెండవ పంటకు 15.3 టీఎంసీల నీటిని రక్షణ క్రింద ఇవ్వాలని చెప్పింది, రిజర్వాయర్ నష్టాల క్రింద 4 టీఎంసీలు, రక్షణ క్రింద 4 టీఎంసీలు ఇవ్వాలని చెప్పింది. అంటే, మొత్తంగా 181.2 టీఎం సీలు రక్షణ క్రింద ఇస్తున్నట్లు తెలిపింది. అయితే, చివర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలలో 20,11,800 హెక్టార్ల వైశాల్యంగల రెండు జిల్లాల కృష్ణా డెల్టాకు 388.4 టీఎంసీల నీటిని కేటాయించింది. 67,29,800 హెక్టార్ల వైశాల్యంగల నాలుగు రాయల సీమ జిల్లాలకు మాత్రం కేవలం 133.70 టీఎంసీల నీటిని కేటాయించింది. అంతేగాక, సాగర్ నుండి మొదటి పంటకు 23.2 టీఎంసీలు కూడా కృష్ణా డెల్టాకు కేటాయించడం జరిగింది. పోలవరం నుండి 80 టీఎంసీలు కూడా కేటాయించి, ఇందులో 51 టీఎంసీలు కృష్ణా డెల్టాకు, మిగిలినవి కృష్ణానది ఎగువ భాగంలో వినియోగించుకోవాలని తెలిపింది. అంటే, మొత్తం 462.6 టీఎంసీల నీరు కృష్ణా, గుంటూరు జిల్లాలకు మాత్రమే కేటాయించారు.


 కాబట్టి, పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి, పోలవరం నుంచి గోదావరి నది ఉత్తరాన సాగునీటి కాలువలు నిర్మిస్తే పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలేగాక మరికొన్ని ఉత్తరాంధ్ర సర్కారు జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చే పరిస్థితి ఏర్పడుతుంది. పోలవరం నుంచి గోదావరి దక్షిణాన కాలువల నిర్మాణం ద్వారా, కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీతో అనుసంధానం చేయడం ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చవచ్చు (గోదావరి నదిలో, కృష్ణానదిలో కన్నా రెండింతల నీటి ప్రవాహం ఉంది). మరోవైపు, కృష్ణా జలాల నుంచి కృష్ణా డెల్టాకు కేటాయించిన 388.4 టీఎంసీలు, దక్షిణాంధ్రలోని రాయలసీమ నాలుగు జిల్లాలకు కేటాయించిన 122. 70+11 టీఎంసీలు, గోదావరి- పోలవరాల నుంచీకృష్ణా డెల్టాకు కేటాయింపబడిన 80 టీఎంసీల నికర జలాల్లో 51 టీఎంసీలు కృష్ణానది ఎగువ భాగంలో వాడుకో వచ్చని చెప్పిన నీటిని, మొత్తంగా 573.10 టీఎంసీల నికర జలాల్ని ఆరు దక్షిణాంధ్ర జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంత పురంల సాగునీటి అవసరాలు తీర్చడానికి కేటాయించడం ద్వారా దక్షిణాంధ్ర జిల్లాల నీటి అవసరాల్ని పూర్తిగా తీర్చవచ్చు, అంటే, శ్రీశైలం, శిద్ధేశ్వరం వంటి పలు ప్రాజెక్టుల పూర్తిస్థాయి వినియోగంతో ఆరు దక్షిణాంధ్ర జిల్లాల సాగునీటి అవసరాల్ని, గోదావరి, వంశధార, మరో స్వర్ణముఖిలతో ఏడు సర్కారు జిల్లాల నీటి అవసరాల్ని తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం త్వరితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే, ఆరు దక్షిణాంధ్ర జిల్లాలకు, ఏడు సర్కారు జిల్లాలకు మధ్య ఇప్పటికే పెరుగుతోన్న నీటి విభేదాలు మరింత పెరిగి మరోసారి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయే ప్రమాదం ఉంది.
 
 - డాక్టర్ దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి
  వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్
 చరిత్ర శాఖ, ఎస్వీ యూనివర్శిటీ
 మొబైల్: 9849584324

 

మరిన్ని వార్తలు