సీమ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి ‘ఎంవీఆర్‌’ పేరు

10 Nov, 2023 03:34 IST|Sakshi

దివంగత కార్మిక నేత డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి సేవలకు గుర్తింపు 

ఆర్టీపీపీ ఇకపై.. డాక్టర్‌ ఎంవీఆర్‌ రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ 

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

సాక్షి, అమరావతి/ఎర్రగుంట్ల( వైఎస్సార్‌ జిల్లా): రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌(ఆర్టీపీపీ) పేరును డాక్టర్‌ ఎంవీఆర్‌ రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంటుగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. కార్మిక నేతగా, ఎమ్మెల్యేగా, రచయితగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన దివంగత నేత డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి(ఎంవీఆర్‌) సేవలకు గుర్తింపుగా, రాయలసీమ ప్రాంత నేతల విజ్ఞప్తి మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నిర్ణ­యం తీసుకున్నారు.

వారి ఆమోదంతో వైఎస్సార్‌ జిల్లా కలమళ్లలోని 1650 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గల ఆర్టీ­పీ­పీ  పేరును డాక్టర్‌ ఎంవీఆర్‌ రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంటు­గా మార్చుతూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పేరు మార్పు తక్షణమే అమల్లోకొస్తుందని ఇంధన శాఖ ప్రత్యే­క ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

మూడు థర్మల్‌ ప్లాంట్లకు ముగ్గురు ప్రముఖుల పేర్లు  
రాష్ట్రంలో మూడు థర్మల్‌ పవర్‌ ప్లాంట్లుండగా, వేర్వేరు రంగాలకు చెందిన వారి పేర్లు వాటికి సార్థక నామధేయాలుగా మారా­యి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్లాంట్‌కు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రమ­ని పేరు పెట్టారు. ఇబ్రహీంపట్నంలోని పవర్‌ ప్లాంటుకు విద్యు­త్‌ రంగ పితామహుడుగా పేరు పొందిన డాక్టర్‌ నార్ల తాతా­రావు పేరు పెట్టారు. తాజాగా ఆర్టీపీపీని కార్మిక నేత ఎంవీఆర్‌ రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంటుగా ప్రభుత్వం మార్చింది.

ఎంవీఆర్‌ కృషితో సీమలో థర్మల్‌ ప్లాంట్‌  
వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలో విద్యుత్‌ సమస్య పరిష్కారం కోసం థర్మల్‌ విద్యుత్‌ కర్మాగారం ఏర్పాటు చేయాలని మొట్టమొదట డిమాండ్‌ చేసిన నేత డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి. 1985లో ‘రాయలసీమ కన్నీటి గాథ’ అనే పుస్తకం ద్వారా ఆయన రాయలసీమ సమస్యలను, గణాంకాలు, సహేతుకమైన ఆధారాలతో రాష్ట్ర ప్రజల దృష్టికి తెచ్చారు.

కరువుతో అల్లాడుతున్న  సీమకు అన్ని విధాలా అన్యాయం జరుగుతోందని గళమెత్తారు. ఎంవీఆర్‌ చేసిన డిమాండ్‌.. ఆర్టీపీపీ స్థాపనకు బాట వేసిందని, ఆ నేతకు నివాళిగా ఆర్టీపీపీ పేరును డాక్టర్‌ ఎంవీఆర్‌ రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుగా మార్చాలని రాయలసీమ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ విమోచన సమితి పేరుతో రమణారెడ్డి, రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి పేరుతో వైఎస్సార్, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి, టీటీడీ చైర్మన్‌ కరుణాకరెడ్డి తదితర నేతలంతా అప్పట్లో ఉద్యమం చేపట్టారని సాహితీవేత్త భూమన్‌ తెలిపారు.

ఆర్టీపీపీ పేరును డాక్టర్‌ ఎంవీఆర్‌ రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంటుగా మార్చడం దివంగత నేతకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామని భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యలు ప్రశంసించారు. ఆర్టీపీపీకి డాక్టర్‌ ఎంవీఆర్‌ పేరు పెట్టినందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు నేతలు ముఖ్యమంత్రికి, ఇంధన శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీపీపీకి ఎంవీఆర్‌ పేరు చేర్చడాన్ని రాయలసీమ వాసులు స్వాగతిస్తున్నారు.

మరిన్ని వార్తలు