ఆదివాసీ బిడ్డ అశోక్‌ను ఎందుకు మార్చామంటే..? : రేవంత్‌రెడ్డి

16 Nov, 2023 08:28 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

బోథ్‌ సభలో వివరించిన రేవంత్‌..

ఈ గడ్డపై ఒక్కసారి కాంగ్రెస్‌ను గెలిపించాలంటూ విజ్ఞప్తి!

‘ఉమ్మడి ఆదిలాబాద్‌’ను దత్తత తీసుకుంటామని పీసీసీ చీఫ్‌ వెల్లడి..

సాక్షి,ఆదిలాబాద్‌: ‘ఆదివాసీ, లంబాడాలు కాంగ్రెస్‌ పార్టీకి రెండు కళ్ల లాంటివారు.. 12 అసెంబ్లీ స్థానాల్లో ఆరు లంబాడాలకు, ఆరు ఆదివాసీలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఇల్లందులో మొదట కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌కు ఇవ్వాలని అనుకున్నాం.. అయితే అక్కడ కోరం కనకయ్యకు ఇచ్చాం.. బలరాం నాయక్‌ పెద్ద మనస్సుతో ఆదివాసీ బిడ్డ కోసం ఆ సీటును వదులుకున్నాడు.. దీంతోనే బోథ్‌లో ముందుగా ఆదివాసీ వన్నెల అశోక్‌కు టికెట్‌ ప్రకటించినప్పటికీ ఆ తర్వాత మార్చి ఆడె గజేందర్‌కు ఇచ్చాం. పార్టీ ఆదేశాల మేరకు ఇది జరిగిందంటూ’ బోథ్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

ఆలస్యంగా రాక..
బోథ్‌లో కాంగ్రెస్‌ ప్రజా విజయభేరి సభ బుధవారం పార్టీ అభ్యర్థి గజేందర్‌ ఆధ్వర్యంలో సాగింది. ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభమవుతుందని ముందుగా ప్రకటించినా రేవంత్‌ మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకున్నారు. ఎమ్మెల్సీ, పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ప్రకాశ్‌ రాథోడ్‌, తలమడుగు, బజార్‌హత్నూర్‌ జెడ్పీటీసీలు గోక గణేశ్‌రెడ్డి, మల్లెపూల నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ బాబన్న, సీనియర్‌ నాయకులు భరత్‌ వాగ్మారే, కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశ్‌, సీనియర్‌ నాయకులు కోటేశ్వర్‌, చంటి, పది మండలాల అధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.

ఒక్కసారి ఈ గడ్డపై గెలిపించండి..
కాంగ్రెస్‌ పార్టీని ఒక్కసారి ఈ గడ్డపై గెలిపించాలని రేవంత్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్‌ 31లోపే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.

బోథ్‌ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిగ్రీ కళా శాల మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ వచ్చి పదేళ్లయినా బోథ్‌కు నీళ్లు ఎందుకు రాలేదంటూ.. దద్దమ్మ సీఎం కేసీఆరే ఇందుకు కారణమని ధ్వజమెత్తారు. ఇక్కడ కుప్టి ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని అన్నారు. నిధులు మంజూరు చేసి ప్రారంభోత్సవానికి వచ్చే బాధ్యత నాదేనని వివరించారు.

మరిన్ని వార్తలు