కోడ్‌ ఉల్లంఘనులపై కఠిన చర్యలు.. : రాహుల్‌రాజ్‌

23 Nov, 2023 07:48 IST|Sakshi

ప్రలోభాలు దృష్టికి వస్తే సీ–విజిల్‌ ద్వారా ఫిర్యాదు చేయండి!

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు..

ఓటర్ల సౌకర్యార్థం ప్రత్యేక సదుపాయాలు!

‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌!

సాక్షి, ఆదిలాబాద్‌: 'జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈవీఎంలు, ఎన్నికల అధికారుల ర్యాండమైజేషన్‌ను పూర్తి చేసి నియోజకవర్గాల వారీగా కేటాయించాం. పీవోలు, ఏపీవోలకు శిక్షణ కొనసాగుతోంది. గురువారం నుంచి బ్యాలెట్‌ యూనిట్ల కమిషనింగ్‌ ప్రక్రియ చేపడుతాం. సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా సాగేలా వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతీ ఓటరు మొబైల్‌లో సీ–విజిల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రలోభాలకు గురిచేసినట్లు తెలిస్తే ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అలాగే ఓటర్లంతా స్వేచ్ఛగా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. పోలింగ్‌ శాతం పెంపు కోసం ిస్వీప్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈమేరకు బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు.'

సాక్షి: జిల్లాలో పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య ఎంత..? ఎన్నికల నిర్వహణకు ఎంతమంది సిబ్బందిని నియమించారు?
కలెక్టర్‌: జిల్లాలో 4,48,374 మంది ఓటర్లున్నారు. వీరి కోసం 592 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 290, బోథ్‌ నియోజకవర్గంలో 302 ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం 4వేల మంది సిబ్బందిని నియమించాం.

సాక్షి: ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేపడుతున్నారు..?
కలెక్టర్‌: ఈవీఎంలు, పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ను పూర్తి చేసి నియోజకవర్గాల వారీగా కేటా యించాం. పీవో ఏపీవోలకు రెండు రోజులుగా శిక్షణ ఇస్తున్నాం. ఓపీవోలకు గురువారం నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. రూట్‌, సెక్టోరల్‌ అధికారులను నియమించాం. పోలింగ్‌కు అవసరమైన సా మగ్రి అంతా ఇప్పటికే జిల్లాకు చేరుకుంది. దాని డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాన్ని స్థానిక టీటీడీసీలో ఏర్పాటు చేస్తున్నాం. స్ట్రాంగ్‌ రూంలతో పాటు ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను కూడా అక్కడే చేపడుతాం.

సాక్షి: జిల్లాలో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉ న్నారు.బ్యాలెట్‌యూనిట్ల వినియోగంఎలాఉంది..?
కలెక్టర్‌: 15 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉంటే 2 బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 25 మంది అభ్యర్థులు ఉన్నందున రెండు ఏర్పాటు చేస్తున్నాం. బోథ్‌ నియోజకవర్గంలో 10 మంది అభ్యర్థులున్నారు. వారి గుర్తులు, వీవీ ప్యాట్స్‌ కమిషనింగ్‌ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల కమిషన్‌ నుంచి వచ్చిన ఆరుగురు ఇంజనీర్లు నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఈ ప్రక్రియను చేపడుతారు.

సాక్షి: పోస్టల్‌ బ్యాలెట్‌కు ఎంత మంది సిబ్బందిని వినియోగించనున్నారు. వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు.?
కలెక్టర్‌: జిల్లాలో 4వేల మంది సిబ్బందిని పోస్టల్‌ బ్యాలెట్‌కు వినియోగించనున్నాం. ట్రైనింగ్‌ సెంట ర్‌లో ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. అక్క డ ఎంత మంది ఓటర్లు ఓటు వేశారనే వివరాలు రావాల్సి ఉన్నాయి. ఎవరైన ఆలస్యంగా వచ్చి ఉంటే ఓటేసేందుకు వీలుగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. పోలీసు ఉద్యోగుల కోసం ఇక్కడే ప్రత్యేకంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం.

సాక్షి: జిల్లా వ్యాప్తంగా ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. వాటిలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..?
కలెక్టర్‌: జిల్లాలో 301 సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించనున్నాం. మరో 78 పోలింగ్‌ కేంద్రాల్లో బయట సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్‌ ప్రశాంతంగా సాగేందుకు వీలుగా ప్రత్యేక బలగాలను మోహరించనున్నాం.

సాక్షి: ఓటింగ్‌ శాతం పెంచడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు..?
కలెక్టర్‌: ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా స్విప్‌ ద్వారా బైక్‌, ఆటోలతో ప్రచారంతో పాటు కలెక్టరేట్‌లో సెల్ఫీ పాయింట్‌ ద్వారా అవగాహన కల్పించాం. వృద్ధులు, యువత, దివ్యాంగులతో ర్యాలీలు చేపట్టాం. యువత కోసం రంగోలి పోటీలు ఏర్పాటు చేశాం. గతంలో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైన కేంద్రాల్లో ఈ సారి ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు గాను పాఠశాలల విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు ఓటు సంకల్ప పత్రాలను పంపించాం.

సాక్షి: ప్రలోభాల కట్టడికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..?
కలెక్టర్‌: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మద్యం, డబ్బు ప్రవాహం జరగకుండా కట్టడి చేస్తున్నాం. జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతున్నాం. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిస్టికల్‌ సర్వైలెన్స్‌ టీమ్‌, వీడియోగ్రఫీ బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంచాం. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, కోడ్‌ను ఉల్లంఘించినా ప్రజలు నిర్భయంగా సీ–విజిల్‌ యాప్‌ ద్వారా ఫి ర్యాదు చేయాలి. ఫిర్యాదు అందిన వంద నిమిషా ల్లోపు వారిపై చర్యలు తీసుకుంటాం.

సాక్షి: ఇప్పటివరకు మోడల్‌ కోడ్‌ ఉల్లంఘన కేసులేమైనా నమోదయ్యాయా. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
కలెక్టర్‌: జిల్లాలో 17 మోడల్‌ కోడ్‌ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో 16 కేసుల్లో బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. ఒక కేసు తప్పని తేలడంతో దాన్ని తిరస్కరించాం.

సాక్షి: పోల్‌ చీటీల పంపిణీ ఎంత వరకు జరిగింది. ఎప్పటివరకు పూర్తవుతుంది..?
కలెక్టర్‌: ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రతి ఓటరుకు పోల్‌ చీటీలను అందించేలా గత శుక్రవారం నుంచి పంపిణీని షురూ చేశాం. 95 శాతం వరకు పూర్తయింది. ప్రస్తుతం షిఫ్టెడ్‌, డెలిటెడ్‌ వంటి వివరాలను బీఎల్‌వోల నుంచి సేకరిస్తున్నాం.

సాక్షి: పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు..?
కలెక్టర్‌: ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి పోలింగ్‌ కేంద్రంలో షామియానాలు, కుర్చీ లు, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నాం. దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్‌చైర్లతో పాటు ఒక సహాయకుడిని అందుబాటులో ఉంచుతాం.

మరిన్ని వార్తలు