మూడోసారీ మా ప్రభుత్వమే

23 Nov, 2023 04:00 IST|Sakshi

70 నుంచి 82 సీట్లు ఖాయం.. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ 

కాంగ్రెస్‌ హడావుడి పాలపొంగు వంటిదే.. 

రేవంత్‌రెడ్డికి రెండు చోట్లా ఓటమి తప్పదు 

కాంగ్రెస్‌ సీనియర్లు చాలామంది ఓడిపోబోతున్నారు 

ప్రాజెక్టులపై దొంగ రిపోర్టులతో బదనాం చేసేందుకు బీజేపీ ప్రయత్నం

క్షేత్రస్థాయిలో పరిస్థితి బీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉంది 

తెలంగాణకు ఏకైక గొంతు కేసీఆర్‌ మాత్రమే.. 

కాపాడుకోవాలా, వద్దా అన్నది ప్రజలు ఆలోచించాలని వ్యాఖ్య 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మూడు వేర్వేరు సంస్థల ద్వారా లోతుగా సర్వే చేశామని.. బీఆర్‌ఎస్‌కు 72 నుంచి 82 సీట్లు వస్తాయని స్పష్టంగా తేలిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు చెప్పారు. రాష్ట్రంలో మూడోసారి కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కేటీఆర్‌ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మాపై వ్యతిరేకత ఉన్నట్టు సోషల్‌ మీడియాలో హడావుడి జరగడం, అక్కడక్కడా మౌఖిక ప్రచారమే (మౌత్‌ టాక్‌) తప్ప క్షేత్రస్థాయిలో ఓటరుకు ఎలాంటి గందరగోళం లేదు.

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మొదట్లో మేం కూడా కొంత గందరగోళపడినా క్షేత్రస్థాయి నుంచి మాకు మంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో మూడో స్థానంలో, కొడంగల్‌లో రెండో స్థానంలో నిలిచే పరిస్థితి ఉన్నపుడు కాంగ్రెస్‌ గెలిచే అవకాశం ఎక్కడుంది? కాంగ్రెస్‌ దిగ్గజాలైన కోమటిరెడ్డి సోదరులు, జానారెడ్డి కుమారుడు, జగ్గారెడ్డి వంటివారు కూడా ఓడిపోతున్నారు. బీజేపీ రెండు, మూడు సీట్లకే పరిమితం అవుతుంది. మేం ఖమ్మంలో ఆరు స్థానాల్లో, నల్లగొండలో 7 నుంచి 9 సీట్లలో కచ్చితంగా గెలుస్తాం. మిగతా నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉన్నా మా పార్టీ పరిస్థితి నిక్షేపంగా ఉంది. 

వాపు చూసి బలుపు అనుకుంటున్నారు 
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్‌ ఒక్కసారిగా పడిపోయి ఆరంభంలో కొంత కాంగ్రెస్‌ వైపు మళ్లడంతో ఆ వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. అది పాలపొంగు వంటి హడావుడి మాత్రమే. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌ కేడర్‌ కసిగా పనిచేస్తున్నారు. హుజూరాబాద్, గోషామహల్, కరీంనగర్, కోరుట్లలోనూ గెలుస్తున్నాం. మాకు 15 నుంచి 18 చోట్ల బీజేపీ నుంచి, మిగతా చోట్ల కాంగ్రెస్‌ నుంచి పోటీ ఉండగా.. మేం మాత్రం అన్నిచోట్లా పోటీలో ఉన్నాం. ముదిరాజ్‌లకు టికెట్ల సర్దుబాటులో అవకాశం ఇవ్వలేకపోయాం. కాసాని జ్ఞానేశ్వర్, ఎర్ర శేఖర్‌ తదితరుల చేరికతో ఈ విషయాన్ని ఆ సామాజికవర్గం అర్థం చేసుకుంది. 

బీజేపీతో ఎన్నడూ అంటకాగలేదు 
కేసీఆర్‌ 50ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ బీజేపీతో అంటకాగలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లలో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించింది. ప్రస్తుత ఎన్నికల్లో ముస్లిం పట్ల బద్ధ వ్యతిరేకత కలిగిన బండి సంజయ్, అర్వింద్, రాజాసింగ్‌లపై కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బీజేపీ ఏజెంట్‌గా పనిచేస్తూ మోదీని ఒక్కసారి కూడా విమర్శించలేదు.

విపక్ష నేతల ఇళ్లపై జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులను మాకు అంటగట్టడం సరికాదు. రైతుబంధు దుబారా, ధరణి రద్దు అంటూ కాంగ్రెస్‌.. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల మీద దొంగ రిపోర్టులతో బదనాం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణను అప్పుల పాలు చేశామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోపణలు చేయడం విడ్డూరం. మోదీ ప్రతీ కుటుంబంపై రూ.5లక్షల అప్పు మోపారు. ఆయన ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని.  

కేసీఆర్‌ అంటే భయంతోనే.. 
తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్‌. ఆయన జాతీయ పార్టీలకు కొరుకుడు పడని కొయ్య. మూడోసారి అధికారంలోకి వస్తే ఏకు మేకు అవుతాడనేది కాంగ్రెస్, బీజేపీల భయం. కర్నాటక, గుజరాత్‌ల నుంచి రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలకు వస్తున్న డబ్బుకు అడ్డూ అదుపు లేదు. ఆ రెండు జాతీయ పార్టీలకు 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కానీ మాకు మాత్రం తెలంగాణే కేంద్రం. వాళ్లు తెలంగాణను గెలవాలనుకుంటున్నారు. మేం తెలంగాణను గెలిపించాలని అనుకుంటున్నాం. తెలంగాణ ఏకైక గొంతు కేసీఆర్‌ను కాపాడుకోవాలా వద్దా అని ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భం ఇది. 

కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు ఇస్తాం 
జనవరి నుంచి కొత్త రేషన్‌ కార్డులు, కొత్త ఆసరా పింఛన్లు ఇవ్వడం ప్రారంభిస్తాం. బీడీ కార్మీకులకు 2023 వరకు కటాఫ్‌ పెంచి కొత్తగా లక్షన్నర మందికి పింఛన్లు ఇస్తాం. భర్తను కోల్పోయిన భార్యల పేరిట పింఛన్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటాం. గల్ఫ్‌ కార్మీకులకు ఉచిత బీమా కల్పిస్తాం. ఆటో డ్రైవర్లకు రూ.వంద కోట్ల మేర వాహన ఫిట్‌నెస్‌ చార్జీలు రద్దు చేస్తాం. జాబ్‌ క్యాలెండర్, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, ఉద్యోగ నియామకాలు సక్రమంగా నిర్వహించడం వంటి అంశాలపై ఇప్పటికే యువతకు స్పష్టత ఇవ్వడంతోపాటు దీనిని మరింత బలంగా ప్రచారం చేస్తాం. 

ఈసీ అనుమతివ్వగానే రైతుబంధు సొమ్ము 
రూ.19,445 కోట్ల పంట రుణాల మాఫీకిగాను ఇప్పటికే రూ.14వేల కోట్ల పైచిలుకు క్లియర్‌ చేశాం. మిగతా రూ.5వేల కోట్ల మాఫీ ప్రక్రియ ప్రతిపక్షాల ఫిర్యాదు వల్ల ఆగింది. రుణమాఫీ చెల్లింపులకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరాం. అనుమతి వస్తే వెంటనే రుణమాఫీ చేస్తాం. రైతుబంధు 12వ దఫా సొమ్ము విడుదల కోసం కూడా ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరాం. పీఎం కిసాన్‌ డబ్బులు వేసే వెసులుబాటు కల్పించి రైతుబంధు విషయంలో ఇబ్బంది పెట్టడం సరికాదు. మా మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గడప గడపకు వెళ్తాం..’’అని కేటీఆర్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు