విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన కారు

16 Dec, 2023 12:42 IST|Sakshi

మారేడుమిల్లి : మండలంలోని సున్నంపాడు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు అదుపుతప్పి విద్యుత్‌స్తంభాన్ని ఢీకొట్టింది. భద్రాచలం నుంచి నలుగురితో రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారు సున్నంపాడు గ్రామ సమీప మలుపు వద్దకు వచ్చేసరికి అదుపుతప్పింది. రోడ్డుపక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. కరెంట్‌ స్తంభం విరిగి కారుపై పడింది. విద్యుత్‌ తీగలు కారుకు తగలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ఉన్న నలుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు.

తొమ్మిది మందికి స్వల్ప గాయాలు
డుంబ్రిగుడ:
మండలంలోని కురిడి పంచాయతీ నారింజవలస గ్రామ సమీపంలోని అరకు–పాడేరు ప్రధాన రోడ్డు మార్గంలో ఎదురుగా వస్తున్న ఆటోను పర్యాటకుల కారు ఢీకొట్టింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో రెండు వాహనాలు బోల్తా పడ్డాయి. చాపరాయి జలపాతానికి కారులో వచ్చిన పర్యాటకులు తిరిగి అరకు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో ఉన్న ఆరుగురు గిరిజనులకు, కారులోఉన్న ముగ్గురు పర్యాటకులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు