చంద్రబాబు ఝలక్‌తో తలో దారి!

29 Mar, 2024 10:13 IST|Sakshi

అరకు పార్లమెంట్‌ టికెట్‌ బీజేపీకి కేటాయింపుపై అసంతృప్తి

ఉనికి లేని పార్టీకి ఎలా కేటాయిస్తారని విమర్శ

గ్రూపులుగా విడిపోయిన పార్టీ శ్రేణులు

ప్రచారానికి దూరం

అసెంబ్లీ అభ్యర్థి విషయంలోనూ ఇదే పరిస్థితి

అల్లూరి సీతారామరాజు: అరకు పార్లమెంట్‌ పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. క్షుద్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన చంద్రబాబు నిర్ణయాలను పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అరకు పార్లమెంట్‌ టికెట్‌ బీజేపీకి కేటాయింపు.. టీడీపీలో సీనియర్లను పక్కనబెట్టి పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి అసెంబ్లీ టికెట్‌ ఇవ్వడం వంటి పరిణామాలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రంపచోడవరం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల పరిస్థితి తలోదారి అన్నట్టుగా ఉంది. అరకు పార్లమెంట్‌ టికెట్‌ను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం వారికి మింగుడు పడటం లేదు. ఏమాత్రం ఉనికి లేని బీజేపీకి టికెట్‌ ఎలా కేటాయిస్తారని వారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కూటమి (బీజేపీ) అభ్యర్థి మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు మద్దతుగా టీడీపీ శ్రేణులు ప్రచారం చేసే పరిస్థితులు కనిపించడం లేదు.

గతంలో వైఎస్సార్‌సీపీ తరఫున అరకు ఎంపీగా గెలుపొందిన ఆమె పార్టీకి దూరంగా ఉంటూ స్వప్రయోజనాలకోసం ఐదేళ్ల పదవిని వాడుకున్నారని, నియోజకవర్గంలో ఎన్నడూ కనిపించని ఆమె తరఫున ఎలా ప్రచారం చేయాలని వారు మదనపడుతున్నారు. ఆమైపె ఆర్థికపరమైన అంశాలతోపాటు ఎస్టీ కాదని కేసులు ఉన్నాయి. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె కోసం ప్రచారం చేయలేమని టీడీపీకి చెందిన ఓ సీనియర్‌ నాయకుడు బహిరంగంగానే చెబుతున్నారు.

మొదటి నుంచి ఈ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీకి పట్టు ఎక్కువ. పార్టీ ఫిరాయించిన నాటి నుంచి కొత్తపల్లి గీతపై గిరిజనుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున విజయం సాధించిన వంతల రాజేశ్వరి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడాన్ని నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పారు. ఇదే పరిస్థితి కొత్తపల్లి గీతకు కూడా తప్పదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

టీడీపీ శ్రేణులు మొరపెట్టుకున్నా..
రంపచోడవరం అసెంబ్లీకి సంబంధించి టీడీపీ అభ్యర్థిని మార్చాలని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి నాయకత్వంలో ఆందోళన చేసినప్పటికీ అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన లేదు. పార్టీలో సీనియర్లను కాదని మిరియాల శిరీష దేవికి ఎలా టికెట్‌ ఇస్తారని, దీనివల్ల నష్టం జరుగుతుందని పార్టీ శ్రేణులు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. నెలరోజుల క్రితం పార్టీలోకి వచ్చిన ఆమెకు పార్టీ టికెట్‌ ఇవ్వడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, శీతంశెట్టి వెంకటేశ్వరరావు అనుచరులు బహిరంగంగా విమర్శించారు.

టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీషదేవి భర్త భాస్కర్‌కు సంబంధించిన కేసుల వివరాలను టీడీపీకి చెందిన ఓ సీనియర్‌ నాయకుడు స్వయంగా చంద్రబాబుకు అందజేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసగించినట్టుగా ఆయనకు వివరించారు. ఈ పరిస్థితుల్లో శిరీషదేవిని అభ్యర్థిగా కొనసాగిస్తే పార్టీకి నష్టం తప్పదని తెలియజేసినా చంద్రబాబు పట్టించుకోలేదని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగా చెబుతున్నాయి.

రెబల్‌గా బరిలోకి?
చంద్రబాబు ఇచ్చిన ఝలక్‌తో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఇంటికే పరిమితమయ్యారు. టీడీపీ తనకు రూ.20 కోట్లు ఆఫర్‌ ఇచ్చినప్పటికీ వైఎస్సార్‌సీపీని విడిచి వెళ్లేది లేదని అప్పటిలో ప్రకటించిన వంతల రాజేశ్వరి ఆ తరువాత పార్టీ ఫిరాయించడంపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అదే ఆమె ఓటమికి కారణమైంది. అప్పటిలో పార్టీ మారేదిలేదని ఆమె ప్రకటించిన దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇలా టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలావుండగా ఎన్నికల్లో టీడీపీ రెబల్‌గా పోటీచేయాలా లేదా అనే దానిపై వంతల రాజేశ్వరి అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.

ఇవి చదవండి: కాలవ మోసం.. ఇదే సాక్ష్యం!

Election 2024

మరిన్ని వార్తలు