దొంగ వెనుక దీన గాథ!

5 Nov, 2023 07:53 IST|Sakshi

అనంతపురం క్రైం: జల్సాలు, వ్యసనాల కోసమో దొంగతనాలు చేయడం చూశాం. అయితే, ఓ యువకుడు తన తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకునేందుకు దొంగగా మారాడు. కిలో బంగారం చోరీ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న దొంగ వెనక విషాద గాథ ఉన్నట్లు తెలిసింది. ఆ దీనగాథ పోలీసుల మనసులను కూడా కదిలించినట్లు సమాచారం. అతడి కష్టాలను విన్న పోలీసులు పాపం విధి వంచితుడంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు.. గుజరాత్‌లోని సూరత్‌ ప్రాంతానికి చెందిన వినయ్‌ తల్లిదండ్రుల ఎడబాటును తట్టుకోలేక ఆరేళ్ల వయసులో ఇంటి నుంచి తప్పించుకుని వచ్చాడు.

రైలుగుండా అనంతపురం చేరుకున్నాడు. స్థానిక పోలీసులకు చిక్కాడు. వినయ్‌ని తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని పోలీసులు సాగించిన అన్వేషణ ఫలించలేదు. దీంతో నగరంలోని విజయనగర కాలనీలో ఉన్న సీడబ్ల్యూసీ గృహంలో చేర్చారు. ఆదరించాల్సిన పాస్టర్‌ వినయ్‌ని నిత్యం చితకబాదుతూ హింసించడం ప్రారంభించాడు. దీంతో మళ్లీ అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఫ్లాట్‌ఫాంపై పడ్డాడు. కడుపు నింపుకునే మార్గం కనిపించలేదు. సెల్‌ఫోన్లు చోరీ చేసి వాటిని అమ్ముకుని పొట్ట పోసుకోవడం ఆరంభించాడు.

వేసుకునేందుకు దుస్తులు కూడా లేకపోవడంతో నగరంలో ఆరుబయట ఇళ్ల ముందు ఆరేసిన వస్త్రాలను అపహరించేవాడు. అదే ప్రవృత్తిగా మారిపోయింది. అలా వినయ్‌కు 18 ఏళ్లు దాటాయి. ఈ క్రమంలోనే తన వాళ్లను కలుసుకునేందుకు సూరత్‌ చేరుకున్నాడు. తల్లిదండ్రుల జాడ కనిపించలేదు. దీంతో మళ్లీ అనంతపురం చేరుకున్నాడు. స్థానిక ఎన్టీఆర్‌ మార్గ్‌లోని మయూరీ హోటల్‌లో సప్లయర్‌గా చేరాడు. దొంగతనాలు చేయడం మాత్రం మానలేదు. అలా కొంత కాలం క్రితం స్థానిక రెండో రోడ్డులోని ఓ ఇంట్లో చొరబడ్డాడు. చాలా డబ్బు, బంగారం గుర్తించినా.. కొన్ని దుస్తులు, కొంత బంగారం, డబ్బు దొంగిలించాడు. మళ్లీ కన్న వారి కోసం సూరత్‌ పయనమయ్యాడు.

మూడో సారికి చిక్కాడు..
అయిన వారిని కలుసుకుందామని వినయ్‌ చేసిన ప్రయత్నం మళ్లీ ఫలించలేదు. దీంతో తిరిగి నగరానికి చేరుకున్నాడు. రెండో సారి కూడా రెండో రోడ్డులోని అదే ఇంట్లో కొంత నగదు చోరీ చేశాడు. అదే క్రమంలో ఇటీవల మూడో సారిగా మళ్లీ గృహంలో చొరబడ్డాడు. కొంత డబ్బు, బంగారం, పంచలోహ విగ్రహం తీసుకుని మయూరీ హోటల్‌కు వెళ్లాడు. తనతో పాటు హోటల్‌లో పని చేసే మహిళకు బంగారు నెక్లెస్‌, పనివాళ్లలో తెలిసిన మిత్రుడికి బంగారు గొలుసు, హోటల్‌ యజమానికి పంచలోహ విగ్రహం ఇచ్చాడు.

అయితే, మహిళ తనకిచ్చిన నెక్లెస్‌ గిల్టుదని భావించి అందరి ముందే మురుగు గుంతలో పడేసింది. ఈ క్రమంలోనే తన ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ కోసం ఆరా తీస్తుండగా.. బంగారాన్ని కొందరికి ఉచితంగా ఓ యువకుడు ఇస్తున్నాడనే సమాచారం తెలిసి అతన్ని పట్టుకున్నారు.

విచారణ చేపట్టగా రెండో రోడ్డులో చోరీ చేసింది తానేనని ఒప్పుకున్నాడు. సొంతూ రులో బంగారం ఎక్కడైనా దాచుంటాడని పోలీసులు గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లారు. అయితే, అక్కడ అతనికి తెలిసిన వారు లేరు. ఈ క్రమంలో వినయ్‌ను ఆరా తీస్తే తన గతాన్నంతా పూసగుచ్చినట్టు వివరించాడు. చలించిన పోలీసులు అతని కుటుంబ సభ్యుల కోసం ఆరా తీస్తే, తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని, తండ్రి కొన్ని రోజుల క్రితమే మృతి చెందాడని తెలిసింది. ఈ విషయాన్ని ఇప్పటికీ పోలీసులు వినయ్‌కు చెప్పలేదు.

మరిన్ని వార్తలు