22న పుట్టపర్తికి రాష్ట్రపతి రాక

12 Nov, 2023 01:30 IST|Sakshi
శ్రీనివాస అతిథి గృహం వద్ద ఏర్పాట్లపై చర్చిస్తున్న ఎస్పీ మాధవరెడ్డి, జేసీ చేతన్‌

ప్రశాంతి నిలయం: జిల్లాకేంద్రం పుట్టపర్తికి ఈ నెల 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. సత్యసాయి డీమ్డ్‌ యూనవర్సిటీ 42వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొంటారు. రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా ఉత్సవంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి, జేసీ చేతన్‌, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ప్రతినిధులతో కలసి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ప్రముఖులు బస చేసే శాంతి భవన్‌ అతిథి గృహం, సాయి శ్రీనివాస అతిథి గృహం, సాయి హీరా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, సాయికుల్వంత్‌ సభా మందిరం, గోపురం గేట్‌, వెస్ట్‌ గేట్‌ తదితర ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వాహన పార్కింగ్‌ తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో చర్చించారు.

లోపాలు తలెత్తనీయొద్దు..

నవంబర్‌ 18 నుంచి 24 వరకూ సాగనున్న సత్యసాయి జయంత్యుత్సవాలకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నట్లు ఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ప్రత్యేక విమానంలో సత్యసాయి విమానాశ్రయం చేరుకోనున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పుట్టపర్తికి చేరుకోనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ భాగ్యరేఖ, అడిషనల్‌ ఎస్పీ ఎన్‌.విష్ణు, డీఎస్పీ వాసుదేవన్‌, ఏఆర్‌ డీఎస్పీ విజయ్‌కుమార్‌, ఎస్బీ సీఐ రవీంద్రారెడ్డి, పట్టణ సీఐ కొండారెడ్డి, ఆర్‌ఐ టైటాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి డీమ్డ్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న ద్రౌపది ముర్ము

భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన

ఉన్నతాధికారులు

మరిన్ని వార్తలు