శ్రీశైలానికి 1,07,853 క్యూసెక్కుల వరద

11 Oct, 2022 05:20 IST|Sakshi

నాగార్జునసాగర్‌ 12 గేట్ల నుంచి నీటి విడుదల 

శ్రీశైలం ప్రాజెక్ట్‌/మాచర్ల/సత్రశాల(రెంటచింతల): కొద్ది రోజులుగా కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం సమయానికి జూరాల, సుంకేసుల నుంచి 1,07,853 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మూడు క్రస్ట్‌గేట్లను పదడుగులు ఎత్తి 83,811 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పాదన అనంతరం 66,199 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేశారు.

బ్యాక్‌వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 2,750 క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 338 క్యూసెక్కులు వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 884.70 అడుగుల మట్టంలో 213.8824 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి, స్థానికంగా ఉన్న ఉప నదుల ఉంచి నాగార్జునసాగర్‌ జలాశయానికి 1,46,318 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ 12 గేట్లను ఐదడుగులు ఎత్తి 96,696, విద్యుదుత్పాదన అనంతరం 32967.. కలిపి మొత్తం 1,29,663 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

కుడి, ఎడమ కాల్వలు, వరద కాలువ, ఎస్‌ఎల్‌బీసీలకు మొత్తం 16,665 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్‌ జలాశయంలో 589.60 అడుగుల మట్టంలో 310.8498 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి 1,14,029, రెండు యూనిట్లలో విద్యుదుత్పాదన అనంతరం 7,206.. కలిపి మొత్తం  1,21,235 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు