విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో  భారీ అగ్నిప్రమాదం

21 Nov, 2023 05:53 IST|Sakshi

36 మత్స్యకార బోట్లు పూర్తిగా.. తొమ్మిది పాక్షికంగా దగ్ధం

రూ. కోట్లలో నష్టం వాటిల్లినట్లు అంచనా

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం షిప్పింగ్‌ హార్బర్‌లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ బోటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 45 బోట్లు కాలిపోయాయి. ఉద్దేశపూర్వకంగానే కొందరు మద్యం మత్తులో ఈ బోట్లకు నిప్పు పెట్టినట్టు పోలీసులు ప్రాథమికంగా అనుమానించినప్పటికీ అది నిర్ధారణ కాలేదు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఆయన చాలా ఉదారంగా స్పందించారు. దగ్థమైన బోట్ల విలువలో 80 శాతం మేర పరిహారంగా అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అలాగే, ఈ ఘటనపై లోతై న దర్యాప్తు జరిపి కారణాలు వెలికితీయాలన్నారు. 

ప్రమాదవశాత్తూ దుర్ఘటన.. 
తొలుత.. ఆదివారం అర్ధరాత్రి కొంతమందితో కలిసి ఓ యూట్యూబర్‌ హార్బర్‌లోని జీరో నెంబర్‌ జెట్టీలో లంగరు వేసి ఉన్న బోటులో మందు పార్టీ చేసుకున్నాడని, వారిలో వారికి గొడవ మొదలై నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అనుమానించారు. అలాగే, యూట్యూబర్‌కు చెందిన బోటును మరొకరికి అమ్మారని, కొనుగోలు చేసిన వ్యక్తి ఆ సొమ్మును సకాలంలో ఇవ్వకపోవడంతో బోటును తగులబెడ్తానని కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నాడని, అలా ఆదివారం అర్థరాత్రి అన్నంత పనీ చేశాడన్న ప్రచారం కూడా జరిగింది.

సంఘటన స్థలంలో ఉండి తగలబడిపోతున్న బోట్లను తన సెల్‌ఫోన్లో యూట్యూబర్‌ చిత్రీకరించి తన యూ­ట్యూబ్‌లో ఉంచడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరింది. దీంతో పోలీసులు ఆ యూ­ట్యూ­బ­ర్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నా­రు. ప్రాథమిక విచారణలో అది నిర్ధారణ కాకపోవడంతో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు కేసు నమోదు చేశారు.   

45 మెకనైజ్డ్‌ బోట్లు అగ్నికి ఆహుతి.. 
ఈ ప్రమాదంలో మొత్తం 45 మెకనైజ్డ్‌ బోట్లు దగ్థమైనట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 36 బోట్లు పూర్తిగాను, తొమ్మిది బోట్లు పాక్షికంగాను దగ్థమయ్యాయి. కొన్ని బోట్లు పూర్తిగా నీటిలో మునిగిపోగా మరికొన్ని వాటి ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక సోమవారం తెల్లవారుజామున వేటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న బోట్లు, వేటకు వెళ్లి హార్బర్‌కు వచ్చిన బోట్లు కూడా ప్రమాదానికి గురయ్యాయి. ఈ బోట్లలో ఉన్న వేల లీటర్ల డీజిల్, టన్నుల కొద్దీ వేటాడి తెచ్చిన చేపలు, రొయ్యలు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కో బోటు విలువ దాని స్థితిని బట్టి రూ.25 నుంచి 60 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ లెక్కన అగ్నిప్రమాదంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు భావిస్తున్నారు.  

తప్పిన పెనుముప్పు.. 
హార్బర్‌లో అగ్నిప్రమాదం సంభవించిన ప్రాంతానికి కొద్దిమీటర్ల దూరంలోనే హిందుస్తాన్‌ పెట్రోలియంకు చెందిన డీజిల్‌ బంకరింగ్‌ ఇన్‌స్టాలేషన్‌ ఉంది. అక్కడ 365 కిలోలీటర్ల డీజిల్‌ నిల్వలున్నాయి. అలాగే, హార్బర్‌ సమీపంలోనే విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (వీసీటీపీఎల్‌) కూడా ఉంది. దీంతో ఏదైనా పేలుడు సంభవించి ఆ శకలాలు వచ్చి పడితే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. అయితే, అలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 

మరిన్ని వార్తలు