విషజ్వరాలూ ఆరోగ్యశ్రీలోకి..

8 Sep, 2021 02:57 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఆళ్ల నాని. చిత్రంలో మంత్రులు కురసాల, ముత్తంశెట్టి తదితరులు

విశాఖ జిల్లాలో ఎక్కువగా డెంగీ, మలేరియా కేసుల నమోదు

ఏజెన్సీలో కేసులు గుర్తించేందుకు పరీక్షల సంఖ్య పెంపు

త్వరితగతిన దోమ తెరల పంపిణీకి చర్యలు

ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడి

సాక్షి, విశాఖపట్నం: సీజనల్‌ వ్యాధులైన డెంగీ, మలేరియాతో పాటు విషజ్వర పీడితులకు కూడా ఆరోగ్యశ్రీలో వైద్యం అందించనున్నట్లు ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. విశాఖ జిల్లాలో సీజనల్‌ వ్యాధులపై వైద్యాధికారులు, వైద్యులతో మంగళవారం ఆయన ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
(చదవండి: ఉపాధ్యాయుడికి దేహశుద్ధి)

రాష్ట్రవ్యాప్తంగా విశాఖ జిల్లాలోనే అత్యధిక మలేరియా, డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 462 డెంగీ, 708 మలేరియా, 24 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయని తెలిపారు. లోతట్టు, నీటి నిల్వలున్న ప్రాంతాలు, దోమల లార్వా నిల్వ ప్రాంతాల్లో ప్రతిరోజూ శానిటైజేషన్‌ చేయడమే కాకుండా వైద్య శిబిరాలు నిర్వహించేలా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశామని మంత్రి నాని చెప్పారు. అలాగే, ఐటీడీఏ పరిధిలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య పరికరాలు, పరీక్షలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

హాట్‌స్పాట్‌ ప్రాంతాల గుర్తింపు
విషజ్వరాలు, డెంగీ, మలేరియాతో పాటు సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్న ప్రాంతాలను ‘హాట్‌ స్పాట్‌’ ప్రాంతాలుగా గుర్తించి.. అక్కడే వైద్య సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆళ్ల నాని వెల్లడించారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అర్బన్‌ ప్రాంతాల్లో డెంగీ ప్రబలుతున్న ప్రాంతాల్లో నిరంతరంగా ఫాగింగ్, స్ప్రే చేయిస్తున్నామని, ఏజెన్సీలో దోమ తెరలు పంపిణీ ప్రక్రియను వేగవంతంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రజలు కూడా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  
(చదవండి: Bigg Boss 5 Telugu: జనాలను పిచ్చోళ్లను చేసిన లోబో, సిరి)

మరిన్ని వార్తలు