నేషనల్‌ గట్క పోటీలలో ఏపీకి రజతం.. తొలి ప్రయత్నం లోనే..

11 Aug, 2021 20:01 IST|Sakshi

సాక్షి, తిరుపతి (చిత్తూరు): 9వ జాతీయస్థాయి గట్క మెన్‌ అండ్‌ ఉమెన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలలో తిరుపతికి చెందిన ర్యాలీ నవశక్తి సత్తా చాటింది. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు ఈ పోటీలు పంజాబ్‌ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో ఇండియన్‌ గట్క అసోసియేషన్‌ నిర్వహించింది. ఉత్తమ ప్రతిభ కనరబరచి నవశక్తి సిల్వర్‌ మెడల్‌ సాధించినట్లు ఆంధ్రప్రదేశ్‌ గట్క అసోసియేషన్‌ అధ్యక్షురాలు జ్యోత్సా్నదేవి తెలిపారు. అండర్‌–19 విభాగంలో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన నవశక్తి వరుసగా హిమాచల్‌ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, కర్ణాటక క్రీడాకారిణులపై గెలిచి, ఫైనల్స్‌లో పంజాబ్‌తో తలపడి రెండో స్థానంలో నిలిచిందని ఆమె చెప్పారు.

ముగింపు రోజున  కేంద్ర క్రీడల శాఖా మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ చేతుల మీదు గా  రజత పతకాన్ని అందుకుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎందరో క్రీడాకారిణులు పాల్గొన్నప్పటికీ నవశక్తి మాత్రమే పతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని జ్యోత్సా్నదేవి, రాష్ట్ర రెజ్లింగ్‌ అసోసియేషన్‌ సెక్రటరీ మిట్టపల్లి సురేంద్రరెడ్డి, జిల్లా గట్క అసోసియేషన్‌ సెక్రటరీ శివ ఆమెను అభినందించారు. డిసెంబర్‌లో హర్యానా రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా నేషనల్స్‌కు నవశక్తి ఎంపికైందని తెలిపారు.

ప్రయాణం చేస్తూనే..ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌కు హాజరు! 
నవశక్తి చిన్నతనం నుంచే క్రీడల్లో విశేషంగా రాణి స్తోంది. పలు రికార్డులు సొంతం చేసుకుంది. రాష్ట్ర, జాతీయస్థాయి పురస్కారాలు సైతం ఎన్నో అందుకుంది. తొలుత స్విమ్మింగ్, స్కేటింగ్, తర్వాత కరాటే, రెజ్లింగ్, ఇప్పుడు గట్కలో తన సత్తా చాటుతూ క్రీడల్లో తన ప్రత్యేకతను చాటు కుంటోంది. ప్రస్తుతం చెన్నైలో బీటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న నవశక్తి జాతీయస్థాయి గట్క పోటీల్లో పాల్గొనేందుకు తిరుపతి నుంచి  ట్రైన్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టుతో వెళ్తూనే తనతోపాటు లాప్‌టాప్‌ తీసుకెళ్లింది. ప్రయాణిస్తూనే ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవడమే కాకుండా ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్ష సైతం రాయడం గమనార్హం!    

మరిన్ని వార్తలు