సున్నా నుంచి మిన్నగా.. 

17 Jan, 2022 05:13 IST|Sakshi

ప్రణాళికాబద్ధంగా కరోనా మహమ్మారిపై యుద్ధం 

ఇప్పటికే బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్, నీతి ఆయోగ్‌ కితాబు 

తొలిరోజుల్లో పుణెలోనే నిర్ధారణ పరీక్షలు.. ఇప్పుడు ఇక్కడే  

104 కాల్‌ సెంటర్‌ ద్వారా విశిష్ట సేవలు 

ఆక్సిజన్‌ కొరతకూ చెక్‌ 

124 ఆస్పత్రుల్లో నిమిషానికి 93,600 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యంతో 144 పీఎస్‌ఏ ప్లాంట్లు ప్రారంభం 

వ్యాక్సినేషన్‌లోనూ దేశంలో ఏపీదే అగ్రస్థానం

‘కరోనా కట్టడిలో గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్‌ఎంలు కీలకపాత్ర పోషించారు. ప్రభుత్వం వీరి ద్వారా ఇంటింటి సర్వే చేపట్టి అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచడం, మందులు పంపిణీ చేయడం బాగుంది. రాష్ట్రంలో హోమ్‌ ఐసోలేషన్‌ సమర్థవంతంగా నిర్వహించారు’..
కరోనా తొలిదశ (2020 జూన్‌లో)వ్యాప్తి సమయంలో రాష్ట్రంలో పర్యటించిన బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ చేసిన వ్యాఖ్యలివి

2014–19 వరకూ టీడీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి అస్సలు నోచుకోని ప్రభుత్వాసుపత్రులు.. ఎటు చూసినా అరకొర వసతులు.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వైరాలజీ ల్యాబ్‌ లేని దుస్థితి.. ఆ తర్వాత 2020 ప్రారంభంలో కరోనా వైరస్‌ మొదలైన నాటికి రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదు. కానీ, టీడీపీ హయాం నాటి దురవస్థలను చక్కబెట్టుకుంటూ వైరస్‌పై పోరుకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నాడు నడుంబిగించింది. ప్రారంభంలో రెండు ఆసుపత్రుల్లో 210 పడకలతో కరోనా చికిత్సను ప్రారంభించింది. క్రమంగా మొదటి దశలో ఆసుపత్రుల సంఖ్యను 243కు.. పడకలను 37,044కు పెంచుకుంటూపోయింది. అలాగే, 2020 మార్చిలో తొలి కరోనా కేసు నమోదైన సమయంలో నమూనాలను పుణెకు పంపి రోజులు, వారాలు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి మూడు నెలల్లో రోజుకు 70వేల పరీక్షలు చేయగలిగే ల్యాబ్‌లను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సమకూర్చింది. అంతేకాదు.. కరోనా సేవల కోసం 18,903 మంది వైద్య సిబ్బందినీ నియమించింది.  
గత ఏడాది నీతి ఆయోగ్‌ అధ్యయనంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన కితాబు ఇది 

సాక్షి, అమరావతి: ‘కరోనాను ఏపీ విజయవంతంగా ఎదుర్కొంటోంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి 4.5 లక్షల మంది వలంటీర్లు, 11 వేల మంది గ్రామ కార్యదర్శులతో టెక్నాలజీని అందిపుచ్చుకుని కరోనా లక్షణాలున్న వారిని క్వారంటైన్‌ చేస్తున్నారు’..  

ఆపద్బాంధవి 104 కాల్‌ సెంటర్‌  
తొలిదశలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రెండో దశలో 104 కాల్‌ సెంటర్‌ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ సెంటర్‌ ద్వారా కరోనాకు సంబంధించిన సమగ్ర సమాచారం, సేవలు, టెలీమెడిసిన్‌ సేవలను ప్రభుత్వం అందించింది. దీనిద్వారా ఇప్పటివరకూ 12.04 లక్షల మంది సేవలు పొందారు. ఫోన్‌చేస్తే కరోనా నిర్ధారణ పరీక్షలకు టోకెన్‌ రైజ్‌ చేయడం మొదలు, పాజిటివ్‌ అయితే ఆసుపత్రికి తరలించే అంబులెన్స్‌ను అందుబాటులోకి తేవడం, ఆసుపత్రిలో బెడ్‌ను సమకూర్చడం ఇలా అనేక సేవలు కాల్‌ సెంటర్‌ ద్వారా అందాయి. రాష్ట్రస్థాయి కాల్‌ సెంటర్‌తో పాటు, జిల్లా, మండలం, గ్రామం, మున్సిపాలిటీ ఇలా అన్ని స్థాయిల్లో కాల్‌ సెంటర్‌లను నేటికీ ప్రభుత్వం నడుపుతోంది. 

ఆక్సిజన్‌కు కొరత లేకుండా.. 
అలాగే, రెండో దశలో రాష్ట్రంలో రోజుకు 686 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఏర్పడింది. అప్పట్లో ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్‌ సరఫరా అవుతుండేది. స్టేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలు తెలుసుకోవడం.. మర్నాడు ఎంత అవసరం అవుతుందో ముందురోజే అంచనా వేస్తూ ప్రాణవాయువుకు కొరత ఏర్పడి మరణాలు సంభవించకుండా ప్రభుత్వం సకల చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్‌ సరఫరా ట్యాంకర్లను గ్రీన్‌ చానల్‌ ద్వారా పోలీస్‌ శాఖ సైతం తరలించింది.  

పెద్దఎత్తున ప్రాణవాయువు ప్లాంట్లు 
రెండో దశ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 50 పడకలు పైబడిన ప్రతి ప్రభుత్వాసుపత్రిలో ప్రభుత్వం ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటుచేసింది. 124 ఆసుపత్రుల్లో నిమిషానికి 93,600 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యంతో 144 పీఎస్‌ఏ ప్లాంట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇటీవలే ప్రారంభించారు. తద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో 24,419 పడకలకు నిరంతరాయంగా ఆక్సిజన్‌ సరఫరా అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రభుత్వాసుపత్రుల్లో దేశంలో అత్యధికంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌లు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

కరోనా కట్టడికి సర్కారు చర్యలివే.. 
► వైరస్‌ కట్టడికి అనుమానిత లక్షణాలున్న వ్యక్తులను గుర్తించడం, వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం, చికిత్స అందించడం (ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌) విధానానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది.  
► ఇప్పటివరకూ 34సార్లు రాష్ట్రంలోని 1.66 కోట్ల ఇళ్లకు వైద్య, ఆరోగ్య సిబ్బంది వెళ్లి ఫీవర్‌ సర్వే చేపట్టారు. మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో 35వ విడత ఫీవర్‌ సర్వే ప్రస్తుతం నడుస్తోంది.  
► ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేశారు. వీటి ద్వారా పడకల లభ్యత, రోగుల ఆరోగ్య పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలాగే, రోగుల ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు తెలుసుకోవడానికి ఇవి వీలు కల్పించాయి. 
► సీసీ కెమేరాల ద్వారా క్వారంటైన్‌ సెంటర్లు, ఆసుపత్రులపై నిరంతర నిఘాను ప్రభుత్వం ఉంచింది.  
► ఆరోగ్యశ్రీ కింద కరోనా రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించిన తొలి రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది.   
► టీకా పంపిణీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దేశంలోనే రికార్డు సాధించింది. అనతి కాలంలోనే 15–18 ఏళ్ల మధ్య ఉన్న 24 లక్షల మంది పిల్లలకు 100 శాతం టీకా పంపిణీ పూర్తిచేసింది. టీకా పంపిణీలో దేశంలోనే అగ్రస్థానంలో రాష్ట్రం నిలిచింది. అదే విధంగా 18 ఏళ్లు పైబడిన వారికి 100 శాతం తొలిడోసు, 80 శాతానికిపైగా రెండు డోసుల టీకా పంపిణీ పూర్తయింది.

దేశానికి ఆదర్శం 
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శం. గ్రామ, వార్డు సచివాలయం, వలంటీర్‌ వ్యవస్థ వైరస్‌ కట్టడిలో కీలక భూమిక పోషించింది. తొలి రెండు దశలను సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రభుత్వం, మూడో దశ ఎదుర్కోవడానికి పూర్తిస్థాయిలో ఆక్సిజన్, మందులు, పడకలతో ఆసుపత్రులు సిద్ధంగా ఉండటం అభినందనీయం.
– అడుసుమిల్లి జయప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే 

మూడో దశ ఎదుర్కోడానికి సిద్ధం 
వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారుల సహకారంతో రెండు దశలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. అదే స్ఫూర్తితో మూడో దశ వైరస్‌ వ్యాపించినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు వైరస్‌ వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.  
– కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌  

మరిన్ని వార్తలు